గూడూరులో వైఎస్సార్సీపీ జయభేరి
గూడూరు, న్యూస్‌లైన్ : గూడూరు నగర పంచాయతీకి మొదటిసారి నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయభేరి మోగించింది. మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి కంచుకోటగా ఉన ్న గూడూరు పట్టణం వైఎస్సార్సీపీ పరమైంది. మొత్తం 20 వార్డుల్లో 11 స్థానాలను వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుచుకున్నారు. టీడీపీ 6, కాంగ్రెస్ 2 స్థానాలకే పరిమితమయ్యాయి. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, టీడీపీలకు ఓటర్లు గట్టిగా గుణపాఠం చెప్పారు. వైఎస్సార్సీపీ కోడుమూరు అసెంబ్లీ అభ్యర్థి ఎం.మణిగాంధీ, నేతలు ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌ఏ కొత్తకోట ప్రకాష్‌రెడ్డి స్థానిక నేతలతో కలిసి మెలసి పనిచేయడం వల్లే అధిక స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకోగలిగారు. పట్టణంలో వైఎస్సార్సీపీ గెలుపొందడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.
స్వతంత్ర అభ్యర్థి వైఎస్సార్సీపీలో చేరిక
15వ వార్డు నుంచి గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి కె.వెంకట్రాముడు వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో ఆ పార్టీ బలం 12కి చేరింది. స్థానిక నేతలు జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎల్.వెంకటేశ్వర్లు, మాజీ ఉప-సర్పంచు ఎస్‌ఎ జిలానీ ఆధ్వర్యంలో వెంకట్రాముడు కర్నూలులో విష్ణువర్ధన్‌రెడ్డిని కలిసి పూలమాల వేసి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
టీడీపీ చైర్మన్ అభ్యర్థి ఓటమి
గూడూరు మునిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించిన డి.సుందరరాజు ఓటమి పాలయ్యాడు. 20వ వార్డు నుంచి ఆయన ఎన్నికల బరిలోకి దిగగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడివెప్ప 157 ఓట్ల మెజార్టీతో ఓడించాడు. 19వ వార్డు నుంచి పోటీ చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి పీఎన్ అస్లామ్ సమీప టీడీపీ అభ్యర్థి షరీఫ్‌పై 445 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించాడు. అస్లామ్‌కు 557 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థికి 112 మాత్రమే వచ్చాయి.