ప్రాదేశిక ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించింది. ఎన్నిక ఏదైనా ‘రిజల్ట్ రిపీట్’ అంటూ మరోసారి నిరూపించింది. సార్వత్రిక, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మాదిరే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ‘ఫ్యాన్’ గాలి హోరెత్తింది. ఈ ధాటికి ‘సైకిల్’ తుక్కుతుక్కు అయ్యింది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం
‘ప్రాదేశిక’ పోరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. సమీప ప్రత్యర్థులపై భారీ మెజార్టీలతో గెలుపొందారు. ఏకంగా 60 జెడ్పీటీసీ, 762 ఎంపీటీసీ స్థానాలను తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జిల్లాలోని 17 కేంద్రాల్లో చేపట్టారు. రాత్రి ఏడున్నర గంటలకల్లా పూర్తిస్థాయిలో ఫలితాలు వెలువడ్డాయి. ఓటరు తీర్పు ఏకపక్షమేనని తేలిపోయింది.
జిల్లాలో 63 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా.. పోలింగ్‌కు ముందే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చనిపోవడంతో చిలమత్తూరు స్థానానికి ఎన్నిక నిర్వహించలేదు.
మిగిలిన 62 స్థానాలకు కౌంటింగ్ జరిగింది. ఇందులో 60 స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. అగళి స్థానాన్ని టీడీపీ దక్కించుకోగా.. రొళ్లలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. అలాగే మొత్తం 841 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఇందులో 50 ఏకగ్రీవమయ్యాయి. వైఎస్సార్‌సీపీ 49, టీడీపీ 1 స్థానాన్ని ఏకగ్రీవంగా దక్కించుకున్నాయి. పది చోట్ల అభ్యర్థులు చనిపోవడంతో ఎన్నిక నిర్వహించలేదు.
మిగిలిన 781 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగ్గా..ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. వైఎస్సార్‌సీపీ 713, టీడీపీ 50, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, సీపీఎం, సీపీఐ ఒక్కో ఎంపీటీసీ స్థానంలో గెలుపొందాయి. 13 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఏకగ్రీవాలతో కలిపి వైఎస్సార్‌సీపీ ఏకంగా 762 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ కేవలం 51 స్థానాలకు పరిమితమైంది.
అన్ని డివిజన్లలో సై‘కిల్’
పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో మాదిరే ప్రాదేశిక ఎన్నికల్లోనూ టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో పట్టు కోల్పోయింది. టీడీపీ ముఖ్య నేతల ఇలాకాల్లోనూ ఆ పార్టీ కనీస ప్రభావం చూపలేదు. జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్లలోనూ సై‘కిల్’ కావడం గమనార్హం. అనంతపురం డివిజన్‌లో 19 జెడ్పీటీసీ, 254 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అన్ని జెడ్పీటీసీ స్థానాలతో పాటు 226 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. టీడీపీకి 23 స్థానాలు మాత్రమే దక్కాయి. సీపీఎం ఒకటి, స్వతంత్ర అభ్యర్థులు నాలుగు ఎంపీటీసీ స్థానాలు గెలుపొందారు.
►ధర్మవరం డివిజన్‌లోని ఎనిమిది జెడ్పీటీసీ స్థానాలనూ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. అలాగే 79 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ 74 చోట్ల గెలుపొందగా.. రామగిరిలో ఒక స్థానం, రాప్తాడు 2, కనగానపల్లెలో 2 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
►కళ్యాణదుర్గం డివిజన్‌లో మొత్తం 11 జెడ్పీటీసీ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయభేరి మోగించారు. 143 ఎంపీటీసీ స్థానాలకు గానూ వైఎస్సార్‌సీపీ 137 స్థానాల్లో గెలుపొందగా.. కేవలం ఐదు చోట్ల టీడీపీ, ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.
►పెనుకొండ డివిజన్‌లో 12 జెడ్పీటీసీలకు గాను పది స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. మడకశిర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అగళి జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి గెలుపొందగా.. రొళ్ల స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. అలాగే 183 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 162 స్థానాలను వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. 13 స్థానాల్లో టీడీపీ, పరిగి మండలం కొడిగెనహళ్లి–3 స్థానంలో బీజేపీ అభ్యర్థి గెలిచారు. స్వతంత్ర అభ్యర్థులు ఏడు చోట్ల విజయం సాధించారు.
►కదిరి డివిజన్‌లోనూ టీడీపీకి పరువు పోయింది. 12 జెడ్పీటీసీ స్థానాలనూ వైఎస్సార్‌సీపీ ఖాతాలో వేసుకుంది. అలాగే 122 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. వైఎస్సార్‌సీపీ 114 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. టీడీపీ ఆరు స్థానాలకే పరిమితమైంది. జనసేన, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కో స్థానంలో గెలుపొందారు.
‘సంక్షేమ’ విజయం
పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలతో పాటు తాజాగా ప్రాదేశిక ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయానికి వైఎస్ జగన్ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దోహదపడ్డాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు వర్తింపజేయడం, సచివాలయ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా, జాప్యం లేకుండా లబ్ధి చేకూరుస్తుండడంతో ప్రజలు వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచారని అంటున్నారు. మరోవైపు పార్టీ అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి మంచి ఫలితాలు సాధించగలిగారు.
Comments
Please login to add a commentAdd a comment