అద్దె భవనాల్లోనే కేంద్రాల నిర్వహణ
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే దయనీయ స్థితి
ప్రారంభానికి నోచుకోని కొత్త భవనాలు
ఐదేళ్లలోపు చిన్నారులకు ఆటపాటలతో అక్షరాలు నేర్పడం.. కిశోర బాలికలు, గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య పరమైన సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు, పౌష్టికాహారాన్ని అందజేయడం... ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, పల్స్ పోలియో... ఓటరు నమోదు ప్రక్రియలను విజయవంతం చేయడంలోనూ అంగన్‌వాడీ కార్యకర్తల పాత్ర ఎనలేనిది. అలాంటి అంగన్‌వాడీ వ్యవస్థ నిర్వహణపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. సొంత భవనాలు సమకూర్చడంలోనూ, మౌలిక వసతులు మెరుగు పరచడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. సాక్షాత్తు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలోనే అంగన్‌వాడీల పరిస్థితి దయనీయంగా ఉందంటే.. ఇక మిగిలిన ప్రాంతాల పరిస్థితి మరెంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.
- కనగానపల్లి (రాప్తాడు)
సొంత భవనాలు లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా కేంద్రాల్లో మౌలిక వసతులు లోపించాయి. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖామంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గం రాప్తాడులోనే ఈ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి, రాప్తాడు, చెన్నేకొత్తపల్లి, రామగిరి, ఆత్మకూరు మండలాల్లో 305 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 115 కేంద్రాలకు మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి. మిగిలిన వాటిని అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. వీటిలో కూడా చాలా భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. మౌలిక వసతులు లోపించడంతో సుమారు పది వేల మంది చిన్నారులు, 1,500 మంది గర్భిణులు, 1,600 మంది బాలింతలు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అద్దె చెల్లింపుల్లోనూ తిరకాసు
జిల్లా వ్యాప్తంగా అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించి అద్దె చెల్లింపుల్లో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. కనగానపల్లి మండలంలో పరిశీలిస్తే.. 58 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా,వ వీటిలో 18 కేంద్రాలకు మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి. మిగిలిన 40 కేంద్రాల్లో కొన్నింటిని ప్రభుత్వ పాఠశాలల్లో, మరికొన్ని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల్లో సుమారు 2,100 మంది చిన్నారులు ఆటపాటలతో అక్షరాలు నేర్చుకుంటున్నారు. ఈ పిల్లలతో పాటు 260 మంది బాలింతలు, 350 మంది గర్భిణులకు ఈ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నారు. అద్దె భవనాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు లోపించాయి. ప్రధానంగా కనగానపల్లి-2, శివపురం, భానుకోట, కుర్లపల్లి గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అద్దె భవనాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలకు సకాలంలో బాడుగలు చెల్లించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. దీంతో ఇంటి యజమానులు ఖాళీ చేయాలని పట్టుబడుతున్నారు. పర్వతదేవరపల్లి, చంద్రశ్చర్ల, రాంపురం, బాలేపాళ్యం, కోనాపురం తదితర గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈతరహా పరిస్థితులు ఒక్క కనగానపల్లి మండలంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఉంది.
ప్రారంభానికి నోచుకోని కొత్త భవనాలు
కనగానపల్లి, తగరకుంట, భానుకోట గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు నూతన భవనాలు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా నేటికీ ప్రారంభించలేకపోయారు. దీంతో ఈ ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను అద్దె గదుల్లోనే నిర్వహిస్తున్నారు. పక్కా భవన నిర్మాణాలకు సంబంధించి రూ. లక్షల్లో ప్రజా ధనాన్ని వెచ్చించి, నిరుపయోగం చేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నా.. అధికారులు, పాలకులు స్పందించడం లేదు.
అసంపూర్తి నిర్మాణాలతోనే..
ఒక వైపు నిర్మాణాలు పూర్తి అయిన భవనాలను ప్రారంభించకుండా అలసత్వం వహించిన ప్రభుత్వం.. మరో 11 నూతన భవనాలను మంజూరు చేసింది. వీటి నిర్మాణం చేపట్టి ఏడాది అవుతున్నా.. ఎక్కడా పూర్తి కాలేదు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే.. కుర్లపల్లి గ్రామంలో 2004లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో పనికి ఆహార పథకం కింద అంగన్ వాడీ భవన నిర్మాణాన్ని చేపట్టారు. ప్రభుత్వం కేటాయించిన నిధులు సరిపోక పోవడంతో 90 శాతం వరకూ నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న భవనాన్ని అలాగే వదిలేశారు. మరో పది శాతం నిధులు కేటాయించి ఉంటే ఈ భవనం పూర్తి అవుతుంది. అలా కాకుండా ఇదే ప్రాంతంలో కొత్తగా రూ. 5 లక్షలతో మరో భవనాన్ని మంజూరు చేసి, ప్రజా ధనం దుర్వినియోగానికి ప్రభుత్వం తెరలేపింది. కేవలం అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల లబ్ధితో పాటు, పర్సంటేజీల కోసమే ఇలాంటి చవకబారు చర్యలకు ప్రజాప్రతినిధులు పాల్పడుతున్నట్లు పలువురు విమర్శిస్తున్నారు. సొంత నియోజకవర్గంలోని అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై మంత్రి దృష్టి సారించాలని కోరుతున్నారు.