ఖాళీ భూములు గుర్తించండి : కలెక్టర్
కలెక్టర్
విజయవాడ : విజయవాడ, నూజివీడు డివిజన్ల పరిధిలో ఖాళీ భూముల వివరాలను సమగ్రంగా రూపొందించాలని, మ్యాప్‌లు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందనరావు సబ్ కలెక్టర్లను ఆదేశించారు. భూముల వివరాలపై నగరంలోని తన చాంబర్‌లో గురువారం ఆయన జాయింట్ కలెక్టర్ జె.మురళితో కలసి విజయవాడ, నూజివీడు సబ్ కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలతో పాటు ఇతర సంస్థలు కూడా వచ్చే అవకాశం ఉన్నందున ఖాళీ స్థలాల గుర్తింపునకు చర్యలు తీసుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు. ఇందులో భాగంగా విజయవాడ, నూజివీడు రెవెన్యూ డివిజన్‌లకు చెందిన మ్యాప్‌లను పరిశీలించి రెవెన్యూ, అటవీ భూములకు సంబంధించి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మ్యాప్‌లు రూపొం దించే సందర్భంలో సర్వే నంబర్లు, అటవీ, రెవెన్యూ తదితర భూముల వివరాలు స్పష్టంగా గుర్తించాలని డెప్యూటీ సర్వే ఇన్‌స్పెక్టర్లను ఆదేశించారు.
ఈ విషయంలో సబ్ కలెక్టర్లు, అటవీ అధికారులు పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలని కోరారు. జిల్లాకు ప్రతిష్టాత్మకమైన కళాశాలలు, వైద్య సంబంధ సంస్థలు వచ్చే అవకాశం ఉన్నందున దీనిపై పూర్తి సమగ్ర నివేదికను రిమార్క్‌లతో అందించాలని ఆదేశించారు. సమావేశంలో సబ్ కలెక్టర్ డి.హరిచందన, నూజివీడు సబ్ కలెక్టర్ కేవీఎస్ చక్రధరబాబు, ఎన్‌ఓయూఎల్‌పీ ఎం రమేష్‌కుమార్, డీఎఫ్‌ఓ ఎస్ రాజశేఖర్, ఎఫ్‌ఎస్‌ఓ వీ సుబ్బారావు, డెప్యూటీ సర్వే ఇన్‌స్పెక్టర్లు ఎన్ సత్తిబాబు (విజయవాడ), కేవీ రామకృష్ణ (నూజివీడు) పాల్గొన్నారు.