‘కౌంట్’ డౌన్ షురూ..
భారీ బందోబస్తు మధ్య నేడే ఓట్ల లెక్కింపు..
288 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు
సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు బలగాల మోహరింపు
నగరంలోనూ కొన్ని రోడ్ల మూసివేత, మరికొన్ని చోట్ల ట్రాఫిక్ మళ్లింపు
సాక్షి, ముంబై: భారీ భద్రత మధ్య ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఇప్పటికే మూడంచల భద్రత వలయాన్ని ఏర్పాటు చేసిన పోలీసులు ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కోసం గతంలో 256 కేంద్రాలు ఏర్పాటు చేయగా ఈసారి ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 288 కేంద్రాలను ఏర్పాటు చేశారు. లెక్కింపు సమయంలో ప్రజలు గుంపులుగా చేరకూడదని ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నికల సంఘం ఆమోదించిన గుర్తింపు కార్డులున్నవారు మినహా మిగతా ఎవరినీ ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించేది లేదని మహారాష్ట్ర డీజీపీ (ఎన్నికలు) ఆదేశాలు జారీ చేశారు. ఫలితాలు వెలుపడిన అనంతరం కూడా విజయం సాధించిన అభ్యర్థులు ఊరేగింపు తదితరాలు చేపట్టాలనుకున్నప్పటికీ ఆయా ప్రాంతాల జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్, పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అదే విధంగా ఓట్ల లెక్కింపు సమయంలో కూడా సివిల్ డ్రెస్‌లలో పరిసరాలపై నిఘా వేసి ఉంచనున్నారు. సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు కేంద్ర బలగాలను కూడా మోహరించారు.
ట్రాఫిక్ మళ్లింపు...
ఓట్ల లెక్కింపునకు సంబంధించి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. భద్రత దృష్ట్యా నగరంలోని పలు ప్రాంతాల్లోని పలు రోడ్లను వాహనాల రాకపోకలు సాగించకుండా ఉండేందుకు మూసివేయగా మరికొన్ని రోడ్లపై ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
మాహీం అసెంబ్లీ నియోజకరవర్గం ఓట్ల లెక్కింపు ఎస్.కె.బోలేమార్గ్‌లోని అంథోనీయో డి సిల్వా హై స్కూల్‌లో నిర్వహించనున్నారు. దీంతో ఈ కేంద్రానికి సమీపంలోని కొన్ని రోడ్లను మూసి వేయగా మరి కొన్ని రోడ్ల ట్రాఫిక్‌ను మళ్లించారు. ట్రాఫిక్‌లో చేసిన మార్పుల మేరకు హనుమాన్ మందిరం నుంచి పోర్చ్‌గీస్ చర్చి జంక్షన్ వరకు ఎస్.కె.బోలే మార్గ్‌ను మూసి వేయనున్నారు.
ఇటువైపునుంచి వెళ్లే వాహనాలను గోఖలే రోడ్‌పై నుంచి మళ్లించనున్నారు. గోపినాథ్ చవాన్ చౌక్ నుంచి హనుమాన్ మందిరం జంక్షన్‌వరకు భవానీ శంకర్ రోడ్డుతోపాటు స్టీల్‌మన్ జంక్షన్ నుంచి ఎన్.సి.కేల్కర్ మార్క్ వరకు రానడే రోడ్డు, ఎస్.కె.బోలే రోడ్డు నుంచి రానడే రోడ్డు వరకు అశోక్ వృక్ష రోడ్డులను మూసివేయనున్నారు. అదే విధంగా వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు వర్లీలోని గాందీమైదానంలో ఉన్న లలితా కళాభవన్, కామ్‌కళ్యాణ్ కేంద్రంలో జరగగా శివ్డీ అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ఎన్‌ఎమ్ జోషి మార్గంపై ఉన్న మున్సిపల్ స్కూల్లో నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఎన్.ఎమ్.జోషి మార్గ్, జిఎమ్.బోస్లే మార్గ్ చుట్టుపక్కల పరిసరాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు పలు రోడ్లలో ట్రాఫిక్‌ను మళ్లించారు. ఇలా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిసరాలలో ట్రాఫిక్‌లో మార్పులు చేశారు.
సొంత గూటికి చేరుకుంటున్న అభ్యర్థులు....
ఎన్నికల అనంతరం ఇతర ప్రాంతాలకు వెళ్లిన అనేక మంది అభ్యర్థులు తమ సొంత నియోజకవర్గాలకు చేరుకుంటున్నారు. ఓట్ల లెక్కింపుకు ఒక రోజు ముందు సాయంత్రం వరకు దాదాపు అందరూ ఓట్ల లెక్కింపు కేంద్రాలున్న పరిసరాలకు చేరుకున్నప్పటికీ పలువురు అర్థరాత్రి వరకు చేరుకుంటారని తెలిసింది. అక్టోబరు 15వ తేదీని ఎన్నికలు జరిగిన తర్వాత కొంత విరామం కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన పలువురు అభ్యర్థులు ఆదివారం ఆదివారం ఓట్ల లెక్కింపు జరగనున్నందున మళ్లీ సొంత గూటికి చేరిపోయారు.
మొదటి ఫలితం ముంబాదేవి..?
సాక్షి, ముంబై: రాష్ట్రవ్యాప్తంగా ఎదురుచూస్తున్న ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలుపడనున్నాయి. 288 అసెంబ్లీ నియోజకవర్గాలలో అన్నింటికంటే ముందుగా ముంబైలోని ముంబాదేవి, వడాలా నియోజకవర్గాల ఫలితాలు వెలుపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. అన్ని నియోకవర్గాల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా, ఈ నియోజకవర్గాలలో ఫలితాలు కేవలం మూడు, నాలుగు గంటల్లోనే స్పష్టం అవనున్నాయని భావిస్తున్నారు. ముంబాదేవి, మాలేగావ్ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం తక్కువగా జరిగింది.
దీంతో ఈ నియోజకవర్గాల్లో ముందుగా ఫలితాలు వెలుపడతాయని చెప్పవచ్చు. రాష్ట్రంలోని నియోజకవర్గాలన్నికంటే ముంబైలోని వడాల అసెంబ్లీ నియోజకవర్గంలో అతితక్కువగా 1,96,859 మంది ఓటర్లుండగా 1,20,664 మంది ఓట్లు వేశారు. అయితే 2,37,743 మంది ఓటర్లున్న ముంబాదేవిలో మాత్రం కేవలం 1,10,118 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల ఫలితాలు అన్నింటికంటే ముందుగా వెలుపడే అవకాశాలున్నాయి.