వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో అర్ధరాత్రి దాటినా తేలని మొదటి రౌండ్ ఫలితం
ముందుగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు బుధవారం ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చి 4 హాళ్లలో ఏర్పాటు చేసిన 96 టేబుళ్లపై ఉంచి 25 బ్యాలెట్ పేపర్లను ఒక బండిల్‌గా కట్టే ప్రక్రియను మొదట ప్రారంభించారు. ఆ బండిళ్లు కట్టే ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. 5 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అర్ధరాత్రి దాటినా కూడా మొదటి రౌండ్ ఫలితాలు వెల్లడికాలేదు. కౌంటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
4 రౌండ్ల తర్వాత మొదటి ప్రాధాన్యత ఫలితం
పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం 4,63,839 ఓట్లుండగా 3,36,013 ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నాలుగు రౌండ్లలో ఈ లెక్కింపు పూర్తవుతుంది. నాలుగు హాళ్లలో ఏర్పాటు చేసిన 96 టేబుళ్లలో ఒక టేబుల్‌కు ఒక రౌండ్‌లో వెయ్యి ఓట్లు లెక్కిస్తున్నారు. అంటే ప్రతి రౌండ్‌లో 96 వేల చొప్పున 4వ రౌండ్‌లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడతారు.
మొదటి రౌండ్‌కు 6 గంటల సమయం: మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపునకు దాదాపు 6 గంటల సమయం పట్టింది. మిగతా మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 11 గంటల వరకు పూర్తయ్యే అవకాశముంది. ఓట్ల లెక్కింపు సమయంలోనే ఆయా అభ్యర్థులకు బ్యాలెట్ పేపర్లు చూపి ఏ అభ్యరి్థకి మొదటి ప్రాధాన్యత ఓటు వేశారో చూపించి, ఆ అభ్యర్థి డబ్బాలో వేస్తున్నారు. ఒక వేళ ఏదేని ఓటు చెల్లకపోతే అది ఏజెంట్లకు చూపి చెల్లని ఓట్ల డబ్బాలో వేస్తున్నారు. ఇలా ప్రతి రౌండ్‌లోనూ కౌంటింగ్ సందర్భంగా చెల్లిన, చెల్లని ఓట్లు లెక్కిస్తున్నారు.
పూర్తయిన మొదటి రౌండ్ కౌంటింగ్
బుధవారం రాత్రి 12 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయ్యింది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన మొదటి రౌండ్ లెక్కింపునకు ఆరు గంటల సమయం పట్టింది. అయితే మిగతా మూడు రౌండ్లకు అంత సమయం పట్టదని, వాటికి తక్కువ సమయమే పడుతుందని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి నాలుగు రౌండ్లలో జరిగే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 11 గంటల వరకు పూర్తయ్యే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment