సాక్షి, ఒంగోలు: మున్సిపల్.. స్థానికం.. సార్వత్రికం.. వరుస ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సజావుగా పూర్తవడంతో.. ఇక ఓట్ల లెక్కింపును కూడా ప్రశాంతంగా ముగించాలని జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. తొలుత సోమవారం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ మేరకు ఒంగోలులోని రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్, కందుకూరు మున్సిపాలిటీల ఎన్నికలు కోర్టు వ్యాజ్యాల నేపథ్యంలో వాయిదా పడగా, మార్కాపురం, చీరాల మున్సిపాలిటీలతో పాటు అద్దంకి, చీమకుర్తి, గిద్దలూరు, కనిగిరి నగర పంచాయతీలకు మార్చి నెల 30వ తేదీ పోలింగ్ జరిగింది.
మున్సిపల్ ఎన్నికలకు ఈవీఎంలు వినియోగించడంతో ఓట్ల లెక్కింపు సైతం సులువుగా, వేగంగా పూర్తికానుంది. ఉదయం 8 గంటలకే ప్రారంభం కానున్న లెక్కింపు ప్రక్రియలో తొలుత పోస్టల్ బ్యాలెట్లను పార్టీలవారీగా లెక్కించి.. అనంతరం ఈవీఎంలను వార్డుల వారీగా లెక్కించనున్నారు. మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేసిన క్రమంలో ఒక్కోరౌండ్‌కు 14 వార్డుల ఓట్లను లెక్కించవచ్చు. ప్రతీ రౌండ్‌కు అర్ధగంట నుంచి ముప్పావుగంట సమయం పడుతుంది. కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లపై కలెక్టర్ విజయకుమార్ ఇప్పటికే అధికారులతో సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు అందజేశారు. కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. టేబుళ్ల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని కూడా అదనంగానే నియమించి ఓట్ల లెక్కింపును ప్రశాంతంగా వేగవంతంగా పూర్తిచేయాలని కసరత్తు చేస్తున్నారు.
మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు ఇలా..
ఆరు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపుపై మున్సిపల్ కమిషనర్లు ఇతర అధికారులతో ఇప్పటికే కలెక్టర్ విజయకుమార్ సమీక్ష నిర్వహించారు. ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో ఒక్కోరౌండ్‌కు 14 టేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు. అంటే, ఒక్కోవిడత 14 వార్డుల్లో ఓట్లను లెక్కించవచ్చు. జిల్లాలో ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీల్లో 20 నుంచి 30 వార్డులున్నాయి. అంటే, 20 వార్డులున్న మున్సిపాలిటీల ఓట్లలెక్కింపు రెండు రౌండ్లలోనూ, 30 వార్డులుంటే వాటి లెక్కింపు మూడు రౌండ్లలోనూ పూర్తికానుంది. ప్రతీ అర్ధగంట నుంచి ముప్పావుగంటకో రౌండ్ ముగియనుంది. ఆమేరకు ఉదయం 8 గంటలకే ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు ఉదయం 10.30 నిముషాలకల్లా పూర్తికానుంది. 11 గంటలకల్లా తుది ఫలితాలు వెల్లడించి.. విజేతలకు ధ్రువీకరణలు అందజేయనున్నారు.
అభ్యర్థుల ఉత్కంఠ..
మున్సిపల్ కౌంటింగ్ కేంద్రం వద్ద లెక్కింపు సమయాన పోటీచేసిన అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల ఏజెంట్‌లను కూడా అనుమతించనున్నారు. పార్టీలవారీగా రౌండ్ ఫలితాలను ఏజెంట్ల సమక్షంలోనే లెక్కించనున్నారు. మొట్టమొదటి సారిగా మున్సిపల్ ఎన్నికలు ఎదుర్కొన్న నాలుగు నగర పంచాయతీలతో పాటు రెండు మున్సిపాలిటీల పరిధిలో బరిలో నిల్చిన అభ్యర్థుల్లో సోమవారం కౌంటింగ్‌పై ఉత్కంఠ నెలకొంది. అన్నిచోట్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొనగా.. చీరాల, గిద్దలూరులో స్వతంత్ర అభ్యర్థులూ గట్టిపోటీనే ఇచ్చారు. పట్టణ ఓటర్ల నాడి మున్సిపాలిటీల్లో ఎలా పనిచేసింది.. ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపైనా ఉంటుందా..? అనే భావనలో రాజకీయ పార్టీల నేతలంతా ఉత్కంఠతో ఉన్నారు.
‘పుర’ ఫలితం నేడే
Published Mon, May 12 2014 2:03 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM
Advertisement
Advertisement