సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం ఎలాంటి చర్చ లేకుండా రచ్చతోనే అర్ధాంతరంగా ముగిసింది. గందరగోళం.. రసాభాసలతో, సభ్యుల సస్పెన్షన్లు ఉంటాయో, ఉండవో కూడా తెలియని అయోమయంతో అభాసుపాలైంది. జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే తొలిసారిగా సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు సభకు అధ్యక్షత వహించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రకటించారు.
అనంతరం కొద్ది సేపటికి సభనే ముగించారు. శనివారం జరిగిన జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం ఆద్యంతం రచ్చే అయింది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2023–24)సంబంధించిన బడ్జెట్ ప్రత్యేక సమావేశం, నగర ప్రజల సమస్యలపై చర్చించాల్సిన సాధారణ సమావేశం రెండూ ఒకేరోజు ఏర్పాటు చేశారు. అజెండా మేరకు తొలుత బడ్జెట్ సమావేశంలో భాగంగా మేయర్ బడ్జెట్ ప్రతిలోని వివరాలు చదవడం ప్రారంభించగానే బీజేపీ సభ్యులు అడ్డుకొని పోడియం వైపు దూసుకెళ్లారు.
ప్రశ్నోత్తరాలపై పట్టుబట్టడంతో..
► తొలుత బడ్జెట్ బదులు ప్రజల సమస్యలపై ప్రశ్నోత్తరాలు నిర్వహించాలని పట్టుబట్టారు. గందరగోళంతో మేయర్ సభను పదినిమిషాలు వాయిదా వేశారు. తిరిగి సమావేశమయ్యాక సైతం వారు ఆందోళన కొనసాగిస్తుండగానే మేయర్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపేవారి చేతులెత్తాలని చెప్పి, బీఆర్‌ఎస్, ఎంఐఎం సభ్యులను పరిగణనలోకి తీసుకొని ఆమోదం పొందినట్లు ప్రకటించారు. దాన్ని అడ్డుకుంటూ బీజేపీ సభ్యులు మేయర్ పోడియం ముందు బైఠాయించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు.గందరగోళం తీవ్రంగా మారడంతో మరోసారి సభను 15 నిమిషాలు వాయిదా వేశారు. తిరిగి 11.50 గంటలకు సమావేశం ప్రారంభమయ్యాక సైతం అదే సీన్ పునరావృతమైంది. బీజేపీ సభ్యులు పోడియం చుట్టుముట్టారు. బడ్జెట్‌పై చర్చ జరగకుండానే బడ్జెట్‌ను ఎలా ఆమోదిస్తారంటూ పట్టుబట్టారు.
► ఆమోదం పొందాక తిరిగి చర్చ ప్రశ్నే లేదని, ప్రశ్నోత్తరాలు ప్రారంభిస్తానని, తొలుత మీకే అవకాశమిస్తానని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. ప్రశ్నల కోసం పేర్లు పిలవగా ఒకరిద్దరు బీఆర్‌ఎస్, ఎంఐఎం సభ్యులు లేచి మాట్లాడారు. వారు మాట్లాడుతున్నప్పటికీ బీజేపీ ఆందోళన ఆగలేదు. వీధిదీపాలు వెలగడం లేవని ఎంఐఎం.. అభివృద్ధి కార్యక్రమాలకు ఢిల్లీ వారు నగరానికి అవార్డులిస్తున్నా, గల్లీ వారికి కనిపించడం లేవని బీఆర్‌ఎస్ ప్రస్తావించాయి. బీజేపీ సభ్యులెంతసేపటికీ పోడియం దిగి రాకపోవడం.. గందరగోళ పరిస్థితి సద్దుమణగకపోవడంతో రెండు మూడు పర్యాయాలు సస్పెన్షన్ హెచ్చరికలు చేసిన మేయర్ 12.11 గంటలకు పోడియంవద్ద ఉన్న బీజేపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు, మేయర్, కమిషనర్ తమ సీట్లనుంచి లేచి వెళ్లిపోయారు. తిరిగి 12.44 గంటలకు సీట్లోకి వచి్చన మేయర్ మాట్లాడుతూ ‘మంచిగా చెబుతున్నా కూర్చోండి. చర్చిద్దాం’ అన్నా పోడియంను చుట్టుముట్టిన వారు వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలో సమావేశాన్ని ముగిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు.
రూ. 6224 కోట్లతో బడ్జెట్ ఆమోదం
2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ.6224 కోట్ల బడ్జెట్ మెజారిటీ సభ్యులతో సభ ఆమోదం పొందినట్లు మేయర్ ప్రకటించారు. స్టాండింగ్ కమిటీ ఆమోదించిన బడ్జెట్‌ను యథాతథంగా ఆమోదించారు.
బీజేపీ, కాంగ్రెస్ ధర్నాలు..
ప్రజా సమస్యలపై చర్చించాలని, అభివృద్ధి పనులి్నచేపట్టాలనే డిమాండ్లతో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు వేర్వేరుగా ఆందోళనలు, ధర్నాలు చేశారు. కాంగ్రెస్ సభ్యులు మేయర్ చాంబర్ ఎదుట ‘సేవ్ డెమోక్రసీ.. సేవ్ జీహెచ్‌ఎంసీ’ ప్లకార్డులను ప్రదర్శించారు. బీజేపీ సభ్యులు మేయర్ ప్రవేశ ద్వారం ఎదుట ధర్నా చేశారు. పోలీసులు వారిని అక్కడినుంచి తరలించారు.
సస్పెన్షన్ ఉంటుందా.. ?
జీహెచ్‌ఎంసీ నిబంధనల మేరకు సభ్యులను సస్పెండ్ చేసే అధికారం లేనట్లు మునిసిపల్ వ్యవహారాల నిపుణుడొకరు పేర్కొన్నారు. సభను నిర్వహించలేని పరిస్థితులు ఎదురైతే అందుకు కారణమైన వారిని బయటకు పంపించడమో, లేక సభనే ముగించడమో మినహా సభ్యులను సస్పెండ్ చేయడమన్నది ఉండదని, గతంలో సైతం ఎలాంటి సస్పెన్షన్లు లేకపోవడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మేయర్ తెలిసో, తెలియకో సస్పెండ్ చేస్తున్నానని ప్రకటించాక పునరాలోచనలో పడి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
నయాపైసా తెప్పించని కిషన్‌రెడ్డి: మేయర్ విజయలక్ష్మి
సమావేశానంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి కేంద్రమంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డి జీహెచ్‌ఎంసీతో పాటు పరిసరాల్లోని మున్సిపాలిటీలకూ ఒక్క పైసా తేలేకపోయారన్నారు. మున్సిపాలిటీలకు వచ్చే నిధులు ఇప్పించలేక పోయారన్నారు. బీజేపీ సభ్యులు బడ్జెట్ గురించి కానీ, ప్రజల సమస్యల గురించి కానీ చర్చించకపోవడంతో వారికి సమస్యలపై పట్టింపు లేదని వెల్లడైందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ఎస్సార్‌డీపీ, ఎస్‌ఎన్‌డీపీ, సీఆర్‌ఎంపీల ద్వారా జీహెచ్‌ఎంసీ నిధులతోనే ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. బీజేపీ వారికి మాట్లాడేందుకు విషయం లేనందునే గందరగోళానికి దిగారని ఆరోపించారు. మహిళా మేయర్‌ను అని కూడా చూడకుండా పోడియంను చుట్టిముట్టి అగౌరవంగా ప్రవర్తించారన్నారు.
జీహెచ్‌ఎంసీకి కేంద్ర మంత్రి నిధులిస్తారా?
హెచ్‌ఎంసీలో పాలన గాడి తప్పింది. నిధులెలా వస్తున్నాయో.. ఎలా ఖర్చు చేస్తున్నారో తెలియడం లేదు. ఎక్కడ వసూలైన నిధుల్ని అక్కడ వినియోగించాలి. పాతబస్తీ నుంచి ట్యాక్సుల రూపేణా ఎంత వసూలవుతుందో.. ఎంత ఖర్చు చేస్తున్నారో, అలాగే న్యూసిటీనుంచి ఎంత వసూలవుతుందో, ఎంత వెచి్చస్తున్నారో వెల్లడించాలి. హైటెక్‌సిటీలో హంగులు తప్ప ఇంకెక్కడా ఏమీ లేదు. గోడలకు రంగులేసి విశ్వనగరం చేస్తున్నామని చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఇండిపెండెంట్ బాడీ. ఎలా నడపాలో చేతగాక కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ప్రస్తావిస్తూ నిధులివ్వలేదనడం విడ్డూరంగా ఉంది. – బండ కార్తీకరెడ్డి, మాజీ మేయర్, బీజేపీ నాయకురాలు
చదవండి: Roundup 2022: నిషా ముక్త్ షహరే.. డ్రగ్ ఫ్రీ సిటీ దిశగా!
Comments
Please login to add a commentAdd a comment