సాక్షి, అమరావతి: వివాదాలకు ఆస్కారం లేకుండా ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని, పారదర్శకంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకుంటూ కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల సంసిద్ధతకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు.
మీనా మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులకు సంబంధించి అందే ఫిర్యాదుల పరిష్కారం విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పారు. అలాగే దినపత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తాంశాలపై చర్యలు తీసుకుని, సంబంధిత వివరాలను ప్రతివారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించే సమావేశంలో వివరించాలన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చేయాల్సిన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల అక్రమ రవాణా నియంత్రణ అంశాలకు సంబంధించి ప్రతివారం సంబంధిత జిల్లాల ఎస్‌పీలతో సమీక్షా సమావేశం నిర్వహించాలని ఎన్నికల అధికారులకు ఆయన సూచించారు.
ఎలక్షన్ సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టం యాప్ ఇప్పటికే సిద్ధంగా ఉందని, ఆ యాప్ ట్రయల్ రన్‌ను మార్చి మొదటి వారంలో నిర్వహిస్తామన్నారు. ఆ యాప్‌ను అధికారులు డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సెర్వెలెన్స్ టీమ్‌లు, జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ సభ్యులు లాగిన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోనే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఆయన సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతుల కల్పన, ఎన్నికల అధికారులు, సిబ్బంది నియామకం, శిక్షణ తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. అదనపు సీఈవోలు కోటేశ్వరరావు, హరెంధిర ప్రసాద్, జాయింట్ సీఈవో వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈవో విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment