
వనపర్తి టౌన్ : మున్సిపాలిటీలో ప్రజాసమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా అమల్లోకి వచ్చిన స్వచ్ఛత యాప్ వినియోగంలో వనపర్తి మున్సిపాలిటీ అట్టడుగు స్థానంలో ఉంది. పట్టుమని పది సమస్యలను కూడా పరిష్కరించలేని అధికారుల నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. స్థానిక మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల ఫొటోలు తీసి ఫిర్యాదుచేస్తే వాటిని రాష్ట్ర, జాతీయస్థాయి అధికారులు పరిశీలించేలా యాప్‌ను రూపొందించారు. వనపర్తి మున్సిపాలిటీలో 26వార్డులు ఉండగా, లక్ష జనాభా ఉంది.
గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ 31వరకు దేశంలోని పురపాలక, నగర పాలక సంఘాల పరిధిలో ఆండ్రాయిడ్ యాప్‌తో పట్టణప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించిన తీరును పరిశీలించి స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్యంలో ఇటీవల ర్యాంకులు ప్రకటించారు. జాతీయస్థాయిలో అత్యధికంగా సమస్యలు పరిష్కరించిన మున్సిపాలిటీలకు ప్రకటించిన ర్యాంకుల్లో వనపర్తికి అట్టడుగుస్థానం దక్కింది. వనపర్తితో పాటు గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్‌కు స్థానం దక్కలేదు. కొన్నేళ్లుగా స్వచ్ఛత యాప్ అమలులో ఉంది. దీనిపై ప్రజల్లో అంతగా అవగాహన లేకపోవడంతో తాము ఎదుర్కొంటున్న సమస్యలను అప్‌లోడ్ చేయడంపై పెద్దగా ఆసక్తిచూపలేదు.
సమస్యల నమోదు
ఆండ్రాయిడ్ పరిజ్ఞానం కలిగి ఫోన్ ద్వారా ప్లే స్టోర్‌లోకి వెళ్లి స్వచ్ఛత యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఆయా సమస్యల పరిష్కారంలో మున్సిపాలిటీ అధికారుల తీరుపై తమ అభిప్రాయాలను పోస్ట్‌చేయాలి.
కేంద్ర ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీలకు ర్యాంకులు కేటాయించే సమయంలో ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు
సమస్యలు అనేకం
రోజురోజుకూ మున్సిపాలిటీ విస్తరిస్తోంది. ప్రజలు తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. డ్రెయినేజీ అస్తవ్యస్తంగా మారడంతో సమస్యను పరిష్కరించమని వనపర్తి పట్టణంలోని రాంనగర్ కాలనీవాసులు కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు. యాప్ సేవలు ఉన్నాయనే విషయం తమకు ఇంతవరకు తెలియదని పట్టణవాసులు పెదవి విరుస్తున్నారు.
ఇక మీదట పక్కాగా..
స్వచ్ఛత యాప్‌లో ముందుకు పోలేకపోయినం. ఆ కార్యక్రమం ముగిసింది స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ర్యాంకు సాధించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాం. ఇందులో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు.
– వెంకటయ్య, వనపర్తి కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment