రూ.5.18 లక్షలు.. జీతం కాదు.. ఇంటి అద్దె! | Room Rents In Mumbai Are Very High More Than Bangalore And Delhi, Know Reason Inside | Sakshi
Sakshi News home page

రూ.5.18 లక్షలు.. జీతం కాదు.. ఇంటి అద్దె!

Published Fri, Oct 18 2024 3:29 PM | Last Updated on Fri, Oct 18 2024 4:11 PM

room rent mumbai are very high more than bangalore and delhi

దేశ వాణిజ్య రాజధానిగా పేరున్న ముంబయిలో నివసించాలంటే రూ.5.18 లక్షలు ఉండాల్సిందే. ఇది ఏటా వేతనం అనుకుంటే పొరపడినట్లే..కేవలం ఇంటి అద్దె కోసమే ఇంత వెచ్చించాలి. అవునండి..ముంబయిలో ఇంటి అద్దెలు దేశంలో ఎక్కడా లేనివిధంగా పెరుగుతున్నాయి. సింగిల్‌ బెడ్‌ రూమ్‌(1 బీహెచ్‌కే) ఇళ్లు కావాలంటే ఏకంగా ఐదు లక్షలు చెల్లించాల్సిందేనని ‘క్రెడాయ్‌-ఎంసీహెచ్‌ఐ’ నివేదిక పేర్కొంది.

నివేదికలోని వివరాల ప్రకారం..దేశ వాణిజ్య రాజధానిగా పేరున్న ముంబయిలో ఇంటి అద్దెలు భారీగా పెరుగుతున్నాయి. బెంగళూరులో సింగిల్‌ బెడ్‌రూమ్‌ అద్దె రూ.2.32 లక్షలుగా ఉంటే ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో రూ.2.29 లక్షలుగా ఉంది. ఇందుకు భిన్నంగా ముంబయిలో అధికంగా రూ.5.18 లక్షలు ఇంటి అద్దె ఉంది. స్థానికంగా జూనియర్‌ లెవల్‌ ఉద్యోగికి వచ్చే ఏడాది వేతనం రూ.4.49 లక్షలు. తన సంపాదనపోను ముంబయిలో 1 బీహెచ​్‌కే ఇంటి అద్దె కోసం అప్పు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ ముంబయిలో డబుల్‌ బెడ్‌ రూమ్‌(2 బీహెచ్‌కే) ఇళ్లు అద్దెకు తీసుకోవాలంటే ఉద్యోగుల వేతనం రూ.15.07 లక్షలుండాలి. అందులో రూ.7.5 లక్షలు అద్దెకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే బెంగళూరు, ఢిల్లీలో 2 బీహెచ్‌కే అద్దెలు వరుసగా రూ.3.9 లక్షలు, రూ.3.55 లక్షలుగా ఉన్నాయి.

ముంబయిలోని సీనియర్‌ లెవల్‌ ఉద్యోగుల వేతనం దాదాపు రూ.33.95 లక్షలుగా ఉంది. వారు 3 బీహెచ్‌కే ఇంట్లో అద్దెకు ఉండాలనుకుంటే ఏటా రూ.14.05 చెల్లించాల్సి ఉంటుంది. అది బెంగళూరు, ఢిల్లీలో వరుసగా రూ.6.25 లక్షలు, రూ.5.78 లక్షలుగా ఉంది. అంటే ముంబయిలో సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఇంటి అద్దె బెంగళూరు, ఢిల్లీలోని 3 బీహెచ్‌కే ఇంటి అద్దెకు దాదాపు సమానంగా ఉంది.

ఇదీ  చదవండి: విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..

ముంబయిలో జూనియర్‌, మిడిల్‌ లెవల్‌ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దెలు వారి జీతాలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. పొదుపు, నిత్యావసరాల కోసం వారికి ఇబ్బందులు తప్పడం లేదు. స్థానికంగా కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో ఈ అద్దెలు మరింత అధికంగా ఉండడంతో దూర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దాంతో గంటల తరబడి ప్రయాణించి కార్యాలయానికి వస్తున్నారు. ఫలితంగా తీవ్ర​ శారీరక, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ పరిస్థితుల వల్ల భవిష్యత్తులో ‘బ్రెయిన్‌ డ్రెయిన్‌(మెరుగైన అవకాశాల కోసం ఉద్యోగుల వలస)’కు దారి తీయవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement