కంభం బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన షాపులు
ప్రకాశం, మార్కాపురం: డివిజన్ కేంద్రమైన మార్కాపురం మున్సిపాలిటీలో ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. యథేచ్ఛగా స్థలంలో బంకులు పెట్టి దర్జాగా అద్దెలు వసూలు చేస్తున్నారు. 10 స్క్వేర్ మీటర్లు ఉంటే ఏడాదికి మున్సిపాలిటీకి ఆక్రమిత పన్ను రూపంలో కేవలం రూ.2 వేలు వసూలు చేస్తుండగా అద్దె రూపంలో షాపు యజమాని నుంచి ఆక్రమితదారులు రూ.60 వేల వరకు వసూలు చేస్తున్నారు. మార్కాపురం పట్టణంలో మున్సిపల్ స్థలాలకు సంబంధించి కంభం రోడ్డులోని ఆర్‌అండ్‌బీ రహదారిపై, గాంధీ పార్కు చుట్టూ కొన్ని బంకులు, పాత బస్టాండ్‌లో మరికొన్ని బంకులు కలిపి సుమారు 100కు పైగా ఉన్నాయి. ఈ స్థలాలను గతంలో పలువురు ఆక్రమించి అద్దెకు ఇచ్చారు. ఇందులో కిళ్లీ బంకులతో పాటు చికెన్ బండ్లు, టీ బంకులు ఉన్నాయి. మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవటంతో ఆక్రమణదారులకు సంవత్సరానికి స్థల ప్రాధాన్యతను బట్టి రూ.70 వేల నుంచి లక్ష రూపాయల వరకు అద్దె రూపంలో వస్తోంది. మున్సిపల్ అధికారులు 10 స్క్వేర్ మీటర్లు ఉంటే ఏడాదికి రూ.2 వేలు, 12 నుంచి 13 మీటర్లు ఉంటే రూ.5 వేలు, ఆ తరువాత స్థలంలో ఆక్రమణలు ఉంటే రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారు.
నోరు ఉన్న వాడిదే ఆదాయం వచ్చే మార్గంగా మున్సిపల్ స్థలాలు ఉపయోగపడుతున్నాయి. మున్సిపల్ సిబ్బంది ఆక్రమిత స్థలాల జోలికి పోకుండా ఆక్రమణ పన్ను వసూలు చేయటంలోనే శ్రద్ధ చూపుతున్నారు. ముఖ్యంగా కంభం సెంటర్ నుంచి శ్రీనివాస థియేటర్ వరకు సుమారు 70కి పైగా బంకులు ఉన్నాయి. ఈ స్థలాల యజమానులు గతంలో ఆక్రమించుకుని ఆ స్థలాన్ని నెలకు రూ.5 నుంచి రూ.8 వేల వరకు అద్దెలకు ఇస్తున్నారు. మరి కొంత మంది ఇదే స్థలాన్ని రూ.70 వేల నుంచి లక్ష వరకు విక్రయించారు. ప్రభుత్వ స్థలాన్ని దరా>్జగా కబ్జా చేసి అద్దె వసూలు చేస్తుంటే అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టకపోవటంతో ఖాళీ స్థలం కనిపిస్తే బంకు వేసుకోవటం, అద్దెకు ఇచ్చుకోవటం మున్సిపాలిటీలో పరిపాటిగా మారింది. పరోక్షంగా పాలకులు కూడా ఆక్రమణదారులకు సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీని వలన పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ప్రస్తుతం సుమారు 3 వేలకు పైగా ఆటోలు, 5 వేల ద్విచక్ర వాహనాలు, 100 ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్లకు ఇరువైపులా ఆక్రమణలు ఉండటంతో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ఇదే పరిస్థితి నెహ్రూ బజార్, కళాశాల రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ వైపు ఉంది. మున్సిపల్, ఆర్‌అండ్‌బీ సంయుక్తంగా ఆక్రమణలు తొలగించినట్లయితే ట్రాఫిక్ సమస్యను నివారించవచ్చు.
మున్సిపల్ పరిధిలో ఆక్రమణలు తొలగిస్తాం
మున్సిపల్ పరిధిలో ఉన్న ఆక్రమణలను త్వరలో తొలగిస్తాం. అయితే, ప్రధాన రహదారి వెంట ఉన్న ఆక్రమణలను ఆర్‌అండ్‌బీ అధికారులు తొలగించాలి. కంభం రోడ్డు, తర్లుపాడు రోడ్డు, కళాశాల రోడ్డుల్లో ఉన్న ఆక్రమణలు సర్వే చేసి ఆర్‌అండ్‌బీ అధికారులు తొలగించాలి. మేము వసూలు చేసే పన్ను తాత్కాలిక ఆక్రమణ పన్ను మాత్రమే. – షేక్ ఫజులుల్లా, కమిషనర్, మార్కాపురం
Comments
Please login to add a commentAdd a comment