సాక్షి, ఒంగోలు : సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై జిల్లావ్యాప్తంగా ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. మరికొన్ని గంటల్లో శాసనసభ, లోక్‌సభ అభ్యర్థుల జయాపజయాలను తేల్చే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ ద్వారా మధ్యాహ్నానికే ఫలితాలు వెల్లడికానున్నాయి. మొదటి మూడునాలుగు రౌండ్లలోనే అభ్యర్థికి వచ్చే ఓట్ల మెజార్టీ ఆధారంగా ఫలితం తేలనుంది. మరోవైపు రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఏ పార్టీకి ఎటువంటి ఫలితాలు వస్తాయనే విషయంపై లెక్కలేయడంలో బిజీగా మారారు. ఎన్నికల ముందు, తర్వాత రాజకీయ మార్పులు, సమీకరణాలను విశ్లేషించుకుంటూ.. పార్టీ భవిష్యత్తును అంచనా వేస్తున్నారు.
మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాలతో బేరీజు వేసుకుంటూ, ఎక్కడెక్కడ ఏ సామాజికవర్గం నుంచి ఏ మేరకు ఓట్లు దక్కాయని కూడికలేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ కాస్తంత బలం చాటుకున్నప్పటికీ.. ప్రాదేశికాల్లో బోర్లాపడటంతో ప్రజానాడి తేలిపోయింది. అర్బన్‌ప్రాంతాల్లో బొటాబొటి మెజార్టీ తెచ్చుకున్నా.. గ్రామీణ ప్రాంత ప్రజలు టీడీపీకి పట్టం కట్టకపోవడంపై ఆ పార్టీ నేతల్లో అంతర్మథనం మొదలైంది. ఇవే ఫలితాలు రేపటి సార్వత్రిక ఎన్నికల లెక్కింపులోనూ కనిపించనున్నాయా..? అనే ఆందోళన వారిలో నెలకొంది.
ప్రధానంగా దర్శి, కనిగిరి, సంతనూతలపాడు, గిద్దలూరు, యర్రగొండపాలెం, పర్చూరు, మార్కాపురం ప్రాదేశికాల్లో టీడీపీ ఘోరంగా విఫలమవడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం కీలక నేతలంతా సమావేశమై.. జెడ్పీటీసీలు దక్కించుకోలేకపోవడానికి కారణాలపై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాత్మకంగా ఉన్నప్పటీకీ.. ఎన్నికల వ్యూహాన్ని నడిపించలేకపోవడమే ఓటమికి దారితీసిన అంశంగా తేల్చుకున్నారు. ఇవే అంశాలతో కూడిన నివేదికను ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు సైతం పంపినట్లు సమాచారం. సార్వత్రిక ఫలితాల్లో కూడా టీడీపీ వాటా రెండు స్థానాలకే పరిమితం కానున్నట్లు ఆ పార్టీ కీలక నేతలు అంచనావేసి.. అధిష్టానానికి తెలియజేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
చరిత్ర తిరగరాయనున్న ‘ఫ్యాన్’గాలి...
జిల్లాలో జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపటి సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లోనూ రికార్డు సృష్టించనున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అర్బన్, గ్రామీణ ప్రాంత ఓటర్లు ఆ పార్టీపై పెట్టుకున్న అభిమానం స్థానిక ఫలితాల ద్వారా ఉవ్వెత్తున ఎగిసిపడినట్లు తెలుస్తోందని వారు విశ్లేషిస్తున్నారు. ఈ ఫలితాల సరళిని గమనించిన తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వైఎస్‌ఆర్ సీపీకే రానున్నట్టు వివరిస్తున్నారు.
స్థానిక ఎన్నికల తర్వాత సీమాంధ్రలో చోటుచేసుకున్న రాజకీయ మార్పుల నేపథ్యంలో పలు సామాజికవర్గాలు ఫ్యాన్ గుర్తుకే మొగ్గుచూపినట్టు.. టీడీపీ, బీజేపీ పొత్తు నేపథ్యంలో మైనార్టీలు ఆ రెండు పార్టీలకు దూరమైనట్లు విశ్లేషిస్తున్నారు. అదే విధంగా పొత్తు కుదుర్చుకున్నట్లు బహిరంగంగా ప్రకటించి కూడా సంతనూతలపాడు నియోజకవర్గం విషయంలో బీజేపీకి వెన్నుపోటు పొడవడం టీడీపీకి పెద్ద మైనస్‌గా నిలిచిందంటున్నారు. బహుజన సామాజికవర్గాలతో పాటు గ్రామీణ ప్రాంత రైతులు, మహిళలు, కూలీలంతా జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులుగా ఉంటూ వైఎస్‌ఆర్ సీపీకే ఓట్లేశారని పరిశీలకులు చెబుతున్నారు. జిల్లాలో 12 నియోజకవర్గాల్లోనూ వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించనున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
తుది తీర్పుపై సర్వత్రా ఆసక్తి
Published Thu, May 15 2014 3:27 AM | Last Updated on Sat, Mar 9 2019 3:26 PM
Advertisement
Advertisement