M.Raghunandanaravu
-
తెలంగాణకు కలెక్టర్ రఘునందన్‌రావు
రేపు లేదా ఎల్లుండి రిలీవ్ అయ్యే అవకాశం మచిలీపట్నం : కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు తెలంగాణ రాష్ట్రానికి బదిలీ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ ప్రాంతానికి కేటాయించిన ఐఏఎస్ అధికారుల జాబితాలో ఆయన ఉన్నారు. దీంతో కలెక్టర్ బదిలీ అనివార్యమైంది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆయన తెలంగాణ ప్రాంతానికి బదిలీ అవుతారనే ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ నెల 4 లేదా 5వ తేదీల్లో కలెక్టర్ బదిలీకి సంబంధించిన ఉత్తర్వులు వస్తాయని, వెంటనే రిలీవ్ అవుతారని సమాచారం. రఘునందన్‌రావు జిల్లా కలెక్టర్‌గా 2013, అక్టోబరు 14వ బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే నంబరు నెలలో వరుసగా సంభవించిన హెలెన్, లెహర్ తుపానుల సందర్భంగా అధికారులను అప్రమత్తం చేసి సమర్థంగా పనిచేశారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా ఆయన వారంలో మూడు రోజులు జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో, విజయవాడ క్యాంపు కార్యాలయంలో నాలుగు రోజులపాటు విధులు నిర్వర్తిస్తున్నారు. గత ఏడాది జరిగిన స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలను సమర్థంగా నిర్వహించారు. సమైక్యాంద్ర ఉద్యమ సమయంలోనూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గవర్నర్ పాలన సమయంలోనూ పారదర్శకంగా వ్యవహరించారు. ప్రజలతో మమేకమై ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా అచ్చ తెలుగులోనే మాట్లాడే కలెక్టర్‌గా రఘునందన్‌రావు పేరు తెచ్చుకున్నారు.కలెక్టర్ రఘునందన్‌రావు బదిలీ అనివార్యం కావడంతో నూతన కలెక్టర్‌గా ఎవరు వస్తారనే అంశం చర్చనీయాంశంగా మారింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేసిన ప్రద్యుమ్న కలెక్టర్‌గా వచ్చే అవకాశం అధికంగా ఉందని అధికారులు చెబుతున్నారు. -
రూ.105 కోట్ల రుణాలు అందజేత
మచిలీపట్నం : స్వాతంత్య్ర దిన వేడుకల్లో భాగంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో శుక్రవారం 3,218 డ్వాక్రా సంఘాలకు రూ.105 కోట్ల రుణాలను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అందజేశారు. అనంతరం వివిధ శాఖలు ప్రదర్శించిన శకటాలను, స్టాల్స్‌ను మంత్రులు పరిశీలించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి తొమ్మిది మందికి రూ.5.10 లక్షలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, కలెక్టర్ ఎం.రఘునందనరావు, ఎస్పీ జి.విజయకుమార్, జేసీ జె.మురళీ, ఏజేసీ బీఎల్ చెన్నకేవరావు, డీఆర్వో బి.ప్రభావతి పాల్గొన్నారు. -
ఖాళీ భూములు గుర్తించండి : కలెక్టర్
కలెక్టర్ విజయవాడ : విజయవాడ, నూజివీడు డివిజన్ల పరిధిలో ఖాళీ భూముల వివరాలను సమగ్రంగా రూపొందించాలని, మ్యాప్‌లు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందనరావు సబ్ కలెక్టర్లను ఆదేశించారు. భూముల వివరాలపై నగరంలోని తన చాంబర్లో గురువారం ఆయన జాయింట్ కలెక్టర్ జె.మురళితో కలసి విజయవాడ, నూజివీడు సబ్ కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలతో పాటు ఇతర సంస్థలు కూడా వచ్చే అవకాశం ఉన్నందున ఖాళీ స్థలాల గుర్తింపునకు చర్యలు తీసుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు. ఇందులో భాగంగా విజయవాడ, నూజివీడు రెవెన్యూ డివిజన్లకు చెందిన మ్యాప్‌లను పరిశీలించి రెవెన్యూ, అటవీ భూములకు సంబంధించి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మ్యాప్‌లు రూపొం దించే సందర్భంలో సర్వే నంబర్లు, అటవీ, రెవెన్యూ తదితర భూముల వివరాలు స్పష్టంగా గుర్తించాలని డెప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. ఈ విషయంలో సబ్ కలెక్టర్లు, అటవీ అధికారులు పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలని కోరారు. జిల్లాకు ప్రతిష్టాత్మకమైన కళాశాలలు, వైద్య సంబంధ సంస్థలు వచ్చే అవకాశం ఉన్నందున దీనిపై పూర్తి సమగ్ర నివేదికను రిమార్క్‌లతో అందించాలని ఆదేశించారు. సమావేశంలో సబ్ కలెక్టర్ డి.హరిచందన, నూజివీడు సబ్ కలెక్టర్ కేవీఎస్ చక్రధరబాబు, ఎన్ఓయూఎల్పీ ఎం రమేష్‌కుమార్, డీఎఫ్ఓ ఎస్ రాజశేఖర్, ఎఫ్ఎస్ఓ వీ సుబ్బారావు, డెప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్లు ఎన్ సత్తిబాబు (విజయవాడ), కేవీ రామకృష్ణ (నూజివీడు) పాల్గొన్నారు. -
దేవుడా....దేవుడా...!
సార్వత్రిక ఫలితాలు తేలేది నేడే రెండు ఎంపీ, 16 ఎమ్మెల్యే స్థానాలకు ఓట్ల లెక్కింపు దేవుళ్లకు మొక్కుతున్న అభ్యర్థులు ఫలితాలపై సర్వత్రా ఆసక్తి సర్వేల పేరుతో పందాలకు ఊతం రూ.కోట్లు దాటిన బెట్టింగ్‌లు ఓటు కోసం ఓటరు దేవుడి చుట్టూ రోజుల తరబడి ప్రదక్షిణలు చేసిన అభ్యర్థులు ఇప్పుడు అనుకూల ఫలితాలు ఇవ్వాలని కోరుతూ తమ ఇష్ట దైవాలను ప్రార్థిస్తున్నారు. తమ నేతలను గెలిపించాలని కోరుతూ ఆయా పార్టీల కార్యకర్తలు కూడా దేవుళ్లనే ఆశ్రయిస్తున్నారు. అభ్యర్థుల గెలుపు ఓటములపై పందేలు నిర్వహించిన బుకీలు కూడా తమకు లాభాలు వచ్చేలా దీవించాలంటూ వేడుకుంటున్నారు. సాక్షి, మచిలీపట్నం : ఓటేసి గెలిపించాలని చేతులెత్తి నమస్కరించిన అభ్యర్థుల్లో తమకు ఇష్టమైన వారిని ఎంపిక చేసుకున్న ఓటరు దేవుళ్లు తమ తీర్పును ఈవీఎంలలో పదిలపరిచారు. ఈవీఎంలో భద్రపరిచిన ఓటరు తీర్పు శుక్రవారం వెలుగు చూడనుంది. జిల్లాలో 33,37,071 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల 7వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 25,14,29 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయవాడ, మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గాలకు 33 మంది అభ్యర్థులు, 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు 227 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్యే పోటీ జరి గింది. జిల్లాలో ఇరు పార్టీల అభ్యర్థుల్లో గెలుపు ఎవరిది అనేదానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. జయాపజయాలపై అభ్యర్థులు, ఆయా పార్టీల కార్యకర్తల్లో గుబులు రేగుతోంది. ఫలితాలపై ప్రజల్లోనూ ఆసక్తి ఉంది. ఏది ఏమైనా తాము సీట్లు, ఓట్లుపై పెట్టిన పందేలు నెగ్గేలా ఫలితాలు రావాలంటూ బెట్టింగ్ రాయుళ్లు కూడా దేవుళ్లకు మొక్కుతున్నారు. గెలిస్తే కొండకొస్తామని, కొబ్బరికాయ కొడతామని తమ ఇష్ట దైవాలకు మొక్కుతున్నారు. దీంతో ఫలితాల అనంతరం దేవుళ్లు కూడా రాజకీయ మొక్కులతో బిజీ అయిపోతారనడంలో ఏమాత్రం సందేహం లేదు. వేగంగా ఫలితాల వెల్లడికి చర్యలు సార్వత్రిక ఎన్నికల ఫలితాలను వేగంగా వెల్లడించేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.రఘునందనరావు చర్యలు చేపట్టారు. విజయవాడ సమీపంలోని కానూరు పీవీపీ సిద్ధార్థ, వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీల్లో శుక్రవారం ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపును ప్రశాంతంగా త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. విజయవాడ, మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కైకలూరు, నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరుగా ఓట్ల లెక్కింపు చేపట్టేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 7.50 గంటలకు స్ట్రాంగ్ రూమ్‌లను తెరిచి కచ్చితంగా 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొదటి ఫలితం వీలైనంత త్వరగా ప్రకటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు పరిధిలో ఏడేసి టేబుళ్లు ఏర్పాటు చేసి ఓట్ల లెక్కిస్తారు. ఇందుకోసం కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టారు. రూ.కోట్లలో బెట్టింగులు క్రికెట్‌ను ఆధారంగా చేసుకుని కోట్ల రూపాయాల పందేలకు కౌంటర్లు తెరిచే బుకీలు రాజకీయ రంగాన్ని కూడా వదల్లేదు. జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు 16 అసెంబ్లీ స్థానాల ఫలితాలపై కోట్లాది రూపాయాలు బెట్టింగ్‌లు వేశారు. క్రికెట్లో బంతి బంతికి వచ్చే పరుగులు, పడే వికెట్లపై బెట్టింగ్‌లు కాసే వారంతా ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయి? తదితర అన్ని కోణాల్లోను పెద్ద ఎత్తున పందాలు ఒడ్డారు. శుక్రవారం ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఎంత మంది గరీబులవుతారో.. ఎంత మంది కుబేరులవుతారో చూడాలి.