కశ్మీరంలో కూటమి | Omar Abdullah will be Chief Minister of Jammu and Kashmir | Sakshi
Sakshi News home page

కశ్మీరంలో కూటమి

Published Wed, Oct 9 2024 4:20 AM | Last Updated on Wed, Oct 9 2024 7:11 AM

Omar Abdullah will be Chief Minister of Jammu and Kashmir

మొత్తం 90 స్థానాలకు గాను 49 స్థానాలు కూటమి కైవసం  

నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు 42, కాంగ్రెస్‌కు 6, సీపీఎంకు ఒకటి  

బలం పుంజుకున్న బీజేపీ.. సొంతంగానే 29 స్థానాల్లో గెలుపు   

3 సీట్లకే పరిమితమైన పీడీపీ.. ఏడుగురు స్వతంత్రుల విజయం  

అనూహ్యంగా ఒక స్థానం గెలుచుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ  

జమ్మూకశ్మీర్‌ నూతన ముఖ్యమంత్రిగా ఒమర్‌ అబ్దుల్లా  

శ్రీనగర్‌/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఆర్టీకల్‌ 370 రద్దయ్యి, కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తర్వాత జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మూడు పార్టీ లతో కూడిన విపక్ష ‘ఇండియా’ కూటమికే పట్టంగట్టారు. శాసనసభలో మొత్తం 90 స్థానాలకు గాను ఆ కూటమి 49 స్థానాలు సొంతం చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధించింది. ఇండియా కూటమిలోని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 42 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్‌ ఆరు, సీపీఎం ఒక స్థానం దక్కించుకున్నాయి. మూడు పార్టీ లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి.

జమ్మూకశ్మీర్‌లో మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రధాన ప్రాంతీయ పార్టీ అయిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ బలం పెరిగింది. ఆ పార్టీ ఓట్లశాతం 2014లో 20.77 ఉండగా, ఇప్పుడు 23.43 శాతానికి చేరుకుంది. మరో ప్రాంతీయ పార్టీ పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ(పీడీపీ) ఈ ఎన్నికల్లో కేవలం 3 సీట్లకే పరిమితమైంది. ఆ పార్టీ ఓట్ల శాతం 22.67 నుంచి 8.87కు పడిపోయింది. ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ మెరుగైన ఫలితాలే సాధించింది. సొంతంగా 29 సీట్లలో జెండా ఎగురవేసింది. 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి 25 స్థానాలు దక్కగా, ఈసారి మరో నాలుగు స్థానాలు పెరగడం గమనార్హం. అంతేకాకుండా ఓట్ల శాతం 23 శాతం నుంచి 25.64 శాతానికి పెరిగింది. కానీ, జమ్మూకశ్మీర్‌ బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర రైనా ఓటమి పాలయ్యారు.  

మహిళలు ముగ్గురే  
తమ కూటమికి అధికారం దక్కినప్పటికీ కాంగ్రెస్‌కు మాత్రం ఈ ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి. పదేళ్ల క్రితం ఆ పార్టీ 12 సీట్లు గెలుచుకోగా, ప్రస్తుతం కేవలం ఆరు సీట్లు దక్కాయి. కశ్మీర్‌ లోయలో ఐదు స్థానాలు, జమ్మూ ప్రాంతంలో కేవలం ఒక స్థానం లభించింది. ఓట్ల శాతం కూడా 18 నుంచి 12 శాతానికి తగ్గిపోయింది. ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అనూహ్య విజయం సాధించింది. ఒక స్థానంలో పాగా వేసింది. జమ్మూకశ్మీర్‌ పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌(జేపీసీ)కు ఒక స్థానం లభించింది. ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం 90 మంది నూతన ఎమ్మెల్యేల్లో మహిళలు ముగ్గురే ఉన్నారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నుంచి సకీనా మసూద్, షమీమా ఫిర్దోస్, బీజేపీ నుంచి షగున్‌ పరిహర్‌ గెలిచారు. జమ్మూకశ్మీర్‌ నూతన ముఖ్యమంత్రిగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement