rent buildings
-
రూ.5.18 లక్షలు.. జీతం కాదు.. ఇంటి అద్దె!
దేశ వాణిజ్య రాజధానిగా పేరున్న ముంబయిలో నివసించాలంటే రూ.5.18 లక్షలు ఉండాల్సిందే. ఇది ఏటా వేతనం అనుకుంటే పొరపడినట్లే..కేవలం ఇంటి అద్దె కోసమే ఇంత వెచ్చించాలి. అవునండి..ముంబయిలో ఇంటి అద్దెలు దేశంలో ఎక్కడా లేనివిధంగా పెరుగుతున్నాయి. సింగిల్ బెడ్ రూమ్(1 బీహెచ్‌కే) ఇళ్లు కావాలంటే ఏకంగా ఐదు లక్షలు చెల్లించాల్సిందేనని ‘క్రెడాయ్-ఎంసీహెచ్ఐ’ నివేదిక పేర్కొంది.నివేదికలోని వివరాల ప్రకారం..దేశ వాణిజ్య రాజధానిగా పేరున్న ముంబయిలో ఇంటి అద్దెలు భారీగా పెరుగుతున్నాయి. బెంగళూరులో సింగిల్ బెడ్రూమ్ అద్దె రూ.2.32 లక్షలుగా ఉంటే ఢిల్లీ ఎన్సీఆర్లో రూ.2.29 లక్షలుగా ఉంది. ఇందుకు భిన్నంగా ముంబయిలో అధికంగా రూ.5.18 లక్షలు ఇంటి అద్దె ఉంది. స్థానికంగా జూనియర్ లెవల్ ఉద్యోగికి వచ్చే ఏడాది వేతనం రూ.4.49 లక్షలు. తన సంపాదనపోను ముంబయిలో 1 బీహెచ్‌కే ఇంటి అద్దె కోసం అప్పు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ ముంబయిలో డబుల్ బెడ్ రూమ్(2 బీహెచ్‌కే) ఇళ్లు అద్దెకు తీసుకోవాలంటే ఉద్యోగుల వేతనం రూ.15.07 లక్షలుండాలి. అందులో రూ.7.5 లక్షలు అద్దెకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే బెంగళూరు, ఢిల్లీలో 2 బీహెచ్‌కే అద్దెలు వరుసగా రూ.3.9 లక్షలు, రూ.3.55 లక్షలుగా ఉన్నాయి.ముంబయిలోని సీనియర్ లెవల్ ఉద్యోగుల వేతనం దాదాపు రూ.33.95 లక్షలుగా ఉంది. వారు 3 బీహెచ్‌కే ఇంట్లో అద్దెకు ఉండాలనుకుంటే ఏటా రూ.14.05 చెల్లించాల్సి ఉంటుంది. అది బెంగళూరు, ఢిల్లీలో వరుసగా రూ.6.25 లక్షలు, రూ.5.78 లక్షలుగా ఉంది. అంటే ముంబయిలో సింగిల్ బెడ్ రూమ్ ఇంటి అద్దె బెంగళూరు, ఢిల్లీలోని 3 బీహెచ్‌కే ఇంటి అద్దెకు దాదాపు సమానంగా ఉంది.ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..ముంబయిలో జూనియర్, మిడిల్ లెవల్ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దెలు వారి జీతాలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. పొదుపు, నిత్యావసరాల కోసం వారికి ఇబ్బందులు తప్పడం లేదు. స్థానికంగా కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో ఈ అద్దెలు మరింత అధికంగా ఉండడంతో దూర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దాంతో గంటల తరబడి ప్రయాణించి కార్యాలయానికి వస్తున్నారు. ఫలితంగా తీవ్ర శారీరక, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ పరిస్థితుల వల్ల భవిష్యత్తులో ‘బ్రెయిన్ డ్రెయిన్(మెరుగైన అవకాశాల కోసం ఉద్యోగుల వలస)’కు దారి తీయవచ్చు. -
హైదరాబాద్‌లో రెంట్లు ఎంత పెరిగాయో తెలుసా..
హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. రోజు రోజుకు రెంట్లు పెంచేస్తుండడంతో అద్దెకట్టేవారికి ఆర్థికభారం పెరుగుతోంది. ప్రస్తుతం చాలా కంపెనీలు Work from Home వర్క్ ఫ్రం హోం తొలగించి ఉద్యోగస్థులను ఆఫీసులకు రమ్మంటున్నాయి. దాంతో అద్దె ఇళ్లకు గిరాకీ పెరుగుతోంది. అదే అదనుగా ఇంటి యజమానులు రెంట్ పెంచుతున్నారు. కొవిడ్ పూర్వం అద్దెలకు ప్రస్తుతం ఉన్న అద్దెలకు భారీ వ్యత్యాసం ఉంది. 2019తో పోలిస్తే ఇంటి రెంట్లు ఎంత పెరిగాయనేదానిపై ప్రముఖ రియల్టీ సంస్థ హౌసింగ్.కామ్ కీలక నివేదిక విడుదల చేసింది. ఆ విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికలోని వివరాల ప్రకారం.. 2019 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు దాదాపు 25-30 శాతం మేర పెరిగాయి. అలాగే రెసిడెన్షియల్ ప్రాపర్టీల రెంట్లు 15-20 శాతం మేర అధిమయ్యాయి. అద్దెలు పెరిగిన క్రమంలో రెంటల్ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనిపించినట్లు నివేదిక పేర్కొంది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా న్యూయార్క్, లండన్, దుబాయ్, సింగపూర్ వంటి గ్లోబల్ రియల్ ఎస్టేట్ మార్కెట్లతో పోలిస్తే దేశంలో చాలానే గ్యాప్ ఉన్నట్లు తెలిపింది. దేశంలోని టాప్ నగరాల్లో ప్రాపర్టీల ధరలు 2019 ధరలతో పోలిస్తే ప్రస్తుతం 15 నుంచి 20 శాతం మేర పెరిగినట్లు హౌసింగ్.కామ్ నివేదిక వెల్లడించింది. ప్రాపర్టీలు, అద్దె ఇళ్ల కోసం ఆన్లైన్లో సర్చ్ చేస్తున్న వారి సంఖ్య సైతం భారీగానే పెరిగినట్లు తెలిపింది. కొనుగోలు ఇండెక్స్‌తో పోలిస్తే ఐఆర్ఐఎస్ ఇండెక్స్ 23 పాయింట్లు అధికంగా ఉందని పేర్కొంది. ఇదీ చదవండి: ఓవెన్ సైకిళ్లు వచ్చేశాయ్.. ఓ లుక్కేయండి.. 'కరోనా మహమ్మారి తర్వాత హౌసింగ్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రాపర్టీల కొనుగోలు, అద్దెల డిమాండ్ అధికమైంది. దాదాపు దశాబ్ద కాలం పాటు స్తబ్దుగా కొనసాగిన హౌసింగ్ మార్కెట్ ధరల పెరుగుదల గత రెండేళ్లలో మాత్రం గణనీయంగా పెరిగింది. నగరాలను బట్టి ఈ ధరల పెరుగుదల ఆధారపడి ఉంటుంది. అయితే ప్రధాన నగరాల్లోని ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రాపర్టీల ధరలు భారీగా పెరిగాయి.' అని హౌసింగ్.కామ్ సీఈఓ ధ్రువ్ అగర్వాల్ తెలిపారు. -
ఆక్రమించుకో..అద్దె వసూలు చేసుకో!
ప్రకాశం, మార్కాపురం: డివిజన్ కేంద్రమైన మార్కాపురం మున్సిపాలిటీలో ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. యథేచ్ఛగా స్థలంలో బంకులు పెట్టి దర్జాగా అద్దెలు వసూలు చేస్తున్నారు. 10 స్క్వేర్ మీటర్లు ఉంటే ఏడాదికి మున్సిపాలిటీకి ఆక్రమిత పన్ను రూపంలో కేవలం రూ.2 వేలు వసూలు చేస్తుండగా అద్దె రూపంలో షాపు యజమాని నుంచి ఆక్రమితదారులు రూ.60 వేల వరకు వసూలు చేస్తున్నారు. మార్కాపురం పట్టణంలో మున్సిపల్ స్థలాలకు సంబంధించి కంభం రోడ్డులోని ఆర్అండ్బీ రహదారిపై, గాంధీ పార్కు చుట్టూ కొన్ని బంకులు, పాత బస్టాండ్‌లో మరికొన్ని బంకులు కలిపి సుమారు 100కు పైగా ఉన్నాయి. ఈ స్థలాలను గతంలో పలువురు ఆక్రమించి అద్దెకు ఇచ్చారు. ఇందులో కిళ్లీ బంకులతో పాటు చికెన్ బండ్లు, టీ బంకులు ఉన్నాయి. మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవటంతో ఆక్రమణదారులకు సంవత్సరానికి స్థల ప్రాధాన్యతను బట్టి రూ.70 వేల నుంచి లక్ష రూపాయల వరకు అద్దె రూపంలో వస్తోంది. మున్సిపల్ అధికారులు 10 స్క్వేర్ మీటర్లు ఉంటే ఏడాదికి రూ.2 వేలు, 12 నుంచి 13 మీటర్లు ఉంటే రూ.5 వేలు, ఆ తరువాత స్థలంలో ఆక్రమణలు ఉంటే రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారు. నోరు ఉన్న వాడిదే ఆదాయం వచ్చే మార్గంగా మున్సిపల్ స్థలాలు ఉపయోగపడుతున్నాయి. మున్సిపల్ సిబ్బంది ఆక్రమిత స్థలాల జోలికి పోకుండా ఆక్రమణ పన్ను వసూలు చేయటంలోనే శ్రద్ధ చూపుతున్నారు. ముఖ్యంగా కంభం సెంటర్ నుంచి శ్రీనివాస థియేటర్ వరకు సుమారు 70కి పైగా బంకులు ఉన్నాయి. ఈ స్థలాల యజమానులు గతంలో ఆక్రమించుకుని ఆ స్థలాన్ని నెలకు రూ.5 నుంచి రూ.8 వేల వరకు అద్దెలకు ఇస్తున్నారు. మరి కొంత మంది ఇదే స్థలాన్ని రూ.70 వేల నుంచి లక్ష వరకు విక్రయించారు. ప్రభుత్వ స్థలాన్ని దరా>్జగా కబ్జా చేసి అద్దె వసూలు చేస్తుంటే అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టకపోవటంతో ఖాళీ స్థలం కనిపిస్తే బంకు వేసుకోవటం, అద్దెకు ఇచ్చుకోవటం మున్సిపాలిటీలో పరిపాటిగా మారింది. పరోక్షంగా పాలకులు కూడా ఆక్రమణదారులకు సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీని వలన పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ప్రస్తుతం సుమారు 3 వేలకు పైగా ఆటోలు, 5 వేల ద్విచక్ర వాహనాలు, 100 ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్లకు ఇరువైపులా ఆక్రమణలు ఉండటంతో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ఇదే పరిస్థితి నెహ్రూ బజార్, కళాశాల రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ వైపు ఉంది. మున్సిపల్, ఆర్అండ్బీ సంయుక్తంగా ఆక్రమణలు తొలగించినట్లయితే ట్రాఫిక్ సమస్యను నివారించవచ్చు. మున్సిపల్ పరిధిలో ఆక్రమణలు తొలగిస్తాం మున్సిపల్ పరిధిలో ఉన్న ఆక్రమణలను త్వరలో తొలగిస్తాం. అయితే, ప్రధాన రహదారి వెంట ఉన్న ఆక్రమణలను ఆర్అండ్బీ అధికారులు తొలగించాలి. కంభం రోడ్డు, తర్లుపాడు రోడ్డు, కళాశాల రోడ్డుల్లో ఉన్న ఆక్రమణలు సర్వే చేసి ఆర్అండ్బీ అధికారులు తొలగించాలి. మేము వసూలు చేసే పన్ను తాత్కాలిక ఆక్రమణ పన్ను మాత్రమే. – షేక్ ఫజులుల్లా, కమిషనర్, మార్కాపురం -
అద్దె భవనాల్లోనే గురుకుల విద్య
సాక్షి, హైదరాబాద్: కొత్త గురుకుల పాఠశాలలకు అద్దె భవనాలే దిక్కు అయ్యాయి. ప్రైవేటు భవనా ల్లో ప్రారంభించి దశలవారీగా శాశ్వత భవనాలు నిర్మిస్తామన్న ప్రభుత్వం మాటలు ఇప్పట్లో కార్యరూపం దాల్చేలా లేవు. 2017–18లో బీసీ సంక్షేమ శాఖ పరిధిలో నియోజకవర్గానికొకటి చొప్పున 119, మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో 65 గురుకులాలను ప్రైవేటు భవనాల్లో ప్రారంభించింది. శాశ్వత భవనాలకు రూ.3,680 కోట్లు... గురుకులాలపై భారీ ప్రణాళికలతో ప్రభుత్వం ప్రకటనలు చేయడంతో వీటి పట్ల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కొత్తవాటిలో దాదాపు అన్ని గురుకులాలు హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టేశాయి. కనిష్టంగా పది ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన భవనాలను నిర్మించాలని సొసైటీలు ప్రణాళికలు రూపొందించాయి. ఒక్కో గురుకుల భవన నిర్మాణానికి రూ.20 కోట్లు, అన్నింటికి కలిపి దాదాపు రూ.3,680 కోట్లు అవసరమవుతాయని అధికారులు తేల్చారు. ప్రతి సంవత్సరం పావువంతు భవనాలు నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఏటా రూ. 1,000 కోట్లు కేటాయించాలి. కానీ, ఇంతపెద్దమొత్తంలో నిధులివ్వడం సాధ్యం కాదని తాజాగా ఆర్థిఖ శాఖ అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. దీంతో కొత్త గురుకులాలకు ఇప్పట్లో శాశ్వత భవనాలు ఏర్పాటయ్యే అవకాశం లేనట్లే. కొత్త గురుకులాలకు అద్దె భారం తడిసిమోపెడవుతోంది. ఒక్కో గురుకులంపై ఏటా రూ.25 లక్షలు, అన్నింటికి కలిపి రూ.65 కోట్ల అద్దె భారం పడుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన అద్దెధరలకు చాలాచోట్ల భవనాలు లభించలేదు. దీంతో ఎక్కువ అద్దెలు చెల్లించి భవనాలు తీసుకోవాల్సి రావడంతో అద్దె భారం మరింత పెరిగే అవకాశముంది. -
మంత్రికి పట్టని ‘అంగన్ వాడీ’!
అద్దె భవనాల్లోనే కేంద్రాల నిర్వహణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే దయనీయ స్థితి ప్రారంభానికి నోచుకోని కొత్త భవనాలు ఐదేళ్లలోపు చిన్నారులకు ఆటపాటలతో అక్షరాలు నేర్పడం.. కిశోర బాలికలు, గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య పరమైన సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు, పౌష్టికాహారాన్ని అందజేయడం... ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, పల్స్ పోలియో... ఓటరు నమోదు ప్రక్రియలను విజయవంతం చేయడంలోనూ అంగన్వాడీ కార్యకర్తల పాత్ర ఎనలేనిది. అలాంటి అంగన్వాడీ వ్యవస్థ నిర్వహణపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. సొంత భవనాలు సమకూర్చడంలోనూ, మౌలిక వసతులు మెరుగు పరచడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. సాక్షాత్తు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలోనే అంగన్వాడీల పరిస్థితి దయనీయంగా ఉందంటే.. ఇక మిగిలిన ప్రాంతాల పరిస్థితి మరెంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. - కనగానపల్లి (రాప్తాడు) సొంత భవనాలు లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా కేంద్రాల్లో మౌలిక వసతులు లోపించాయి. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖామంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గం రాప్తాడులోనే ఈ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి, రాప్తాడు, చెన్నేకొత్తపల్లి, రామగిరి, ఆత్మకూరు మండలాల్లో 305 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 115 కేంద్రాలకు మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి. మిగిలిన వాటిని అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. వీటిలో కూడా చాలా భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. మౌలిక వసతులు లోపించడంతో సుమారు పది వేల మంది చిన్నారులు, 1,500 మంది గర్భిణులు, 1,600 మంది బాలింతలు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అద్దె చెల్లింపుల్లోనూ తిరకాసు జిల్లా వ్యాప్తంగా అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి అద్దె చెల్లింపుల్లో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. కనగానపల్లి మండలంలో పరిశీలిస్తే.. 58 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా,వ వీటిలో 18 కేంద్రాలకు మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి. మిగిలిన 40 కేంద్రాల్లో కొన్నింటిని ప్రభుత్వ పాఠశాలల్లో, మరికొన్ని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల్లో సుమారు 2,100 మంది చిన్నారులు ఆటపాటలతో అక్షరాలు నేర్చుకుంటున్నారు. ఈ పిల్లలతో పాటు 260 మంది బాలింతలు, 350 మంది గర్భిణులకు ఈ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నారు. అద్దె భవనాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు లోపించాయి. ప్రధానంగా కనగానపల్లి-2, శివపురం, భానుకోట, కుర్లపల్లి గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అద్దె భవనాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు సకాలంలో బాడుగలు చెల్లించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. దీంతో ఇంటి యజమానులు ఖాళీ చేయాలని పట్టుబడుతున్నారు. పర్వతదేవరపల్లి, చంద్రశ్చర్ల, రాంపురం, బాలేపాళ్యం, కోనాపురం తదితర గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈతరహా పరిస్థితులు ఒక్క కనగానపల్లి మండలంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఉంది. ప్రారంభానికి నోచుకోని కొత్త భవనాలు కనగానపల్లి, తగరకుంట, భానుకోట గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలకు నూతన భవనాలు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా నేటికీ ప్రారంభించలేకపోయారు. దీంతో ఈ ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలను అద్దె గదుల్లోనే నిర్వహిస్తున్నారు. పక్కా భవన నిర్మాణాలకు సంబంధించి రూ. లక్షల్లో ప్రజా ధనాన్ని వెచ్చించి, నిరుపయోగం చేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నా.. అధికారులు, పాలకులు స్పందించడం లేదు. అసంపూర్తి నిర్మాణాలతోనే.. ఒక వైపు నిర్మాణాలు పూర్తి అయిన భవనాలను ప్రారంభించకుండా అలసత్వం వహించిన ప్రభుత్వం.. మరో 11 నూతన భవనాలను మంజూరు చేసింది. వీటి నిర్మాణం చేపట్టి ఏడాది అవుతున్నా.. ఎక్కడా పూర్తి కాలేదు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే.. కుర్లపల్లి గ్రామంలో 2004లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో పనికి ఆహార పథకం కింద అంగన్ వాడీ భవన నిర్మాణాన్ని చేపట్టారు. ప్రభుత్వం కేటాయించిన నిధులు సరిపోక పోవడంతో 90 శాతం వరకూ నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న భవనాన్ని అలాగే వదిలేశారు. మరో పది శాతం నిధులు కేటాయించి ఉంటే ఈ భవనం పూర్తి అవుతుంది. అలా కాకుండా ఇదే ప్రాంతంలో కొత్తగా రూ. 5 లక్షలతో మరో భవనాన్ని మంజూరు చేసి, ప్రజా ధనం దుర్వినియోగానికి ప్రభుత్వం తెరలేపింది. కేవలం అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల లబ్ధితో పాటు, పర్సంటేజీల కోసమే ఇలాంటి చవకబారు చర్యలకు ప్రజాప్రతినిధులు పాల్పడుతున్నట్లు పలువురు విమర్శిస్తున్నారు. సొంత నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై మంత్రి దృష్టి సారించాలని కోరుతున్నారు. -
న్యాయ వ్యవస్థను గుడిసెలు, అద్దెభవనాల్లోకి తరలించలేం
- ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నెల్లూరు సిటీ: ఉన్నపాటుగా మిగిలిన శాఖలతో పాటు న్యాయవ్యవస్థను గుడిసెలు, అద్దె భవనాల్లోకి తరలించలేమని టీడీపీ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఈ విషయం తెలంగాణ ప్రభుత్వానికి, న్యాయాధికారులకు తెలుసన్నారు. నెల్లూరులోని ఎన్టీఆర్ భవన్లో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ..ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఏపీకి 10 సంవత్సరాల పాటు పాలించే హక్కుందన్నారు. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డు పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులో ముఖ్యమైనవి ఉంటాయని, వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. వారికి సరైన సౌకర్యాలు కల్పించాకే నూతన రాజధానికి మారుస్తామని చెప్పారు. న్యాయవాదులను 60:40 నిష్పత్తిలో విభజిస్తామంటే అడ్డుపడుతున్నారని, రాష్ట్రం విడిపోయిన తరువాత బార్ కౌన్సిల్ విడిపోవాల్సి ఉందని దీన్ని తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఆస్తులు, నీటి పంపకాల విషయంలో కూర్చునేందుకు సమయం కేటాయించదని ఎద్దేవా చేశారు. ఎక్కడ శాంతి భద్రతల విషయంలో కోర్టులు అంతిమతీర్పులు ఇస్తాయో, అక్కడే శాంతికి విఘాతం కలిగే పరిస్థితి చరిత్రలో ఇంతకుముందు జరగలేదన్నారు. ఉమ్మడి రాజధానిలో ఇష్టప్రకారం వ్యవహరిస్తే కుదరదని సోమిరెడ్డి అన్నారు.