Kurnool: జెడ్పీపై తొలిసారి వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలు | AP Local Body Election Results 2021: Kurnool | Sakshi
Sakshi News home page

Kurnool: జెడ్పీపై తొలిసారి వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలు

Published Sun, Sep 19 2021 12:32 PM | Last Updated on Mon, Sep 20 2021 7:56 AM

AP Local Body Election Results 2021: Kurnool - Sakshi

కర్నూలు(అర్బన్‌): ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ తిరుగులేని మెజారిటీ సాధించింది. సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ స్థానాలను కైవసం చేసుకున్న వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే దూకుడును ప్రదర్శించింది. జిల్లాలోని 53 మండలాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు తిరుగులేని మెజారిటీని సాధించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 8వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించగా..ఆదివారం జిల్లాలోని 11 ప్రాంతాల్లో ఓట్లను లెక్కించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి అన్ని ప్రాదేశిక నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు మెజారిటీ పరంగా ముందంజలో సాగారు.  

జెడ్పీపై తొలిసారి వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలు ... 
జిల్లాపరిషత్‌పై తొలిసారి వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడనుంది. 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు మెజారిటీగా గెలుపొందినా, అధికార బలంతో తెలుగుదేశం పార్టీ పలువురు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలను కుట్రలు, కుంతంత్రాలతో మభ్యపెట్టి తమవైపు తిప్పుకొని జెడ్పీ పీఠాన్ని దొడ్డిదారిలో చేజిక్కించుకుంది. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు తిరుగులేని మెజారిటీని అందించారు. మొత్తం 53 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, ఎన్నికల కంటే ముందే 16 జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్‌సీపీ ఖాతాలో జమ అయ్యాయి. బీజేపీ అభ్యర్థి మృతితో  నంద్యాల జెడ్పీటీసీ స్థానానికి  ఎన్నిక నిలిచి పోగా, మిగిలిన 36 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.   

672 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయం... 
జిల్లాలో మొత్తం 807 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వివిధ కారణాలతో 11 స్థానాలకు ఎన్నికలు నిర్వహించలేదు. మిగిలిన 796 ఎంపీటీసీల్లో 312 ఏకగ్రీవం కాగా, 484 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఏకగ్రీవాలను కలుపుకొని వైఎస్సార్‌సీపీ 672 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. టీడీపీ 105 స్థానాలను దక్కించుకుంది. ఐదు స్థానాలను బీజేపీ, మూడు స్థానాలను సీపీఐ గెలుపొందింది. స్వతంత్రులు 11 స్థానాల్లో విజయం సాధించారు. పలు ప్రాంతాల్లో  సీపీఎం, జనసేన అభ్యర్థులు పోటీ చేసినా గెలుపొందలేకపోయారు. 

25న జెడ్పీచైర్మన్, 24న ఎంపీపీల ఎన్నిక  
ఈ నెల 24న మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షులు, 25న జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. మండల పరిషత్‌లకు ఉపాధ్యక్షులు, కో ఆప్షన్‌ సభ్యులను 24న ఎన్నుకోవాల్సి ఉంటుంది. అలాగే 25న జిల్లా పరిషత్‌కు ఇద్దరు కో ఆప్షన్‌ సభ్యులు, ఇద్దరు వైస్‌ చైర్మన్లను కూడా ఎన్నుకోవాల్సి ఉంటుంది. మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్‌ సభ్యుని ఎన్నికకు సంబంధించి 20న నోటీస్‌ జారీ చేస్తారు. 24న ఉదయం 10 గంటలకు నామినేషన్లు స్వీకరిస్తారు. స్రూ్కటీనీ నిర్వహించిన అనంతరం 12 గంటలకు అభ్యర్థుల జాబితాను ప్రచురిస్తారు. మధ్యాహ్నం 1 గంట లోపు నామినేషన్ల ఉపసంహరణ పూర్తి అయిన అనంతరం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కో ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకుంటారు.

మధ్యాహ్నం 3 గంటలకు మండల ప్రజా పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. 21న జిల్లా పరిషత్‌కు సంబంధించి ఇద్దరు కో ఆప్షన్‌ సభ్యులు, చైర్మన్, ఇద్దరు వైస్‌ చైర్మన్లను ఎన్నుకునేందుకు జిల్లా కలెక్టర్‌ నోటీసు జారీ చేస్తారు. 25న ఉదయం 10 గంటలకు నామినేషన్లను స్వీకరించి స్రూ్కటీనీ నిర్వహిస్తారు. అనంతరం 12 గంటలకు అభ్యర్థుల జాబితా ప్రచురించి 1 గంట వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇస్తారు. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఇద్దరు కో ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకుంటారు. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మధ్యాహ్నం 3 గంటలకు చైర్మన్, ఇద్దరు వైస్‌ఛైర్మన్లను ఎన్నుకోవాలని ఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.  

ప్రశాతంగా ఓట్ల లెక్కింపు  
జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లను లెక్కించినట్లు జిల్లా కలెక్టర్‌ పీ కోటేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన రాయలసీమ విశ్వ విద్యాలయంలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. కలెక్టర్‌ వెంట ఆర్‌డీఓ హరిప్రసాద్, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశులు ఉన్నారు. పరిశీలకులు ప్రభాకర్‌రెడ్డి కూడా ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement