ఒంగోలు టౌన్ : జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు పెడతామని కలెక్టర్ విజయకుమార్ హెచ్చరించారు. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయన్నారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వ్యవసాయ శాఖ, ఇతర అనుబంధ శాఖల 100 రోజుల ప్రణాళికను విడుదల చేశారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జన్యుపరంగా నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసేందుకు గ్రామ విత్తన పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం కింద 50 శాతం సబ్సిడీపై రైతులకు నెలాఖరులోగా విత్తనాలు అందించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. జాతీయ ఆహార భద్రతా పథకం కింద పప్పుదినుసుల పంటల్లో దిగుబడులు పెంచేందుకు 250ఎకరాల విస్తీర్ణంలో సమూహ ప్రదర్శనా క్షేత్రాలు వేయనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కలుపు మందు, జీవ సంబంధ ఎరువులను 50శాతం సబ్సిడీపై సరఫరా చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 16మండలాల్లో 1815 హెక్టార్లలో కంది నమూనా ప్రదర్శనా క్షేత్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.
సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం
వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం నియంత్రించి నాణ్యమైన పంట ఉత్పత్తులు పెంచేందుకు సేంద్రియ వ్యవసాయ విధానాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఈ పథకం కింద వానపాముల పెంపకానికి 50శాతం సబ్సిడీపై 500 పోర్టబుల్ బెడ్స్ సరఫరా చేసేందుకు జిల్లాకు 25 లక్షల రూపాయలు కేటాయించారన్నారు. అదేవిధంగా లక్ష రూపాయల సబ్సిడీతో 5వర్మీ హేచరీలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
ఆర్‌కేవీవై కింద రూ 35.96 లక్షలతో పథకాల అమలు
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్‌కేవీవై) పథకం కింద ఉద్యానశాఖ ద్వారా రూ.35.96లక్షలతో వివిధ రకాల పథకాలు అమలు చేయనున్నట్లు కలెక్టర్ వివరించారు. 50శాతం సబ్సిడీతో హైబ్రీడ్ కూరగాయ విత్తనాలు 420 హెక్టార్లలో సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా 50శాతం సబ్సిడీపై తీగ జాతి కూరగాయల పెంపకం కోసం 8హెక్టార్లలో రూ.20లక్షలతో పర్మినెంట్ పందిర్లు ఏర్పాటు చేస్తామన్నారు. సమగ్ర ఉద్యాన పంటల అభివృద్ధి మిషన్ కింద రూ.1250.13లక్షలతో వివిధ రకాల పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.
రొయ్యల చెరువులను క్రమబద్ధీకరించుకోవాలి
ఉప్పునీటి కయ్యల్లోని రొయ్యల చెరువులను సంబంధిత రైతులు విధిగా క్రమబద్ధీకరించుకోవాలని కలెక్టర్ కోరారు. జిల్లాలోని 40మండలాల్లో 1600 ఎకరాల్లో మల్బరీ తోటలు సాగవుతున్నట్లు తెలిపారు. పశుసంవర్ధకశాఖ ద్వారా జూలై 15 నుంచి 30వ తేదీ వరకు జిల్లాలోని 4లక్షల 53వేల గొర్రెలు, మేకలకు పీపీఆర్ వ్యాధి నివారణకు వ్యాక్సిన్ వేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మోహన్, వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ మురళీకృష్ణ, పశుసంవర్ధకశాఖ జాయింట్ డెరైక్టర్ ఎన్ రజనీకుమారి పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు
Published Fri, Jul 11 2014 2:20 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
Advertisement