సాక్షి నెట్‌వర్క్: వడదెబ్బ కారణంగా ఆదివారం జిల్లాలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వివిధ పనుల నిమిత్తం ఆ ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స చేయించినా లాభం లేక మృతిచెందారు.
శ్రీకాళహస్తి టౌన్‌లో..
పట్టణంలోని బీపీ అగ్రహానికి చెందిన ఎం.శ్రీనివాసులు(60) ఆదివారం వడదెబ్బతో మృతి చెందాడు. వృత్తి రీత్యా ఆయన తాపిమేస్త్రి. రెండు రోజులుగా ఒక ఇంటికి మరమ్మతు పనులు చేస్తున్నారు. ఎండ ఎక్కువగా ఉండడంతో శనివారం అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు, విరేచనాలు కావడంతో పట్టణంలోని పలు ఆస్పత్రుల్లో చూపించినా లాభం లేకపోయింది. ఆదివారం ఆయన మృతిచెందాడు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు.
పీలేరులో..
పీలేరు టెలికాం కమ్యూకేషన్‌లో పనిచేస్తున్న లీలాప్రకాష్ వడదెబ్బకు గురై మృతి చెందారు. రెగ్యులర్ మజ్దూర్‌గా పనిచేస్తున్న లీలాప్రకాష్ శనివారం ఉదయం కార్యాలయంలో మొరాయించిన కంప్యూటర్లను రిపేరు నిమిత్తం తిరుపతికి తీసుకెళ్లారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో వడదెబ్బకు గురై స్పృహ కోల్పోయాడు. స్థానికులు లీలాప్రకాష్‌ను 108 వాహనంలో రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ తీవ్ర అస్వస్థతకు గురై శనివారం రాత్రి మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని పీలేరు పట్టణం చెన్నారెడ్డివీధిలోని ఇంటికి తరలించారు. విషయం తెలుసుకున్న పీలేరు టెలికాం సబ్ డివిజనల్ అధికారి లక్ష్మీనారాయణ, సిబ్బంది మల్లికార్జున, కోదండరామయ్య, రమణయ్య, రెడ్డినారాయణ, అల్తాఫ్ హుస్సేన్, రమేష్ తదితరులు ఆదివారం మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అంత్యక్రియల కోసం రూ.8 వేలు ఆర్థికసాయం అందించారు. మృతుడి భార్య, పిల్లలు శోకసంద్రంలో మునిగిపోయారు.
వెదురుకుప్పంలో..
వడదెబ్బతో మండలంలోని పచ్చికాపల్లం పంచాయతీ ఎర్రగుంటపల్లె గ్రామానికి చెందిన సుశీలమ్మ(65) ఆదివారం మృతిచెందింది. ఉదయం 10 గంటల సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆమె గ్రామం సమీపంలోని పొలంలోకి వెళ్లింది. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో అస్వస్థతకు గురై అక్కడే పడిపోయింది. పక్క పొలంలో ఉన్నవారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
పుత్తూరు రూరల్‌లో..
పుత్తూరు మండలం ఎగువ కనకంపాళెం గ్రామానికి చెందిన ఎం.రామానాయుడు(84) ఆదివారం వడదెబ్బతో మృతిచెందాడు. పొలం పనులు చూసుకుని సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. తీవ్ర అస్వస్థతకు గురై కిందపడి మృతిచెందాడు. నగరి మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు.
బుచ్చినాయుడుకండ్రిగలో..
మండలంలోని వీఎస్‌పురం గ్రామానికి చెందిన అంకయ్య(55) వడదెబృతో ఆదివారం మృతి చెందాడు. అంకయ్య ఉదయం కూలి పనికెళ్లాడు. పొలంలో పనిచేస్తుండగా ఎండకు తట్టుకోలేక స్పృహ కోల్పోయాడు. ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెండాడు.
వడదెబ్బతో కూలీ మృతి
శ్రీకాళహస్తి టౌన్: మండలంలోని గుంటకిందపల్లి ఎస్సీ కాలనీకి చెందిన పెద్ద పెంచలయ్య(68) ఆదివారం సాయంత్రం వడదెబ్బతో మృతిచెందాడు. ఆదివారం ఆయన ఓ రైతు పొలంలో వరినాట్లు వేసి ఇంటికొచ్చాడు. ఎండతీవ్రత ఎక్కువగా ఉండడంతో స్పృహతప్పి పడిపోయాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఇటీవల ఆనారోగ్యంతో ఆయన భార్య మృతి చెందింది.
వడదెబ్బతో ఆరుగురి మృతి
Published Mon, Jun 23 2014 2:53 AM | Last Updated on Sat, Aug 11 2018 8:24 PM