Greater fight
-
అధికార పార్టీకి దరిదాపుల్లో లేవు...
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ హవా ఏకపక్షంగా కొనసాగుతోంది. అధికార పార్టీకి ప్రతిపక్షాలు ఏమాత్రం పోటీని ఇవ్వలేకపోయాయి. మేయర్ పదవిని సొంతంగా ఏర్పాటు చేసుకుని ఆధిక్యాన్ని టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. అలాగే ఎంఐఎం మాత్రం రెండో స్థానంలో నిలిచింది. ఇక బీజేపీ-టీడీపీ కూటమిగా ఏర్పడి 'కారు' జోరును తగ్గించేందుకు చేసిన యత్నాలు ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఆ కూటమి కేవలం మూడో స్థానానికే పరిమితం అయింది. ఆర్ కె పురం (బీజేపీ), ఘన్సీ బజార్ (బీజేపీ), బేగంబజార్ (బీజేపీ), కేబీహెచ్‌బీ (టీడీపీ)లో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అయింది. కేవలం పటాన్చెరు, నాచారంలో మాత్రమే గెలుపొందింది. -
మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి ఓటమి
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి పరాజయం పాలయ్యారు. తార్నాక డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమె.. టీఆర్ఎస్ అభ్యర్థి ఆలకుంట సర్వసతి చేతిలో ఓటమి పొందారు. మరోవైపు గ్రేటర్లో కారు జోరు కొనసాగుతోంది. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం టీఆర్ఎస్ మొదటి స్థానంలో ఎంఐఎం రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో బీజేపీ-టీడీపీ కూటమి ఉండగా, ఇక కాంగ్రెస్ నాలుగో స్థానంతో నిలిచింది. -
గ్రేటర్ లో కొనసాగుతున్న కౌంటింగ్
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఆరంభించారు. మొత్తం 24 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరిస్తున్నారు. ఇక కౌంటింగ్ హాల్లోకి సెల్ఫోన్లు, అలాగే ఎన్నికల ఫలితాల అనంతరం ర్యాలీలు, విజయోత్సవాలపై నిషేధం విధించారు. సాయంత్రం అయిదు గంటల తర్వాతే ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. మరోవైపు కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అలాగే 144 సెక్షన్ కొనసాగుతోంది. అలాగే మసబ్ ట్యాంక్ లో కౌంటింగ్ జరుగుతోంది. మోహదీపట్నం, అహ్మద్ నగర్, విజయనగర్ కాలనీ, ఆసిఫ్ నగర్, మల్లేపల్లి, రెడ్ హిల్స్ డివిజన్లలో కౌంటింగ్ మొదలైంది. ఇక పాతబస్తీ పురానాపూల్ డివిజన్లో రీపోలింగ్ కొనసాగుతోంది. -
రేపే గ్రేటర్ కౌంటింగ్
హైదరాబాద్: జీహెచ్ ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ప్రారంభించాలా లేక శనివారమా అన్న సస్సెన్స్ కు అధికారులు తెర దించారు. శుక్రవారం రోజునే కౌంటింగ్ ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే ముందుగా అనుకున్నట్టు సాయంత్రం 4 గంటలకు కాకుండా 3 గంటలకే మొదలుపెట్టాలని నిర్ణయించారు. పాతబస్తీలోని పురానాపూల్ డివిజన్ లో శుక్రవారం రీ పోలింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో కౌంటింగ్ ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై ఉన్నత స్థాయి అధికారులు తర్జనభర్జన పడ్డారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తే పూర్తి ఫలితాలు వెల్లడి కావడానికి కనీసంగా అయిదు గంటల సమయం పడుతుందని అంచనా వేశారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తే రాత్రి 9 లేదా 10 గంటల వరకు కొనసాగే ఆస్కారం ఉంటుందని, రాత్రి వేళ ఫలితాలు వెల్లడించడం, తద్వారా శాంతి భద్రతల సమస్య ఏదైనా ఉత్పన్నమవుతుందేమోనన్న అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం చైర్మన్, జీహెచ్ ఎంసీ కమిషనర్, హైదరాబాద్ పోలిస్ కమిషనర్ తదితరులు సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశాలు ఉన్న పక్షంలో కౌంటింగ్ శనివారం ఉదయం నుంచి ప్రారంభించాలని తొలుత భావించారు. అయితే పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనడానికి అవసరమైన బలగాలు సిద్ధంగా ఉన్నాయని పోలీసు ఉన్నతాధికారులు చెప్పడంతో చివరకు కౌంటింగ్ శుక్రవారం చేపట్టాలని నిర్ణయించారు. అయితే మరీ ఆలస్యం కాకుండా ఉండేందుకు వీలుగా ఒక గంట ముందుగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ అంశంపై జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు. -
కామెంట్ చేస్తారు కానీ...ఓటెందుకు వేయరు?
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆస్తులు లాక్కుంటుందని కొంతమంది అపోహలు సృష్టించారని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖమంత్రి కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలోని కస్తూర్భా గాంధీ డిగ్రీ కాలేజీ వార్షికోత్సవ వేడుకలకు ఆయన సోమవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేడు జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ విద్యార్థినీలతో మొదటిసారి ఓటు రిజిస్టేషన్ చేయించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘటన తమదేనన్నారు. ప్రజాస్వమ్యంలో ఓటు హక్కు ముఖ్యమైనదని ఆయన అన్నారు. 'హైదరాబాద్‌లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఓటింగ్ శాతం తగ్గుతోంది. నగర ఓటర్లు నాయకుల్ని కామెంట్ చేస్తారు కానీ...ఓటు వేయరు. మీరు డైరెక్ట్ పాలిటిక్స్ లోకి రావాలని అనడం లేదు. కానీ ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి రండి. విద్యార్థులు ఉదాసీనంగా ఉంటే దేశానికి మంచి నాయకులు రారు. నేను నా పార్టీకి ఓటు వేయమని అడుగుతా... మాకు ఓటు వేయకపోయిన పరవాలేదు...ఓటు హక్కు మాత్రం ఉపయోగించుకోండి' అని పిలుపునిచ్చారు. -
గాంధీభవన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసినా ఆశావాహులు మాత్రం తమ ఆశలు వదులుకోవడం లేదు. సైదాబాద్ డివిజన్ నుంచి తన కుమార్తెకు టికెట్ ఆశించి భంగపడిన కిషోర్ గౌడ్ అనే వ్యక్తి గురువారం గాంధీభవన్ సాక్షిగా ఆత్మహత్యాయత్నం చేశాడు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని పని చేస్తున్న తమకు ఎన్నికల సమయంలో మాత్రం మొండి చేయి చూపిస్తున్నారంటూ మనస్తాపంతో అతడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకునేందుకు యత్నించాడు. దీంతో గాంధీ భవన్ సిబ్బంది, పోలీసులు అతడిని అడ్డుకుని, అక్కడ నుంచి తరలించారు. తన కూతురు ప్రసన్న గౌడ్‌కు టికెట్ అడిగినా ఫలితం లేకపోయిందని కిశోర్ గౌడ్ ఆవేదన చెందాడు. మరోవైపు టికెట్ ఆశించిన పలువురు ఇవాళ కూడా గాంధీభవన్ వద్ద ఆందోళనకు దిగారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన మల్లు భట్టి విక్రమార్కకు నిరసనల సెగ తగిలింది. ఇష్టానుసారంగా టికెట్లు కేటాయింపు జరిగిందని, ఓ వైపు అభ్యర్థి పేరు ప్రకటించి మరోవైపు చివరి నిముషంలో భీఫామ్‌లు వేరేవాళ్లకు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అసంతృప్తుల నిరసనలతో గత అయిదు రోజులుగా కాంగ్రెస్ నేతలెవరూ గాంధీభవన్ వైపు అడుగు పెట్టడం లేదు.