క్యాంప్ నుంచి జంప్ | Jump from Camp | Sakshi
Sakshi News home page

క్యాంప్ నుంచి జంప్

Published Sun, Jun 15 2014 3:32 AM | Last Updated on Tue, Sep 3 2019 8:56 PM

క్యాంప్ నుంచి జంప్ - Sakshi

క్యాంప్ నుంచి జంప్

  •      మావాడిని బడిలో చేర్చొస్తా
  •      ఇంటిముఖంపట్టిన కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు
  •      పనులు పూర్తయ్యూక మళ్లీ కొందరు శిబిరంలోకే
  •      నిర్వహణ భారం తడిసిమోపెడు
  • రాజకీయ క్యాంపుల్లో ఖరీదైన జీవితం అనుభవిస్తున్న వారు ఒకటిరెండు రోజులైనా ఇంటికి పంపాలని నేతలను వేడుకుంటున్నారు. ఆ రకంగా కొంతమంది క్యాంపుల నుంచి బయటపడుతున్నారు. ఆ ఒకటి రెండు రోజులైనా విలాసాలను ఎందుకు వదులుకుంటున్నారంటే... తాము విలాసాల్లో మునిగితేలుతుంటే బిడ్డల భవిష్యత్తు నాశనమవుతుందనే ఆందోళనేననే విషయం స్పష్టమవుతోంది. కొందరు పనులు పూర్తరుున తరువాత తిరిగి క్యాంపులకు వెళుతున్నారు.
     
    సాక్షి, తిరుపతి: విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పిల్లలను బడులు, కళాశాలల్లో చేర్పించడం కోసం క్యాంపులు విడిచిపెట్టేందుకు సిద్ధమయ్యారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికలు ముగిసినప్పటికీ ఇంకా చైర్మన్, అధ్యక్ష పదవులకు ఎన్నికలు జరగలేదు. రెండుమూడు స్థానాలు అటూఇటుగా గెలిచిన చోట్ల ప్రత్యర్థులు తమ సభ్యులను ఎగరేసుకుపోయే ప్రమాదాన్ని గుర్తించి ఆయా మండలాలు, మున్సిపాలిటీల ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లతో రాజకీయపార్టీల నాయకులు క్యాంపులు నిర్వహిస్తున్నారు. దాదాపు నెల రోజులుగా ఈ క్యాంపులు జరుగుతున్నాయి.

    బెంగళూరు, మైసూరు, ఊటీ, కొడెకైనాల్ తదితర శీతల ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ఖరీదైన హోటళ్లలో వారిని ఉంచారు. గెలిచిన కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులే కాకుండా వారి కుటుంబసభ్యులను కూడా క్యాంపులకు తరలించారు. దీంతో క్యాంపులు నిర్వహించే నేతలకు ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నా వాటిని కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నారు. చైర్మన్, అధ్యక్ష పదవులకు ఎన్నిక ఎప్పుడు జరుగుతుందనేది ఇంకా నిర్ణయం కానప్పటికీ ఖర్చులు భరించేందుకు సిద్ధమయ్యారు.

    ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. క్యాంపుల్లో ఉన్న వారి పిల్లలకు వేసవి సెలవులు ముగియడంతో బడులు, కళాశాలల్లో చేర్పించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తాము విలాసాలు చూసుకుంటే పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందనే ఆందోళనతో వారు ఇళ్లకు వెళ్లేందుకు మినహాయింపు తీసుకుని వస్తున్నారు. పలమనేరు, మదనపల్లె , తిరుపతి ప్రాంతాలకు చెందిన కొందరు ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు ఈ మినహాయింపుతో స్వస్థలాలకు తరలివచ్చారు.

    కొందరు పనులు ముగించుకుని మళ్లీ క్యాంపులకు వెళ్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తగినంత సంఖ్యా బలం లేనప్పటికీ ప్రత్యర్థి పార్టీ సభ్యులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రలోభాలకు తెరలేపింది. దీంతో గత్యంతరం లేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులను కాపాడుకునేందుకు క్యాంపులు నిర్వహించాల్సి వస్తోంది. తలకు మించిన భారంగా పరిణమించినప్పటికీ పార్టీ ప్రతిష్ట కోసం వీటి నిర్వహణ వైపు మొగ్గు ప్రదర్శిస్తోంది.

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కొన్ని చోట్ల ఇలా ఉంటే అధికారంలో ఉన్న టీడీపీకి తిరుపతి రూరల్ మండలంలో సొంతంగా అధ్యక్ష పదవి చేజిక్కించుకునేందుకు అవసరమైన బలం కంటే ఎక్కువ ఉంది. అయినా ఆ పదవికి ఇద్దరు పోటీ పడుతున్నారు. దీంతో రెండు వర్గాలు క్యాంపులు నిర్వహిస్తున్నాయి. క్యాంపుల్లో ఉన్న వారు జారిపోకుండా నిన్నటివరకు కాపాడుకున్నప్పటికీ వేసవి సెలవులు ముగియడంతో ఆ పార్టీ సభ్యులు కూడా ఇళ్లకు వెళ్లి వచ్చేందుకు మినహాయింపు కోరుతున్నారు.

    ఇంకొందరు ఆరోగ్య కారణాలతోనూ బయటపడుతున్నారు. దాదాపు నెలరోజులుగా ఇళ్లకు దూరంగా ఉండటంతో కొందరికి సొంత పనులు కుంటుపడ్డాయి. ఇటువంటి వారు కూడా ఇళ్లకు వెళ్లేందుకు అనుమతి తీసుకుంటున్నారు. మొత్తం మీద కొందరికి క్యాంపుల నుంచి బయటకు వచ్చే అవకాశం కల్పిస్తున్నారు. నిర్వాహకులు మాత్రం ఈ భారం ఎప్పటికి తగ్గుతుందోనని బెంగ పెట్టుకున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement