సాక్షి, అమరావతి: టెన్షన్.. టెన్షన్.. టెన్షన్..41 రోజుల టెన్షన్‌కు నేటితో తెర పడనుంది. ఓటరు దేవుళ్ల తీర్పు వెల్లడికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠ మరికొద్ది గంటల్లోనే వీడనుంది. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను, తరువాత సర్వీసు ఓట్లను లెక్కిస్తారు. 8.30 గంటల నుంచి ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఎగ్జిట్ పోల్స్ ద్వారా ప్రజా తీర్పు ఎలా ఉండనుందో ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు వెలువడటం తెలిసిందే. ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి, లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించినా దేశవ్యాప్తంగా ఏడు విడతల ఎన్నికలు పూర్తి కావాల్సి ఉండటంతో ఫలితాల కోసం ఈ దఫా ఏకంగా 41 రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పోలింగ్‌కు, కౌంటింగ్‌కు మధ్య గతంలో ఎప్పుడూ ఇన్ని రోజుల వ్యవధి లేకపోవడంతో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
జగన్‌కే పట్టం గట్టిన ఎగ్జిట్ పోల్స్
ఆదివారం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కే జై కొట్టాయి. దీంతో గురువారం వెలువడే ఫలితాలు ఎలా ఉంటాయో అంతా ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. పోలింగ్‌కు ముందు, పోలింగ్ రోజుతో పాటు తరువాత నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెప్పాయి. లగడపాటి చిలక జోస్యాన్ని నమ్ముకున్న టీడీపీ ఊహలకు నేటి మధ్యాహ్నంతో తెరపడనుంది.
అసెంబ్లీ ఎన్నికల బరిలో 2,118 మంది
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల్లో 2,118 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. 25 ఎంపీ సీట్లకు 319 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. వైఎస్సార్ సీపీ ఎవరితోనూ పొత్తులు లేకుండా ఒంటరిగా అన్ని సీట్లకు పోటీ చేసింది. టీడీపీ లోపాయికారీ పొత్తులతో కాంగ్రెస్, జనసేనలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించింది.
చివరిలో వీవీ ప్యాట్ స్లిప్‌ల లెక్కింపు
నేడు మధ్యాహ్నం 12 గంటల కల్లా ఫలితాల సరళి వెల్లడి కానుండటంతో ఏ పార్టీ అధికారం దక్కించుకుంటుందో స్పష్టం కానుంది. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు పూర్తి అయినప్పటికీ ప్రతి నియోజకవర్గంలో ఐదు చొప్పున వీవీ ప్యాట్ స్లిప్‌లను కూడా చివరిలో లెక్కించనున్నారు. ఇందుకు కొంత సమయం పడుతుంది. దీంతో అధికారికంగా ఫలితాల ప్రకటనలో జాప్యం కానుంది. అయితే ఈవీఎంల ఓట్ల లెక్కింపు ముగియగానే విజేత ఎవరనేది దాదాపుగా తేలిపోనుంది.
నేడే ప్రజా తీర్పు
Published Thu, May 23 2019 3:50 AM | Last Updated on Thu, May 23 2019 5:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment