ఏజెంట్లూ.. అవి అత్యంత కీలకం.. లెక్కింపులో జాగ్రత్తలు తప్పనిసరి
ఉదయం 6 గంటలలోపే కౌంటింగ్ కేంద్రాలకు రావాలి
ఆర్‌వో టేబుల్ మీద లెక్కింపు చెల్లుతుందో లేదో నిర్ధారించాకే లెక్కింపు చేపట్టాలి
13ఏ డిక్లరేషన్‌పై ఓటరు సంతకం, అటెస్టింగ్ సంతకం తప్పనిసరి
అనుమానం వస్తే వెంటనే ఆర్వోకి ఫిర్యాదు చేయాలి
సాక్షి, అమరావతి: పెద్ద ఎత్తున పోలైన పోస్టల్ బ్యాలెట్లు ఈసారి ఎన్నికల ఫలితాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. పోలింగ్ శాతం పెరగడం, పోస్టల్ బ్యాలెట్లు 4.97 లక్షలకు పైగా పోల్ అయిన నేపథ్యంలో జూన్ 4 జరిగే ఓట్ల లెక్కింపుల్లో అత్యంత కీలకం కానున్నాయి.
పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఎన్నికల సంఘం చివరి నిమిషంలో నిబంధనలు మార్చినందున లెక్కింపు విషయంలో ఏజెంట్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, సుదీర్ఘంగా సాగే అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా ఒక ఏజెంట్ పర్యవేక్షించాలని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు, లెక్కింపు విధానంపై ఏజెంట్లు ముందస్తు అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు.
చెల్లనివిగా ఎప్పుడు పరిగణిస్తారంటే?
» బ్యాలెట్ పేపరుపై ఓటు ఎవరికి నమోదు కాకపోవడం, ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఓటు వేసినా తిరస్కరిస్తారు.
» బ్యాలెట్ పేపరు చిరిగినా, గుర్తు పట్టలేనంతగా మారినా, ఓటు ఎవరికి వేశారో తెలిసే విధంగా ఏమైనా గుర్తులు లేదా ఏదైనా రాసి ఉన్నా తిరస్కరిస్తారు.
» నకిలీ బ్యాలెట్ పేపర్లను తిరస్కరిస్తారు.
» ఇలా తిరస్కరించిన ఓట్లన్నీ ఆర్వో పక్కన పెడతారు.
» ప్రతీ దశలో చెల్లని ఓట్లను ఆర్‌వో విడివిడిగా కట్టలు కట్టి ఉంచాలి
» ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత గెలిచిన అభ్యర్థి ఓట్లు తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లు కంటే తక్కువ ఉంటే వాటిని ఆర్వో తిరిగి పరిశీలిస్తారు.
» తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లను ఆర్వో, అబ్జర్వర్లు ఒకొక్కటే పరిశీలించి తుది ఫలితాన్ని ప్రకటిస్తారు.
డిక్లరేషన్ 13 ఏ అత్యంత కీలకం
» ఓటరు తన ఓటును కవర్ ‘ఏ’లో పొందుపరచి దానికి డిక్లరేషన్ 13 ఏ జత చేసి ఈ రెండింటినీ కవర్ ‘బీ’లో ఉంచి బ్యాలెట్ బాక్స్‌లో వేస్తారు.
» బ్యాలెట్ బాక్స్ నుంచి కవర్ బీ తెరవగానే ముందుగా బ్యాలెట్ పేపర్ ఉండే కవర్ ‘ఏ’ ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు.
» కవర్ బీ తెరవగానే అందులో ఫారం 13 సీలో రెండు డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి. బ్యాలెట్ పేపర్ (ఫారం 13 బీ) ఉండే కవర్ ఏ, ఓటరు ఇచ్చిన డిక్లరేషన్ 13 ఏ ఫారం ఉండాలి
» ఈ రెండూ విడివిడిగా లేకపోతే ఆ ఓటును చెల్లని ఓటుగా పరిగణించి పక్కన పెట్టాలి.
» ఆ తర్వాత 13 ఏ డిక్లరేషన్ సరిగా ఉందా? లేదా? అన్నది పరిశీలించాలి.
» ఈ డిక్లరేషన్ ఫారంపై ఓటరు సంతకంతోపాటు అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, సీల్ ఉందో లేదో పరిశీలించాలి.
» ఒకవేళ అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, సీల్ లేకపోయినా ఆ ఓటును తిరస్కరించవద్దని ఎన్నికల సంఘం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
» అటెస్టింగ్ అధికారి సంతకంపై అనుమానం ఉంటే ఏజెంట్లు తమ అభ్యంతరాన్ని ఆర్వోకు తెలియచేయాలి.
» ఆర్వో తమ వద్ద ఉన్న అటెస్టింగ్ అధికారి సంతకంతో సరి పోల్చి ఒకే విధంగా ఉంటే ఆమోదిస్తారు. లేకపోతే తిరస్కరిస్తారు.
» ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాతే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విధానం మొదలవుతుంది.
» తొలుత కవర్ ఏ ఓపెన్ చేసి అందులోని ఫారం 13 బీ బ్యాలెట్ పేపర్‌ను ఓపెన్ చేస్తారు.
» 13 ఏపై ఉన్న బ్యాలెట్ సీరియల్ నెంబర్, 13 బీ మీద ఉన్న బ్యాలెట్ సీరియల్ నెంబర్ సరిపోలాలి.
» ఈ రెండు నెంబర్లలో తేడా ఉంటే ఆ ఓటును చెల్లని ఓటుగా పరిగణించాలి.
» ఏజెంట్లు తమ ఫిర్యాదులు ప్రతీది లిఖిత పూర్వకంగా ఇవ్వాలిపోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఇలా
» జూన్ 4 ఓట్ల లెక్కింపు తొలుత పోస్టల్ బ్యాలెట్లతోనే మొదలవుతుంది. ఉదయం 8 గంటల కల్లా ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండటంతో ఏజెంట్లు ఉదయం 6 గంటలలోపే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలి. కౌటింగ్ కేంద్రంలో మొత్తం 15 టేబుళ్లు ఉంటాయి. ఒకవైపు ఏడు మరో వైపు ఏడు చొప్పున అమర్చి చుట్టూ కంచె వేస్తారు. ఈ రెండు వరుసల మధ్యలో రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం టేబుల్ ఉంటుంది. ఆర్వో పర్యవేక్షణలోనే మొత్తం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుంది.
» పోస్టల్ బ్యాలెట్లలో రెండు రకాలుంటాయి. మిలటరీలో సేవలందించే వారు ఎలక్ట్రానిక్ రూపంలో పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోగా 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు, కోవిడ్ బాధితులు, పోలింగ్ రోజు విధులు నిర్వహించిన ఉద్యోగులు సాధారణ విధానంలో పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. ఈ రెండు విధానాల్లోనూ ఓట్ల లెక్కింపు ఒకే రకంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేసిన వారి క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా వివరాలను తెలుసుకుంటారు.
» పోస్టల్ బ్యాలెట్‌లో రెండు రకాల కవర్లు ఏ, బీతో పాటు మూడు రకాల ఫారమ్స్ 13 ఏ, 13 బీ, 13 సీ ఉంటాయి. తొలుత పోస్టల్ బ్యాలెట్‌ను ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటరు వినియోగించుకున్నారా? లేదా? అనేది పరిశీలించి లెక్కింపు అర్హతను నిర్థారిస్తారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఇదే అత్యంత ప్రధానమైనది. పోస్టల్ బ్యాలెట్ చెల్లుతుందా? లేదా? ఎలాంటి సందర్భాల్లో ఏజెంట్లు అభ్యంతరం చెప్పవచ్చో ఇప్పుడు చూద్దాం..
Comments
Please login to add a commentAdd a comment