జడ్జిమెంట్‌ డే..! | Telangana Assembly Elections Results Today | Sakshi
Sakshi News home page

జడ్జిమెంట్‌ డే..!

Published Sun, Dec 3 2023 1:21 AM | Last Updated on Sun, Dec 3 2023 8:49 AM

Telangana Assembly Elections Results Today - Sakshi

హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలోని కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్, నగర పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ శాండిల్య

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏమిటో మరికొన్ని గంటల్లో వెల్లడికానుంది. దాదాపు రెండు నెలల ఉత్కంఠకు కాసేపట్లో తెరపడనుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో పోటీపడిన 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు నిజమవుతాయా? అందుకు భిన్నంగా ఫలితాలు వస్తాయా? ఎవరెవరు గెలుస్తారు? ఎవరికి దెబ్బపడుతుంది? అధికారంలోకి వచ్చేది ఎవరన్న దానిపై రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. ఈ ఓట్ల కౌంటింగ్‌ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌ శనివారం ప్రకటించారు. 

49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలు 
రాష్ట్రంలో 31 జిల్లా కేంద్రాల్లోని 31 ప్రాంతాల్లో, హైదరాబాద్‌లో 14, రంగారెడ్డి జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో కలిపి మొత్తం 49 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇందులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 కౌంటింగ్‌ సెంటర్లలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. నియోజకవర్గాల్లో పోలింగ్‌ కేంద్రాలు, పోలైన ఓట్ల సంఖ్య ఆధారంగా ఒక్కో సెంటర్‌లో కౌంటింగ్‌ టేబుళ్లను సిద్ధం చేశారు. దీని ప్రకారం అతి తక్కువగా షాద్‌నగర్‌ స్థానానికి సంబంధించి 12 టేబుళ్లనే ఏర్పాటు చేశారు.

99 స్థానాలకు 14 టేబుళ్లు చొప్పున, 4 స్థానాలకు 16 టేబుళ్ల చొప్పున, 6 స్థానాలకు 18 టేబుళ్ల చొప్పున, మూడు స్థానాలకు 30 టేబుళ్ల చొప్పున.. 500కిపైగా పోలింగ్‌ కేంద్రాలున్న 6 నియోజకవర్గాలకు సంబంధించి 28 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి టేబుళ్లకు అదనంగా.. రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) కోసం మరో టేబుల్‌ ఉంటుంది. మొత్తం 1,798 టేబుల్స్‌ ఏర్పాటు కాగా.. వాటిలో ఆర్‌వో, పోస్టల్‌ బ్యాలెట్ల కోసం 131 టేబుల్స్‌ వినియోగిస్తారు. 

తొలి ఫలితం.. భద్రాచలం 
జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 26 రౌండ్లలో, భద్రాచలం నియోజకవర్గంలో అతి తక్కువగా 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. అంటే భద్రాచలం నియోజకవర్గం ఫలితాలు తొలుత వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మొత్తంగా 119 స్థానాల్లో కలిపి 2,417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది.

ప్రతి రౌండ్‌ కౌంటింగ్‌ ముగిశాక.. ఆ రౌండ్‌లో ప్రతి అభ్యర్థికి పడిన ఓట్లను నోట్‌ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. అధిక పోలింగ్‌ జరిగిన నియోజకవర్గాలు, ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్న స్థానాల్లో ఓట్ల లెక్కింపునకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. కౌంటింగ్‌ సమయంలో ఈవీఎంలకు ఏవైనా సాంకేతిక సమస్యలు వస్తే పరిష్కరించడం కోసం 119 మంది ఇంజనీర్లను నియమించారు. 
 
మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో.. 
ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌ వద్ద ఒక సూక్ష్మ పరిశీలకుడు (మైక్రో అబ్జర్వర్‌), సూపర్‌వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. ప్రతి రౌండ్‌ ఓట్ల లెక్కింపును మైక్రో అబ్జర్వర్‌ పర్యవేక్షిస్తారు. ఒక నియోజకవర్గానికి సంబంధించిన టేబుళ్లపై ఏక కాలంలో జరిపే లెక్కింపును ఒక రౌండ్‌గా లెక్కిస్తారు. ఆ రౌండ్‌లో అభ్యర్థులకు పోలైన ఓట్ల సంఖ్యను నమోదు చేస్తారు. ఓట్ల సంఖ్యను మరోసారి పరిశీలించి నిర్ధారించుకుంటారు. తర్వాత మైక్రో అబ్జర్వర్‌ పరిశీలనకు పంపుతారు. మైక్రో అబ్జర్వర్‌ ఆమోదించాక.. తదుపరి రౌండ్‌ లెక్కింపు ప్రారంభిస్తారు. ఒక్కో రౌండ్‌ పూర్తయిన కొద్దీ స్థానిక ఆర్వో/ఏఆర్వో మీడియా రూమ్‌ వద్దకు వచ్చి ఆ ఫలితాన్ని ప్రకటిస్తూ ఉంటారు. 
 
మూడంచెల భద్రత 
లెక్కింపు కేంద్రాల వద్ద కేంద్ర సాయుధ బలగాలు, రాష్ట్ర ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసులు, రాష్ట్ర పోలీసులతో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, పరిశీలకులు, అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్‌ ఏజెంట్లు, పాసులు కలిగిన మీడియా ప్రతినిధులను మాత్రమే కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుమతిస్తారు. కాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్‌ పరికరాలను కౌంటింగ్‌ కేంద్రాల్లోకి తీసుకెళ్లడానికి వీలుండదు. 
 
అధికారంపై ఎవరి ధీమా వారిదే.. 
శాసనసభ ఎన్నికల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ సాధించి అధికారంలోకి వస్తామని అధికార బీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ ధీమాగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచి హాట్రిక్‌ కొడతామని బీఆర్‌ఎస్‌.. తెలంగాణలో తొలిసారి అధికారం చేపడతామని కాంగ్రెస్‌ అంటున్నాయి. హంగ్‌ ఏర్పడితే ప్రభుత్వంలో భాగస్వామ్యం లభిస్తుందని బీజేపీ, ఎంఐఎం ఆశలు పెట్టుకున్నాయి.

తుది ఫలితాలు ఎలా ఉన్నా తొలి రెండు స్థానాల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లే ఉంటాయని.. మూడో స్థానం కోసం ఎంఐఎం, బీజేపీ తలపడనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో బీఆర్‌ఎస్‌ పోటీ చేయగా.. కాంగ్రెస్‌ 118 చోట్ల, పొత్తులో సీపీఐ ఒక స్థానంలో బరిలో ఉన్నాయి. మరో కూటమిలో బీజేపీ 111, జనసేన 8 స్థానాల్లో పోటీచేశాయి. బీఎస్పీ 107, ఎంఐఎం 9, సీపీఎం 19, సీపీఐఎల్‌ (న్యూడెమోక్రసీ) ఒక స్థానంలో బరిలో ఉన్నాయి. 
 
ఆ స్థానాలపైనే అందరి దృష్టి! 
సీఎం కేసీఆర్‌ ఈసారి గజ్వేల్, కామారెడ్డి స్థానాల నుంచి పోటీలో ఉండగా.. ఆయనపై గజ్వేల్‌లో బీజేపీ తరఫున ఈటల రాజేందర్, కామారెడ్డిలో కాంగ్రెస్‌ తరఫున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బరిలోకి దిగి సవాల్‌ విసిరారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఈ రెండు నియోజకవర్గాల ఫలితం ఎలా ఉంటుందన్నది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు మంత్రులు కేటీఆర్‌ (సిరిసిల్ల), హరీశ్‌రావు (సిద్దిపేట), ఎర్రబెల్లి దయాకర్‌రావు (పాలకుర్తి), సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(వనపర్తి), ఇంద్రకరణ్‌రెడ్డి (నిర్మల్‌), స్పీకర్‌ పోచారంశ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ)ల ఎంపికపైనా అంతటా ఆసక్తి నెలకొంది. 

► కాంగ్రెస్‌ తరఫున సీఎం ఆశావాహులు/సీనియర్లు అయిన టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి (కొడంగల్‌), భట్టి విక్రమార్క (మధిర), ఉత్తకుమార్‌రెడ్డి(హుజూర్‌నగర్‌), దామోదర రాజనర్సింహ (ఆందోల్‌), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (నల్లగొండ), టి.జీవన్‌రెడ్డి (జగిత్యాల), దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (మంథని), సీతక్క (ములుగు), తుమ్మల నాగేశ్వర్‌రావు (ఖమ్మం)ల జయాపజయాలపై చర్చ నడుస్తోంది. 

► బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ (కరీంనగర్‌), ఈటల రాజేందర్‌ (హుజూరాబాద్‌), బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌(సిర్పూర్‌) తదితరులు సాధించనున్న ఫలితాలపైనా ఆసక్తి కనిపిస్తోంది.  

► నిరుద్యోగుల ప్రతినిధిగా కొల్లాపూర్‌ నుంచి పోటీచేస్తున్న శిరీష (బర్రెలక్క) ఎన్నికల్లో గెలిచే అవకాశాలు పెద్దగా లేవని, అయినా ఆమెకు ఎన్ని ఓట్లు పడతాయి, అక్కడ ఎవరు విజయం సాధిస్తారన్న దానిపై చర్చ జరుగుతోందని రాజకీయ నిపుణులు చెప్తున్నారు.  

ఉదయం 10.30కల్లా ఆధిక్యతపై స్పష్టత 
ఆదివారం ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తారు. అరగంట తర్వాత అంటే 8.30 గంటలకు ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. ఒకవేళ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ఎక్కువ సమయం కొనసాగినా, ఈవీఎం ఓట్ల లెక్కింపును సమయానికే ప్రారంభిస్తారు. చాలా నియోజకవర్గాల్లో ఉదయం 10.30 గంటలకల్లా ఏ అభ్యర్థి ఆధిక్యతలో ఉన్నదీ దాదాపుగా స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.

మధ్యాహ్నం 12.30 గంటలకల్లా పోలింగ్‌ సరళి ద్వారా పార్టీల గెలుపోటములపై స్పష్టత రావొచ్చని పేర్కొంటున్నారు. ఎక్కడైనా పోటీ ఎక్కువగా ఉండి, రౌండ్‌ రౌండ్‌కు ఆధిక్యతలు మారిపోతూ ఉంటే.. లెక్కింపు పూర్తయ్యేదాకా ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతుందని అంటున్నారు. ఓట్ల లెక్కింపు సరళిని కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌  https:// results.eci.gov.in ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement