
సాక్షి, కృష్ణా: సంక్షేమ పాలనను జనం మెచ్చారు. ప్రాదేశిక ఎన్నికల్లో అధికార వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు. ఫలితంగా ఈ ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీ ప్రభంజనం కొనసాగింది. పంచాయతీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ జిల్లా వాసులు ఆ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పాలనకు మెచ్చి తిరుగులేని తీర్పునిచ్చారు.
వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు ఏకపక్షంగా పట్టం కట్టారు. అత్యధిక స్థానాలే కాదు.. భారీ మెజార్టీలూ అందించారు. ఎంతలా అంటే.. కొన్ని మండలాల్లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అడ్రస్ గల్లంతయింది. ఆయా మండలాల్లో ఒక్క ఎంపీటీసీ స్థానాన్ని దక్కించుకోలేక చతికిలపడింది. పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించి, వారితో నామినేషన్లు వేయించి ఓటమి భయంతో బరి నుంచి తప్పుకుంది. అయినప్పటికీ ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో కొనసాగారు.
తొలి నుంచి వైఎస్సార్ సీపీ హవా
ఆదివారం జిల్లాలోని 17 కేంద్రాల్లోని 46 కౌంటింగు హాళ్లలో పరిషత్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమైది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లను లెక్కించారు. ఆరంభం నుంచి ఆఖరి వరకు ఏ దశలోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు టీడీపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. జిల్లాలో మొత్తం 812 ఎంపీటీసీ, 49 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. పురపాలకసంఘాల్లో విలీనంతో పెనమలూరు మండలంలో 48, మచిలీపట్నం మండలంలో 20, జగ్గయ్యపేట మండలంలో 21 వెరసి 89, ఏకగ్రీవమైన 69, అభ్యర్థులు మరణించడంతో ఆరు చోట్ల కలిపి 164 స్థానాలకు ఎన్నికలు జరగలేదు.
648 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 49 జెడ్పీటీసీ స్థానాలకు 41 చోట్లే ఎన్నికలు జరిగాయి. మచిలీపట్నం, పెనమలూరు, జగ్గయ్యపేటకు ఎన్నికలు జరగలేదు. జి.కొండూరు, విస్సన్నపేట, పెడనల్లో అభ్యర్థులు మృతి చెందడంతో వాయిదాపడ్డాయి. ఉంగుటూరు, మండవల్లి స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 69 ఎంపీటీసీల్లో 67 మంది వైఎస్సార్ సీపీ, ఇద్దరు టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.
ఫలితాలు ఇలా..
వైఎస్సార్ సీపీ 572, టీడీపీ 60, జనసేన 9, బీజేపీ, సీపీఐ, బీఎస్పీకి ఒక్కొక్క చోట, స్వతంత్రులు నాలుగు స్థానాల్లోను గెలుపొందారు. కోడూరు మండలంలో 13కు 13 ఎంపీటీసీలూ, పెడనలో 10కి 10 స్థానాలూ, బంటుమిల్లిలో 13కి 13, నందివాడలో 11 ఎంపీటీసీ స్థానాల్లో అన్నింటినీ, విస్సన్నపేట మండలంలో 17కు 17, గుడ్లవల్లేరులో 15కి 15, చాట్రాయిలో 15కి 15, మండవల్లిలో 14కు 14, ఎ.కొండూరులో 14కు 14, ఉంగుటూరు మండలంలో 16
ఎంపీటీసీలకు 15, నూజివీడులో 19కు 17, పెదపారుపాడులో 9కి 9 స్థానాలను వైఎస్సార్ సీపీ కైవశం చేసుకుంది. ఇలా జిల్లాలో చాలా మండలాల్లో టీడీపీ బోణీ కొట్టని పరిస్థితి ఏర్పడింది.
జెడ్పీటీసీ స్థానాల్లోనూ హవా..
మరోవైపు జెడ్పీటీసీ స్థానాల్లోనూ వైఎస్సార్ సీపీ పూర్తి హవా కొనసాగించింది. మొత్తం 49 జెడ్పీటీసీ స్థానాల్లో ఇప్పటికే రెండు ఏకగ్రీవం కాగా ఆ రెండింటిని వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. వివిధ కారణాలతో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగలేదు. ఎన్నికలు జరిగిన 41 స్థానాల్లో మోపిదేవిని టీడీపీ దక్కించుకోగా మిగిలిన 40 వైఎస్సార్ సీపీ పరమయ్యాయి. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
► కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లి మండలంలో ముదినేపల్లి–2, వణుదురు ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థుల మృతి వల్ల ఎన్నిక జరగలేదు.
► నూజివీడు నియోజకవర్గంలోని నూజివీడు మండలం దేవరగుంట స్థానం అభ్యర్థి మృతి వల్ల ఎన్నిక జరగలేదు.
► నందిగామ నియోజకవర్గంలోని వీరులపాడు మండలం వీరులపాడు సెగ్మెంట్ అభ్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుతో సీపీఐ పారీ్టలో గెలిచారు.
► గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం అల్లాపురం సెగ్మెంట్ అభ్యర్థి మృతి చెందటంతో ఎన్నిక జరగలేదు.
► అవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాయలంక మండలం పెదపాలెంలో అభ్యర్థి మృతి చెందటంతో ఎన్నిక జరగలేదు.
Comments
Please login to add a commentAdd a comment