సాక్షి ప్రతినిధి, ఒంగోలు : కలెక్టర్ విజయకుమార్‌పై బదిలీ వేటు పడనుందా..? జెడ్పీ చైర్మన్ ఎన్నిక విషయంలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవడంపై విజయకుమార్ పట్ల ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. మెజారిటీ లేకపోయినా ఏదో విధంగా జెడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నాలు చేశారు. స్వయంగా మంత్రి శిద్దా రాఘవరావు, ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒత్తిడి చేసినా నిబంధనల మేరకే తాను నడుచుకుంటానని కలెక్టర్ స్పష్టం చేయడం తెలుగుదేశం పార్టీ నేతలకు నచ్చలేదు.
విజయకుమార్‌ను పంపించి వేయాలని టీడీపీ నేతలు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కోరారు. జెడ్పీ ఎన్నికల విషయంలో అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా వ్యవహరించడం వారికి కంటగింపుగా మారింది. ఒకదశలో పోడియం ఎదుట బైఠాయించిన టీడీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులను పోలీసుల సాయంతో పక్కకు తొలగించేందుకు చేసిన ప్రయత్నంతో అధికార పార్టీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. పైనుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా సాయంత్రం 5.45 గంటల వరకూ సభను వాయిదా వేయకుండా ఎన్నిక జరిపేందుకు ఎన్నికల అధికారి హోదాలో విజయకుమార్ చేసిన ప్రయత్నాలను వారు అవమానంగా భావిస్తున్నారు.
దీంతో ఈ నెల 13న జరిగే జెడ్పీ ఎన్నికల్లోగా కలెక్టర్‌ను బదిలీ చేయాలంటూ చంద్రబాబును కోరినట్లు సమాచారం. మరోవైపు అధికార పార్టీ దౌర్జన్యాలపై ఎన్నికల సంఘం స్పందించింది. జిల్లాలో ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయో గుర్తించి.. తక్షణమే విచారణ చేపట్టి చట్టప్రకారం చర్యలకు ఆదేశాలిచ్చింది. ఆ మేరకు కలెక్టర్ విజయకుమార్, ఎస్పీ పి. ప్రమోద్‌కుమార్‌కు ఈసీ ఆదేశాలందాయి. కనిగిరి, అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్‌సీపీ సభ్యులను బలవంతంగా టీడీపీ నేతలు లాక్కెళ్లడంపై ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ను ప్రభుత్వం బదిలీ చేస్తుందా.. లేకుంటే జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరిగే వరకూ వేచిచూస్తుందా అనేది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
కలెక్టర్ బదిలీ తప్పదా?
Published Tue, Jul 8 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM
Advertisement
Advertisement