నేడు ప్రాదేశిక ఫలితాలు
డివిజన్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు
- ఉదయం 10 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం
- మధ్యాహ్నం 3గంటల్లోగా ఎంపీటీసీ ఫలితాలు
- రాత్రి వరకు కొనసాగనున్న జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు
- కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు
- గెలుపు సంబరాలు, మద్యం దుకాణాలు బంద్
నల్లగొండ, న్యూస్‌లైన్, ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవి తవ్యం మంగళవారం తేలనుంది. ఈ ఓట్ల లెక్కింపు ఐదు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో చేపట్టనున్నారు. జిల్లావ్యాప్తంగా 59 జెడ్పీటీసీ స్థానాలకు 392 పోటీలో ఉండగా, 835 ఎంపీటీసీ స్థానాలకు ప్రధాన పార్టీలతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి 3,311మంది పోటీ చేశారు. తొలి విడత ఎన్నికలు ఏప్రిల్ 6వ తేదీన సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్‌లలో జరిగాయి. రెండో విడత 11వ తేదీన నల్లగొండ, భువనగిరి డివిజన్ పరిధిలోని మండలాలకు జరిగాయి. ఎన్నికల ఫలితాల కోసం ఎదరుచూస్తున్న అభ్యర్థుల ఉత్కంఠకు నేటితో తెరపడనుంది.
ఉదయం 7.30 గంటలకు ఆయా డివిజన్ కేంద్రాల్లో తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు ఆ తర్వాత 10గంటల నుంచి బ్యాలెట్ బాక్సులు తెరిచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఎన్నికల కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాల్లో 484 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ నిర్వహణకు రెండువేల మంది సిబ్బందిని నియమించారు. వీరిలో కౌంటింగ్ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్ సూపర్‌వైజర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు.
లెక్కింపు ఇలా..
ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఓట్ల లెక్కింపు కోసం ఐదు కేంద్రాల్లో ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. ముందుగా ఆయా గ్రామాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులను అభ్యర్థులకు చెందిన ఏజెంట్ల సమక్షంలో సీల్ తీస్తారు. ఇలా తీసిన బాక్సుల్లో ఓట్లను ఒక కుప్పగా వేసి అందులోంచి జెడ్పీటీసీకి కేటాయించిన తెల్లరంగు బ్యాలెట్, ఎంపీటీసీకి కేటాయించిన గులాబీ రంగు బ్యాలెట్లను వేరుచేస్తారు. వేరుచేసిన బ్యాలెట్ పేపర్లను ఆయా గుర్తులతో ముందుగానే సిద్ధం చేసిన ట్రేలల్లో వేస్తారు. ఇలా వేరు చేయడానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది.
పూర్తిస్థాయి లెక్కింపు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభిస్తారు. ప్రతి ఎంపీటీసీ స్థానం లెక్కింపు మూడురౌండ్లుగా జరుగుతుంది. ఒక్కో రౌండ్‌కు సుమారు వెయ్యి ఓట్లను లెక్కపెడతారు. ప్రతి గంటకు ఒకసారి ఓట్ల లెక్కించిన వివరాలను ఏజెంట్లకు, మీడియాకు సమాచారం అందిస్తారు. మధ్యాహ్నం 3 గంటవరకు ఎంపీటీసీల ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. జెడ్పీటీసీల లెక్కింపు రాత్రి వరకు పూర్తికావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 25ఓట్లను ఒక బండిల్‌గా కట్టి ఓట్లను లెక్కపెడతారు. ఇలా చేయడం వల్ల లెక్కింపు సులువుగా ఉండడమే గాకుండా, త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది.
పకడ్బందీ బందోబస్తు
కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఘర్షణలూ చోటుచేసుకోకుండా ఉండేందుకు జిల్లా పోలీస్ శాఖ పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగానే మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు మినహా మిగతా ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. అలాగే ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు గెలుపు సంబరాలు, ర్యాలీలు నిర్వహించడాన్ని నిషేధించారు.