రాష్ర్టంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పన్నుల పేరుతో ప్రజల నడ్డి విరిచేందుకు సన్నద్ధమవుతోంది. నిన్నటి వరకు మున్సిపాలిటీల్లో పన్నులు రాబట్టుకుని ఆదాయాన్ని పెంచుకోవాలని ఆదేశించిన ప్రభుత్వం తాజాగా పల్లె జనంపై కూడా పన్నుపోటు వేయనుంది. వివిధ రకాల పన్నులతో పంచాయతీల ఆదాయం పెంచుకోవాలనే దిశగా యోచిస్తోంది.
రాజంపేట: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల నుంచి వివిధ రూపాల్లో పన్నులు వసూలు చేసి తద్వారా స్థానిక సంస్థలకు ఆదాయం కల్పించడంపై దృష్టి సారించింది. కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు తమకు వచ్చే ఆదాయంతో అభివృద్ధి చేసుకోవాలని చెబుతూనే అందుకు అవసరమైన ఇంటిపన్నులు మొదలుకుని ఎన్నిరకాల పన్నులు ఉన్నాయో అన్నీ పెంచుకోవాలని మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం పైసా కూడా విదల్చదని..‘మీ అభివృద్ధి..మీ పన్నులతోనే’ అనే నినాదాన్ని చంద్రబాబు సర్కారు తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పుడు అదేరీతిలో పల్లెలపై కూడా పంచాయతీరాజ్ శాఖ ద్వారా పన్నుపోటు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. పంచాయతీల వారీగా ఆదాయవనరులు కల్పించుకోవాలని ఆ శాఖ ఉన్నతాధికారులు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీ చేయడంతో ఇక అందరి దృష్టి పల్లెలపై పడనుంది. జిల్లాలో 700 పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో పన్నులు పెంచుకునేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేయనున్నారు.
48 రకాల పన్నులు..
పంచాయతీరాజ్ కమిషనర్ గ్రామాల్లో 48 రకాల పన్నులు విధించవచ్చని గుర్తించారు. ఆయా రకాల వృత్తులు, పనులు తదితర వాటిని గుర్తించి వాటి వివరాలను ఆర్‌ఏ పీఆర్ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. వాటిపై పన్నులు ఎలా వేయాలి..ఎంతెంత వసూలు చేయాలనే విషయంపై దిశానిర్దేశం చేశారు. తక్కువ జనాభా ఉండే పల్లె పంచాయతీ మొదలుకుని మేజర్ పంచాయతీల వరకు ఈ పన్నును వర్తింపజేసేందుకు గత యేడాది డిసెంబరులో సమగ్ర సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదించారు. ఇప్పుడు రాజంపేట, జమ్మలమడుగు, కడప డివిజన్లలో పెలైట్‌ప్రాజెక్టుగా కొన్ని గ్రామాలను తీసుకొని ఆయా డీఎల్‌పీఓల పర్యవేక్షణలో ఈఓపీఆర్డీల నేతృత్వంలో సర్వేలు నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా..
జిల్లాలోని అన్ని మండలాల్లో ఈనెల 19,20వ తేదీలలో ఈ సర్వేను చేపట్టనున్నారు. ఈ సర్వే ద్వారా వేటివేటికి పన్ను వేయాలి..పన్ను చెల్లించనివారు ఉన్నారా? ఇళ్లు, నీటికనెక్షన్లు తదితర అన్ని అంశాలపై కూలంకషంగా వివరాలు తెలుసుకున్న తర్వాత పన్నుల వేటను పంచాయతీలు ప్రారంభించనున్నాయి. ప్రజల్లో ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండానే పన్నులు రాబట్టాలని అధికారులకు మంత్రులు, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో అటు ప్రజలకు..ఇటు ప్రభుత్వానికి మధ్య గ్రామ, మండల స్థాయి అధికారులు నలిగిపోతున్నారు. ప్రజలనుంచి వచ్చే విమర్శలను ఎలా తట్టుకోవాలని తర్జనభర్జన పడుతున్నారు.
ఒకటేంటి..
పల్లె నుంచి మండల కేంద్రం వరకు ఒకటేంటి.. ఎన్ని రూపాల్లో వీలయితే అన్ని రూపాల్లో ఆదాయవనరులను సమకూర్చుకోవాలనే దిశగా పన్నుల వసూలుకు టీడీపీ సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. పల్లెల్లో ఉన్న వివిధ రకాల వ్యాపారాలు, వ్యక్తిగత వ్యాపారం, పబ్లిసిటీకి సంబంధించిన బోర్డులు, రైతుల ఉత్పత్తులు ఇలా ఒకటేంటి పలు విధాలుగా ప్రజల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేసేందుకు పంచాయతీ అధికారులు సన్నద్ధులవుతున్నారు. రైతుల నుంచి కాటారుసం(ధాన్యం,ఉద్యానవన పంటలు) వసూలు చేయనున్నారు. క్వింటాళ్ల లెక్కన పన్ను రాాబట్టేందుకు సిద్ధమవుతున్నారు.
గోడమీదరాతలు, ఇటుకలతయారీ, ప్రచారహోర్డింగ్(కమర్షియల్), కొళాయిల డిపాజిట్లు, షాపుల లెసైన్సులు, పిండిమిషనర్లు, ఖాళీ స్థలం, వ్యవసాయభూమి,సెల్‌టవర్స్, ఫోర్‌వీలర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే పల్లెల్లో జనం వేటిపై ఆధారపడి జీవిస్తున్నారో వాటన్నింటిపై పన్నులు వేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గ్రామీణుల్లో గుబులు పుట్టిస్తోంది.
పల్లెపై పన్ను పోటు!
Published Mon, Feb 16 2015 3:08 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement