నెల్లూరులో వైఎస్సార్‌సీపీ భారీ విజయం | high mejority ysrcp results in nellore | Sakshi
Sakshi News home page

నెల్లూరులో వైఎస్సార్‌సీపీ భారీ విజయం

Published Tue, May 13 2014 4:42 AM | Last Updated on Sat, Oct 20 2018 6:29 PM

నెల్లూరులో వైఎస్సార్‌సీపీ భారీ విజయం - Sakshi

నెల్లూరులో వైఎస్సార్‌సీపీ భారీ విజయం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు : మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ కోటలను బద్ధలు కొట్టింది. తీవ్ర స్థాయిలో పోరు నడిచిన నెల్లూరు కార్పొరేషన్‌ను వైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీతో దక్కించుకుంది. కావలిలో విజయం కోసం తీవ్రంగా కష్టపడిన టీడీపీ ప్రయత్నం ఫలించలేదు. ఇక్కడ కూడా వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మెజారిటీతో మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. సూళ్లూరుపేటను దక్కించుకోవడానికి టీడీపీ భారీ మొత్తంలో ధన ప్రవాహం చేసినా వైఎస్సార్‌సీపీ ఒక వార్డు ఎక్కువ గెలుచుని పాగా వేసింది. గూడూరులో రెండు పార్టీల మధ్య పోరు జరిగి చెరో 16 వార్డులు గెలుచుకోగా, ఇక్కడ వైఎస్సార్ సీపీ రెబల్ అభ్యర్థి షంషీర్ నిర్ణయం కీలకం కానుంది.

 ఆత్మకూరులో వైఎస్సార్‌సీపీ కాంగ్రెస్, టీడీపీ కంటే రెండు వార్డులు ఎక్కువగా గెలుచుకోగా, టీడీపీ మూడో స్థానంలో నిలిచింది. వెంకటగిరి, నాయుడుపేటల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ స్పష్టమైన మెజారిటీతో విజయం దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఆత్మకూరులో మినహా మరెక్కడా తన ప్రభావం చూపలేకపోయింది.

- నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌ను ఈసారి ఎలాగైనా గెలుచుకోవడానికి తెలుగుదేశం పార్టీ సర్వశక్తులు ఒడ్డింది. నెల్లూరు ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకరరెడ్డి, సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డితో పాటు పార్టీ ముఖ్యులను రంగంలోకి దించింది. చిన్నపిల్లల వైద్య నిపుణుడు, పార్టీ నాయకుడు జెడ్.శివప్రసాద్‌ను ముందుగానే చైర్మన్‌గా ప్రకటించి బరిలోకి దించింది. ఓటు కోసం నోట్ల పంపిణీకి ఎక్కడా వెనుకంజ వేయలేదు. కొన్ని డివిజన్లలో ఓటుకు రూ.2,000 కూడా పంపిణీ చేసింది. మద్యం ఏరులై పారించింది. ఇంత పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెర లేపినందువల్ల కార్పొరేషన్ గెలుస్తామని టీడీపీ నేతలు ధీమాగా వ్యవహరించారు. అయితే ఇక్కడ మొత్తం 54 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ 32 డివిజన్లు గెలుచుకుని టీడీపీ నేతలను ఖంగుతినిపించింది.  ఇక్కడ టీడీపీ మిత్రపక్షం బీజేపీ 2 డివిజన్లు, సీపీఎం 1, స్వతంత్రుడు ఒక స్థానం దక్కించుకోగా, కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ పార్టీ నుంచి ఆనం రంగమయూర్‌రెడ్డి మాత్రమే 903 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ 17 డివిజన్లు మాత్రమే దక్కించుకుంది. ఈ ఫలితం టీడీపీని తీవ్ర నిరాశకు గురి చేసింది. గెలిచిన కార్పొరేటర్లు కోటంరెడ్డి శ్రీధీర్‌రెడ్డిని సన్మానించారు.

- సూళ్లూరుపేటలో మరోసారి పట్టు సాధించుకోవడానికి చంద్రబాబు నాయుడు సన్నిహితుడు, కాంట్రాక్టర్ గంగాప్రసాద్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికలకు చివరి మూడు రోజుల ముందు ఆయన రంగంలోకి దిగి నోట్ల వరద పారించి పది ఓట్లున్న చోటా నాయకులను కూడా ప్రలోభాలతో తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థి కూడా టీడీపీతో దీటుగా డబ్బులు ఖర్చు చేశారు. అయితే  ఇక్కడి ఓటర్లు వైఎస్సార్‌సీపీకే అండగా నిలిచారు. మొత్తంలో 23 వార్డుల్లో 10 వైఎస్సార్ సీపీ, 9 టీడీపీ, 3 కాంగ్రెస్ గెలవగా 7వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి జి.శ్రావణ్‌కుమార్ గెలుపొందారు. చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలో ఇతని మద్దతు కూడా కీలకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఫలితాలు వెలువడితేనే పూర్తి స్పష్టత రానుంది.

- గూడూరు అసెంబ్లీ టీడీపీ టికెట్ తనకు రావడం అనుమానాస్పదంగా కనిపించడంతో ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాదరావు మున్సిపల్ ఎన్నికల మీద ప్రత్యేకంగా దృష్టిసారించారు. భారీ మొత్తంలో ఖర్చు చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారు. పట్టణంలో తమకు పూర్తి పట్టు ఉన్నందువల్ల ఇక్కడ గెలిచి తీరుతామనే ధీమాగా వ్యవహరించారు. ఇక్కడ వైఎస్సార్ సీపీ టీడీపీతో సమానంగా 16 వార్డులు గెలుచుకుంది. 13వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన వైఎస్సార్‌సీపీ రెబల్ అభ్యర్థి షంషీర్ విజయం సాధించారు. చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలో ఈమె మద్దతు కీలకం కానుండగా, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల ఫలితాల అనంతరం పరిస్థితిలో మార్పు ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపాలిటీని దక్కించుకోవడంపై వైఎస్సార్ సీపీ ధీమాతో ఉంది.

- కావలి అసెంబ్లీ ఎన్నిక టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుకు చావో, రేవో అనేంత ఆందోళన కలిగించింది. దీంతో కావలిలో తన పట్టు పెంచుకోవడానికి ఆయన ఈసారి చేతికి ఎముక లేని విధంగా ఖర్చుకు వెనుకాడలేదు. ఇక్కడ తమ ఆధిపత్యం నిరూపించుకోగలిగితేనే తాను గెలుస్తాననే నమ్మకంతో ఆయన కావలిలో మెజారిటీ వార్డులు గెలుచుకోవడానికి శక్తికి మించి కష్టపడ్డారు. అయితే ఆయన ఆశలు నెరవేరలేదు. 40 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ 20, ఆ పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన స్వతంత్రుడు ఒకరు గెలిచారు. దీంతో వైఎస్సార్‌సీపీకి సంపూర్ణ ఆధిక్యత దక్కింది. ఇక్కడ టీడీపీ 16 వార్డులు, బీజేపీ 1, కాంగ్రెస్ 2 వార్డులు దక్కించుకున్నాయి.

- మాజీ ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిథ్యం వహించిన ఆత్మకూరు మున్సిపాలిటీని గెలవడం కోసం ఆయన పెద్ద ప్రయత్నమే చేశారు. కొన్ని వార్డుల్లో తెలుగుదేశం పార్టీతో అవగాహన కుదుర్చుకుని వైఎస్సార్‌సీపీని ఓడించే వ్యూహం అమలు చేశారు. టీడీపీ సైతం భారీగానే ఓటర్లకు నోట్లు పంపిణీ చేసింది. అయితే ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 10 డివిజన్లు గెలిచింది. కాంగ్రెస్ 8 స్థానాలు దక్కించుకోగా, టీడీపీ 4 వార్డులు గెలిచి మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడి నుంచి మూడో వార్డులో స్వతంత్రుడిగా పోటీ చేసిన షేక్ సందాని గెలిచారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాల అనంతరం ఇక్కడ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికకు సంబంధించి స్పష్టత రానుంది.

- వెంకటగిరి, నాయుడుపేట మున్సిపాలిటీల్లో మాత్రం టీడీపీ పూర్తి మెజారిటీ సాధించింది. వెంకటగిరిలో 25 వార్డులకు గాను 21, నాయుడుపేటలో 20 వార్డులకు గాను 14 గెలుచుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement