దేవుడా....దేవుడా...!
- సార్వత్రిక ఫలితాలు తేలేది నేడే
- రెండు ఎంపీ, 16 ఎమ్మెల్యే స్థానాలకు ఓట్ల లెక్కింపు
- దేవుళ్లకు మొక్కుతున్న అభ్యర్థులు
- ఫలితాలపై సర్వత్రా ఆసక్తి
- సర్వేల పేరుతో పందాలకు ఊతం
- రూ.కోట్లు దాటిన బెట్టింగ్‌లు
ఓటు కోసం ఓటరు దేవుడి చుట్టూ రోజుల తరబడి ప్రదక్షిణలు చేసిన అభ్యర్థులు ఇప్పుడు అనుకూల ఫలితాలు ఇవ్వాలని కోరుతూ తమ ఇష్ట దైవాలను ప్రార్థిస్తున్నారు. తమ నేతలను గెలిపించాలని కోరుతూ ఆయా పార్టీల కార్యకర్తలు కూడా దేవుళ్లనే ఆశ్రయిస్తున్నారు. అభ్యర్థుల గెలుపు ఓటములపై పందేలు నిర్వహించిన బుకీలు కూడా తమకు లాభాలు వచ్చేలా దీవించాలంటూ వేడుకుంటున్నారు.
సాక్షి, మచిలీపట్నం : ఓటేసి గెలిపించాలని చేతులెత్తి నమస్కరించిన అభ్యర్థుల్లో తమకు ఇష్టమైన వారిని ఎంపిక చేసుకున్న ఓటరు దేవుళ్లు తమ తీర్పును ఈవీఎంలలో పదిలపరిచారు. ఈవీఎంలో భద్రపరిచిన ఓటరు తీర్పు శుక్రవారం వెలుగు చూడనుంది. జిల్లాలో 33,37,071 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల 7వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 25,14,29 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
విజయవాడ, మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గాలకు 33 మంది అభ్యర్థులు, 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు 227 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్యే పోటీ జరి గింది. జిల్లాలో ఇరు పార్టీల అభ్యర్థుల్లో గెలుపు ఎవరిది అనేదానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. జయాపజయాలపై అభ్యర్థులు, ఆయా పార్టీల కార్యకర్తల్లో గుబులు రేగుతోంది.
ఫలితాలపై ప్రజల్లోనూ ఆసక్తి ఉంది. ఏది ఏమైనా తాము సీట్లు, ఓట్లుపై పెట్టిన పందేలు నెగ్గేలా ఫలితాలు రావాలంటూ బెట్టింగ్ రాయుళ్లు కూడా దేవుళ్లకు మొక్కుతున్నారు. గెలిస్తే కొండకొస్తామని, కొబ్బరికాయ కొడతామని తమ ఇష్ట దైవాలకు మొక్కుతున్నారు. దీంతో ఫలితాల అనంతరం దేవుళ్లు కూడా రాజకీయ మొక్కులతో బిజీ అయిపోతారనడంలో ఏమాత్రం సందేహం లేదు.
వేగంగా ఫలితాల వెల్లడికి చర్యలు
సార్వత్రిక ఎన్నికల ఫలితాలను వేగంగా వెల్లడించేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.రఘునందనరావు చర్యలు చేపట్టారు. విజయవాడ సమీపంలోని కానూరు పీవీపీ సిద్ధార్థ, వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీల్లో శుక్రవారం ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపును ప్రశాంతంగా త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు.
విజయవాడ, మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కైకలూరు, నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరుగా ఓట్ల లెక్కింపు చేపట్టేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 7.50 గంటలకు స్ట్రాంగ్ రూమ్‌లను తెరిచి కచ్చితంగా 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొదటి ఫలితం వీలైనంత త్వరగా ప్రకటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు పరిధిలో ఏడేసి టేబుళ్లు ఏర్పాటు చేసి ఓట్ల లెక్కిస్తారు. ఇందుకోసం కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టారు.
రూ.కోట్లలో బెట్టింగులు
క్రికెట్‌ను ఆధారంగా చేసుకుని కోట్ల రూపాయాల పందేలకు కౌంటర్లు తెరిచే బుకీలు రాజకీయ రంగాన్ని కూడా వదల్లేదు. జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు 16 అసెంబ్లీ స్థానాల ఫలితాలపై కోట్లాది రూపాయాలు బెట్టింగ్‌లు వేశారు. క్రికెట్‌లో బంతి బంతికి వచ్చే పరుగులు, పడే వికెట్లపై బెట్టింగ్‌లు కాసే వారంతా ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయి? తదితర అన్ని కోణాల్లోను పెద్ద ఎత్తున పందాలు ఒడ్డారు. శుక్రవారం ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఎంత మంది గరీబులవుతారో.. ఎంత మంది కుబేరులవుతారో చూడాలి.