25,224 మందితో పటిష్ట బందోబస్తు  | DGP Thakur Says About Security Measures for Votes Counting | Sakshi
Sakshi News home page

25,224 మందితో పటిష్ట బందోబస్తు 

Published Wed, May 22 2019 4:34 AM | Last Updated on Wed, May 22 2019 8:35 AM

DGP Thakur Says About Security Measures for Votes Counting - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని, రాజకీయ పార్టీలకు చెందిన భారీ కాన్వాయ్‌లను కూడా అనుమతించబోమని డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 16 ప్రాంతాల్లోని 36 కేంద్రాల్లో కౌంటింగ్‌ జరుగుతుందని చెప్పారు. అందుకు తగిన బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో నాలుగంచెల భద్రతా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. మొదటి దశలో కౌంటింగ్‌ హాలు వద్ద కేంద్ర సాయుధ బలగాలు ఉంటాయని, కౌంటింగ్‌ కేంద్రం వద్ద రెండో దశలో ఏపీఎస్‌పీ సాయుధ పోలీసులు ఉంటారని, మూడో దశలో బాడీ వోర్న్‌ కెమెరాలు ధరించిన పోలీసులు కౌంటింగ్‌ కేంద్రం బయట ఉంటారని, నాలుగో దశలో ప్రత్యేక పోలీసు బృందాలు వాహనాల్లో గస్తీ తిరుగుతుంటాయని పేర్కొన్నారు.  

అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టేందుకు తగినంత పోలీస్‌ బలగం అందుబాటులో ఉందని డీజీపీ ఠాకూర్‌ చెప్పారు. 35 కంపెనీల కేంద్ర బలగాల్లో 3,325 మంది, 61 కంపెనీల ఏపీఎస్‌పీ బలగాల్లో 5,490 మంది, 118 స్పెషల్‌ పార్టీ టీమ్‌ల్లో 1,770 మంది, 67 ఏపీ ప్లాటూన్లలో 1,340 మంది సిబ్బంది, రాష్ట్రంలోని 21 మంది ఎస్పీలు, 31 మంది అదనపు ఎస్పీలు, 137 మంది డీఎస్పీలు, 379 మంది సీఐలు, 1,037 మంది ఎస్‌ఐలు, 2425 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 6,510 మంది కానిస్టేబుళ్లు, 2,759 మంది హోంగార్డులు ఎన్నికల లెక్కింపు సందర్భంగా బందోబస్తు విధుల్లో ఉంటారని చెప్పారు. కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా మొత్తం 25,224 మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని వెల్లడించారు. 

సాంకేతిక పరిజ్ఞానం వినియోగం  
కౌంటింగ్‌ సందర్భంగా బందోబస్తు నిర్వహించే పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటున్నట్టు డీజీపీ చెప్పారు. అన్ని హంగులతో ఉండే ఐదు ఫాల్కాన్స్‌ వాహనాలు, 14,770 సీసీ కెమెరాలు, 1,200 బాడీ వోర్న్‌ కెమెరాలు, 68 డ్రోన్స్, 9 వేల కమ్యూనికేషన్స్‌ పరికరాలు వినియోగిస్తున్నట్టు చెప్పారు. వాటిని రాష్ట్ర పోలీస్‌ ప్రధాన కార్యాలయం, జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయాలకు అనుసంధానం చేసి, కౌంటింగ్‌ సందర్బంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా తక్షణం స్పందించి చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.  

144, 30 సెక్షన్లు అమలు 
ఓట్ల లెక్కింపు కేంద్రాలతోపాటు రాష్ట్రంలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో సీఆర్‌పీసీ 144, పోలీస్‌ యాక్ట్‌ 30 సెక్షన్లు అమలు చేస్తున్నట్టు డీజీపీ ఠాకూర్‌ పేర్కొన్నారు. సెక్షన్‌ 144 అమల్లో ఉన్నందున కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎక్కువ మంది గుమిగూడటం, సమావేశాలు నిర్వహించడం నిషేధం. సెక్షన్‌ 30 అమలుతో కౌంటింగ్‌ కేంద్రాలు, ప్రధాన ప్రాంతాల్లో ఎక్కువ మంది సమావేశం కావడం, మైక్‌లు వాడటం నిషేధం. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీస్‌ ఫోర్స్‌తో ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు డీజీపీ చెప్పారు.  

ఇవి చెయ్యొద్దు... 
ఓట్ల లెక్కింపు సందర్భంగా ర్యాలీలపై నిషేధం అమలు చేస్తామని డీజీపీ తేల్చిచెప్పారు. పోలీసుల అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు జరపరాదన్నారు. కౌంటింగ్‌ కేంద్రాలకు 100 మీటర్ల వరకు ఎటువంటి వాహనాలు, జన సమీకరణలు ఉండకూడదని సూచించారు.    

ముందస్తు చర్యలు 
అనుమానిత వ్యక్తులు, అల్లర్లు సృష్టిస్తారనుకునే వారిని ముందు జాగ్రత్తగా బైండోవర్‌ చేసినట్టు డీజీపీ తెలిపారు. రౌడీషీటర్లు, అనుమానితులను కౌంటింగ్‌ రోజున పోలీస్‌ కస్టడీకి తీసుకుంటామన్నారు. అల్లర్లు సృష్టించే వారిపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు శాంతిభద్రతలను సమీక్షిస్తామన్నారు. రాష్ట్రంలో అల్లర్లు జరిగే అవకాశమున్న పట్టణాలు, గ్రామాలను గుర్తించి ముందుజాగ్రత్తగా ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. అన్ని రాజకీయ పార్టీల కౌంటింగ్‌ ఏజెంట్ల జాబితాలు తమకు వచ్చాయని, వాటిని పరిశీలించి వారిలో నేర చరిత్ర ఉన్న వారిని, వివాదాస్పదంగా ఉండే వారిని గుర్తిస్తామన్నారు. వారి స్థానంలో ఇతరులను నియమించుకోవాలని రాజకీయ పార్టీలకు సూచిస్తామన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement