చాందీపూర్/కోల్‌కతా: ఓట్లను లెక్కించిన తర్వాతే ప్రజల తీర్పు తేటతెల్లమవుతుందని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్‌లో తొలి దశ ఎన్నికలు జరిగిన 30 స్థానాల్లో బీజేపీ 26 స్థానాలు గెలుచుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై ఆమె స్పందించారు. ఎన్నికలు జరిగిన తెల్లారే 26 సీట్లు గెలుస్తామంటూ ఎలా చెబుతారని ప్రశ్నించారు. మరి మిగిలిన 4 సీట్లు ఎవరికి వదిలేశారు? కాంగ్రెస్, సీపీఎంలకా? అని ఎద్దేవా చేశారు. మమతా బెనర్జీ ఆదివారం చాందీపూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలను తాను ఇప్పుడే ఊహించలేనని అన్నారు. ఓట్ల లెక్కింపు తర్వాతే తేలుతుందని స్పష్టం చేశారు.
అన్నిచోట్లా అభ్యర్థి నేనే
నియోజకవర్గంలో తృణమూల్ అభ్యర్థి ఎవరు అనేది పట్టించుకోవద్దని, అన్ని స్థానాల్లో స్వయంగా తానే పోటీ చేస్తున్నట్లు భావించాలని ఓటర్లను మమత కోరారు. ఎన్నికల సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని తృణమూల్ పోలింగ్ ఏజెంట్లకు సూచించారు. బెంగాల్‌లో మైనార్టీ ఓట్ల ను చీల్చడానికి హైదరాబాద్ నుంచి ఓ నాయకుడు వచ్చాడని పరోక్షంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై మండిపడ్డారు. ఢిల్లీ, గుజరాత్‌లో అల్లర్లు జరిగితే ఈ నేత ఎక్కడున్నాడో చెప్పాలన్నారు.
అలజడి సృష్టిస్తున్న మరో ఫోన్‌కాల్
పశ్చిమ బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రతిపక్ష బీజేపీ విడుదల చేసిన ఆడియో టేప్‌నకు ప్రతీకారం అన్నట్లుగా అధికార తృణమూల్ కాంగ్రెస్ కూడా వెంటనే ఓ ఫోన్‌కాల్ టేప్‌ను బహిర్గతం చేసింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, సీనియర్ నేత, పారిశ్రామికవేత్త శిశిర్ బజోరియా మాట్లాడుకున్నట్లు చెబుతున్న ఈ ఫోన్ కాల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బెంగాల్‌లో అన్ని చోట్లా బీజేపీకి పోలింగ్ ఏజెంట్లు లేరు, అందుకే స్థానికేతరులను ఏజెంట్లుగా నియమించేలా ఈసీని ఒప్పించాలని బజోరియాను ముకుల్ రాయ్ అదేశిస్తున్నట్లు ఈ టేప్‌లో రికార్డయ్యింది.
ఓట్లు లెక్కిస్తేనే ఫలితం తేలేది
Published Mon, Mar 29 2021 6:07 AM | Last Updated on Mon, Mar 29 2021 6:07 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment