పోస్టల్ బ్యాలెట్ల తరువాతే ఈవీఎం ఓట్ల లెక్కింపు
ఈసారి రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు
గతంతో పోలిస్తే 2.35 లక్షలు అదనం
శ్రీకాకుళం టాప్.. నరసాపురంలో అత్యల్పం
సాక్షి, అమరావతి: భారీ స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు నమోదైన నేపథ్యంలో రాష్ట్రంలో ఈదఫా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ 4న ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా తొలి అంచనాల సరళి తెలుసుకునేందుకు నిరీక్షించక తప్పదని అధికారులు అంచనా వేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తైన తరువాతే ఈవీఎం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నందున చాలా చోట్ల తొలి రౌండ్ ఫలితాల ప్రకటన ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి.
2019 ఎన్నికల్లో 2.62 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోగా ఈసారి 4.97 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లేశారు. 1.30 లక్షల మంది సచివాలయ సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడంతోపాటు అత్యవసర సేవల సిబ్బంది, వీడియోగ్రాఫర్లు, కెమెరా అసిసెంట్లు, ప్రైవేట్ డ్రైవర్లకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కలి్పంచారు. దీంతో ఎన్నికల విధుల్లో పాల్గొన్న 4.44 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు.
వీరే కాకుండా తొలిసారిగా రాష్ట్రంలో హోమ్ ఓటింగ్ విధానం ద్వారా 85 ఏళ్లు దాటిన 13,700 మంది వృద్ధులు, 12,700 మంది దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే ఓటేయగా అత్యవసర సేవలందించే మరో 27,100 మంది కూడా పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865, నంద్యాల జిల్లాలో 25,283, వైఎస్‌ఆర్ కడప జిల్లాలో 24,918 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. అత్యల్పంగా నరసాపురంలో 15,320 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. ప్రతి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు అధికంగా నమోదు కావడంతో లెక్కించేందుకు అదనపు టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు.
అన్నీ క్షుణ్నంగా పరిశీలించాకే..
ఈవీఎంలతో పోలిస్తే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సుదీర్ఘ సమయం తీసుకుంటుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ కవర్ తెరిచి ఏజెంట్లకు చూపించి ఆ ఓటు అర్హమైనదో కాదో గుర్తించాలి. కవర్ ‘ఏ’తో పాటు ఓటరు డిక్లరేషన్ ఫారం విడిగా లేకుంటే పరిగణలోకి తీసుకోరు. గెజిటెడ్ అధికారి సంతకం లేకపోయినా ఆ ఓటును పరిగణించరు. ప్రతి ఫెసిలిటేషన్ కేంద్రంలో గెజిటెడ్ అధికారిని అందుబాటులో ఉంచినా చాలా మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోలేదని సమాచారం.
పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటరి్నంగ్ అధికా>రి సీల్, సంతకం లేకుంటే ఆ ఓటును లెక్కలోకి తీసుకోరు. ఇలా పలు అంశాలను పరిశీలించాకే అర్హత పొందిన పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. 2019 ఎన్నికల్లో 56 వేల పోస్టల్ బ్యాలెట్లు (21.37 శాతం) చెల్లకుండా పోయాయి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాకే ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అందువల్ల ఉదయం తొమ్మిదిన్నర పది గంటల తర్వాతే తొలి అంచనాలు వెల్లడవుతాయని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment