‘పెద్ద’లెవరో?
మరికొన్ని గంటల్లో ‘పెద్ద’లెవరో తేలిపోనుంది. శాసనమండలిలో అడుగుపెట్టే ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం నేడు బయటపడనుంది. బుధవారం రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయంలోని కౌంటింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది. స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఆదివారం జరిగిన ఎన్నికల్లో 769 మంది ఓట్లు వేశారు. వీటిని ప్రాధాన్యక్రమంలో లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.
నేడు తేలనున్న ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం
* రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయంలో కౌంటింగ్
* ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
* బరిలో నిలిచింది ఐదుగురు.. గెలిచేది ఇద్దరే..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో విజేతలుగా నిలిచే ఇద్దరు ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది. టీఆర్‌ఎస్ తరుఫున పట్నం నరేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, కాంగ్రెస్ నుంచి డాక్టర్ ఏ.చంద్రశేఖర్, టీడీపీ తరుఫున బుక్కా వేణుగోపాల్, స్వతంత్ర అభ్యర్థిగా కొత్త అశోక్‌గౌడ్ పోటీపడ్డారు.
రెండు సీట్లనూ కైవసం చేసుకోవాలని అధికారపార్టీ, ఒక సీటయినా దక్కించుకొని పరువు కాపాడుకోవాలని జతకట్టిన కాంగ్రెస్, టీడీపీలు ప్రయత్నించాయి. ఇక స్థానిక సంస్థల ప్రతినిధుల ఆత్మగౌరవ నినాదంతో బరిలో దిగిన స్వతంత్ర అభ్యర్థి కూడా గెలుపుకోసం సర్వశక్తులొడ్డారు. ధనప్రవాహం, ప్యాకేజీలు, బెదిరింపులు, క్యాంపు రాజకీయాలతో హోరెత్తించిన శాసనమండలి ఎన్నికల్లో ప్రతి పార్టీ ఓటర్ల కొనుగోలుపైనే దృష్టి సారించాయి.
* రాజకీయాలకతీతంగా బేరసారాలు జరిపారు. అదేస్థాయిలో ఓటర్లు కూడా పార్టీలకతీతంగా ఫిరాయింపుల పర్వానికి తెరలేపారు.
* ఈ క్రమంలో ఓటర్ల నాడి అంతుబట్టడంలేదు. తొలి ప్రాధాన్య ఓట్లతోనే రెండు సీట్లను గెలుచుకునే దిశగా ఓటర్లను టీఆర్‌ఎస్ విభజించింది. ఇక కారు దూకుడుకు కళ్లెం వేయాలనే దృఢనిశ్చయంతో రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి ఒక్కటైన కాంగ్రెస్, టీడీపీలు
* శక్తివంచనలేకుండా కృషి చేశాయి.
* గులాబీ శిబిరంలో ఉన్న పాతమిత్రుల సహకారంతో గట్టెక్కుతామనే మిణుకుమిణుకుమనే ఆశ ఆ పార్టీల్లో కనిపిస్తోంది. ఇక ఎంపీటీసీల సంఘం తరుఫున బరిలో దిగిన అశోక్‌గౌడ్ ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టించారు. ఒంటిరిపోరు సాగించిన ఆయన ప్రతి ఓటరును కలిసి మద్దతు కూడగట్టారు. పార్టీలకతీతంగా పెద్దల సభలో స్థానిక సమస్యలపై గళం విప్పేందుకు తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఇలా ఎవరికివారు గెలుపుపై ధీమాతో ఉన్నారు.
11 గంటల లోపు తుది ఫలితం
ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. తొలి ప్రాధాన్య ఓట్లతోనే ఇద్దరు అభ్యర్థులు గట్టెక్కితే 11 లోపు తుది ఫలితం వెలువడుతోంది. ఒకవేళ తొలి ప్రాధాన్య ఓట్లలో అధిక్యత లభించని పక్షంలోనే ఫలితం ఆలస్యమయ్యే అవకాశముంది.