తిరుపతిలో వీడియో వాల్
- నేరాల అదుపునకు పోలీసుల కృషి
- 135 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు
- 24 గంటలూ నిఘా
- పది రోజుల్లోనే వీటి ఏర్పాటు
తిరుపతి క్రైం: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరం ఇక నిఘా నీడలోకి వెళ్లనుంది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నగరంలో ఇటీవల నేరాలు పెరగడం పోలీసులను ఆందోళనకు గురిచేస్తోంది. వీటికి కళ్లెం వేయడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసం దేశ రాజధానిలో అనుసరిస్తున్న వీడియో వాల్ విధానం అమలు చేసేందుకు అర్బన్ జిల్లా పోలీసులు కృషి చేస్తున్నారు.
ఆ మేరకు జిల్లా ఎస్పీ ఎస్వీ.రాజశేఖర్‌బాబు బుధవారం రాత్రి నగరంలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేసేందుకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించారు. రాత్రంతా ఆయన నగరంలో సంచరిస్తూ ఎక్కడెక్కడ కెమెరాలు ఏర్పాటు చేయాలనే అంశంపై నగర పోలీసులతో చర్చించారు. గురువారం ఉదయం తన కార్యాలయంలో వీడియోవాల్‌కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన నిపుణులతో సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. పది రోజుల్లోనే ఈ వ్యవస్థ అమల్లోకి వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఒక్క ఢిల్లీలో మాత్రమే..
ప్రస్తుతం ఈ తరహా విధానం దేశంలో ఒక్క ఢిల్లీ మెట్రో నగరంలోనే అమల్లో ఉంది. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ నిర్భయ కేసులో నిందితులను త్వరగా గుర్తించేందుకు వీడియోవాల్ పోలీసులకు సహకరించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారీ వ్యయంతో కూడుకున్నదైనప్పటికీ ఈ విధానం తిరుపతిలో ప్రవేశపెట్టేందుకు ఎస్పీ చొరవ తీసుకుంటున్నారు. నగరంలో ఇటీవల నేరాలు పెరిగిపోతున్నాయి. దాంతోపాటు హత్య కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈ కేసుల్లో త్వరితగతిన దర్యాప్తు చేసేందుకు వీడియో పుటేజ్ సహరిస్తుందని పోలీసులు భావిస్తున్నారు.
వీడియోవాల్‌తో నేరాల నియంత్రణ
ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ పోలీసులు 30 కేంద్రాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే వీటి వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. దీని పర్యవేక్షణ సరిగా లేకపోవడమే ఇందుకు కారణంగా చెప్పాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో వీడియోవాల్ వ్యవస్థ వైపు అధికారులు మొగ్గు చూపుతున్నారు. ఈస్ట్ పోలీస్‌స్టేషన్ భవనంలోని మూడో అంతస్తులో దీనికి సంబంధించిన యంత్రాలు అమర్చేందుకు ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ భవనాన్ని కూడా ఎస్పీ రాజశేఖర్ పరిశీలించారు. ఈస్ట్ డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి, ఈస్ట్ సీఐ మురళీధర్‌రెడ్డి టెక్నికల్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో అర్బన్ ఎస్పీ వీడియోవాల్ ఏర్పాట్లపై సమీక్షించారు. మొత్తానికి పోలీసులు తీసుకుంటున్న చర్యలు భవిష్యత్తులో నగరంలో నేరాల నియంత్రణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సహకరిస్తాయని ఆశిస్తున్నారు.
24 గంటలూ పరిశీలన..
రోజులో 24 గంటలు వీడియోవాల్‌ను పరిశీలించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమిస్తున్నారు. సంఘటనలు జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తం కావడంతో పాటు, వీడియోవాల్ కేంద్రం నుంచి ఇచ్చే సమాచారం కూడా ఎప్పటికప్పుడు అధికారులకు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా సంబంధిత స్టేషన్లలోని అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేసి నేరాల నియంత్రణకు దృష్టి సారించే అవకాశం ఉంది.