మిర్యాలగూడలో రియల్ దందా..
► జోరుగా అనధికార లే అవుట్లు
► కొరవడిన అధికారుల పర్యవేక్షణ
► మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి
జోరుగా అనధికార లే అవుట్లు
మిర్యాలగూడను నల్లగొండ జిల్లాలోనే కొనసాగించాలని అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం.. ఇప్పటికే వ్యాపార పరంగా అభివృద్ధి చెందడంతో ఈ పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ జోరందుకుంది. వ్యాపారులు పట్టణ పరిసరాల్లోని పంట పొలాలను అనుమతులు లేకుండానే అనధికార లే అవుట్లుగా మార్చారు. వాటిని ప్లాట్లుగా విభజించి విక్రయిస్తూ రూ. కోట్లు గడిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో మున్సిపల్ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. -
మిర్యాలగూడ :- మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలను మళ్లీ రియల్ భూతం వెంటాడుతోంది. పట్టణ చుట్టు పక్కన ఉన్న పంట పొలాలు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల గుప్పిట్లో ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే వాటిని ప్లాట్లుగా విభజించి ఆకర్షవంతమైన ప్రకటనలో వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. రూ.లక్షలకు కొనుగోలు చేసిన పొలాలను ప్లాట్లుగా చేసి రూ.కోట్లు గడిస్తున్నారు. పట్టణ పరిసర ప్రాంతాలలోని అద్దంకి - నార్కట్‌పల్లి రహదారి వెంట, తాళ్లగడ్డ, బాపూజీనగర్, ఏడుకోట్లతండా సమీపంలో అనుమతి లేని వెంచ ర్లు వెలుస్తున్నా యి. వెంచర్లలో మున్సిపల్ అధికారు లు గుర్తిం చకుం డా రా ళ్లను భూమిలోపలికి పాతి ప్లాట్ల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం లేఅవుట్‌లో పది శాతం భూమిని మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేయా ల్సి ఉంది. అలా చేయకుండానే మొత్తం స్థలాన్ని ప్లాట్లుగా విభజించి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. 150 గజాల స్థలం రూ.నాలుగు నుంచి ఐదు లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. అనధికారిక లేఅవుట్ల కారణంగా మున్సిపాలిటీకి చెందాల్సిన స్థలం రాకపోవడంతో పాటు పన్ను రూపంలో రావల్సిన ఆదాయం కూడా కోల్పోవాల్సి వస్తోంది.
అధికారుల అండదండలు..?
పట్టణంలో జోరుగా సాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అధికారుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. అనధికారిక లే అవుట్ల యాజమాన్యాలపై మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. పురపాలక సంఘం చట్టం 1965 సెక్షన్ 184, 185 ప్రకారం అనధికారిక లే అవుట్ల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవల్సి ఉంది. కానీ అధికారులు గతంలో అనుమతి లేని లే అవుట్ల వద్ద కొలత రాళ్లను తీసివేసి చేతులు దులుపుకున్నారు. కానీ తిరిగి యథావిథిగా లే అవుట్ల వ్యాపారం జరుగుతూనే ఉంది.
13 అనధికారిక వెంచర్లు
మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతాల్లో 13 అనధికారిక వెంచర్లు వెలిసినట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు. ఈ వెంచర్లలో సుమారుగా 30 ఎకరాల వరకు పంట పొలాలను ప్లాట్లుగా విభజించినట్లు తెలిసింది. అనధికారిక వెంచర్ల వల్ల మున్సిపాలిటీకి చెందాల్సిన 10 శాతం భూమితో పాటు ఎకరానికి రూ.30 వేల ఆదాయం పన్ను రూపంలో రావల్సింది కోల్పోతున్నారు. 30 ఎకరాలకు గాను మున్సిపల్ అధికారులు సుమారుగా 10 లక్షల ఆదాయం కోల్పోయారు. అనధికారికంగా వెలిసిన వెంచర్లలో 2015కు ముందుగా కొనుగోలు చేసిన వారు మున్సిపల్ స్థలాల క్రమబద్ధీకరణలో భాగంగా మున్సిపాలిటీకి దరఖాస్తులు పెట్టుకున్నారు. దాని ద్వారా సుమారుగా మూడు కోట్ల రూపాయల ఆదాయం లభించింది. కానీ 2015 తర్వాత వెలిసిన వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి మున్సిపాలిటీ వారు ఇంటి నిర్మాణానికి అనుమతులు కూడా ఇవ్వడం లేదు.
లే అవుట్లకు ఉండాల్సిన నిబంధనలు:
► మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం ఉండాలి.
► రోడ్లకు, పాఠశాల బిల్డింగ్‌కు, పార్కు, ఇతర సౌకర్యాల కోసం 10 శాతం భూమిని మున్సిపాలిటీ పేర రిజిస్ట్రేషన్ చేయాలి.
► మంచినీటి వసతికి ట్యాంకు నిర్మించాలి.
► రోడ్లు, వీధి దీపాలు, మురుగు కాలువలు నిర్మించాలి.
► ఇవన్నీ ఏర్పాటు చేశాక లేఅవుట్ల కోసం మున్సిపల్ కార్యాలయంలో తగిన ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
► డెరైక్టర్ ఆఫ్ టౌన్ కంట్రోల్ ప్లానింగ్ అనుమతితో వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పిస్తారు.
నోటీసులు జారీ చేస్తాం
పట్టణంలో అనుమతి లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తే నోటీసులు జారీ చేస్తాము. 2015 తర్వాత అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే ఇంటి నిర్మాణానికి మున్సిపాలిటీ అనుమతులు నిలిపివేశాము. 2015కు ముందుగా అనుమతి లేని వెంచర్లలో కొనుగోలు చేసిన వారికి మాత్రం ప్రభుత్వ నిబంధనల మేరకు రెగ్యులరైజేషన్ కింద దరకాస్తులు తీసుకున్నాము. అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దు. అన్ని అనుమతులు ఉన్న ప్లాట్లలో కొనుగోలు చేయాలి. - కందుల అమరేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, మిర్యాలగూడ