రేపే గ్రేటర్ కౌంటింగ్
హైదరాబాద్: జీహెచ్ ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ప్రారంభించాలా లేక శనివారమా అన్న సస్సెన్స్ కు అధికారులు తెర దించారు. శుక్రవారం రోజునే కౌంటింగ్ ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే ముందుగా అనుకున్నట్టు సాయంత్రం 4 గంటలకు కాకుండా 3 గంటలకే మొదలుపెట్టాలని నిర్ణయించారు.
పాతబస్తీలోని పురానాపూల్ డివిజన్ లో శుక్రవారం రీ పోలింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో కౌంటింగ్ ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై ఉన్నత స్థాయి అధికారులు తర్జనభర్జన పడ్డారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తే పూర్తి ఫలితాలు వెల్లడి కావడానికి కనీసంగా అయిదు గంటల సమయం పడుతుందని అంచనా వేశారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తే రాత్రి 9 లేదా 10 గంటల వరకు కొనసాగే ఆస్కారం ఉంటుందని, రాత్రి వేళ ఫలితాలు వెల్లడించడం, తద్వారా శాంతి భద్రతల సమస్య ఏదైనా ఉత్పన్నమవుతుందేమోనన్న అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం చైర్మన్, జీహెచ్ ఎంసీ కమిషనర్, హైదరాబాద్ పోలిస్ కమిషనర్ తదితరులు సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.
శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశాలు ఉన్న పక్షంలో కౌంటింగ్ శనివారం ఉదయం నుంచి ప్రారంభించాలని తొలుత భావించారు. అయితే పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనడానికి అవసరమైన బలగాలు సిద్ధంగా ఉన్నాయని పోలీసు ఉన్నతాధికారులు చెప్పడంతో చివరకు కౌంటింగ్ శుక్రవారం చేపట్టాలని నిర్ణయించారు. అయితే మరీ ఆలస్యం కాకుండా ఉండేందుకు వీలుగా ఒక గంట ముందుగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ అంశంపై జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు.