సాక్షి, ఖమ్మం: కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలు.., సత్తుపల్లి, మధిర నగర పంచాయతీల ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సుమారు నెలన్నరరోజులుగా ఎదురు చూస్తున్న ఫలితాలు సోమవారం తేలనుండడంతో బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. వరుసగా జరిగిన ఎన్నికలకు ఇదే తొలి ఫలితం కావడంతో అన్ని పార్టీలు వీటిపై అంచనాలు వేసుకున్నాయి.
మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు ముగి శాయి. కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి, మధిరలో మొత్తం 97 వార్డుల్లో 523 మంది తలపడ్డారు. నాలుగు చోట్ల 1,35,235 మంది ఓటర్లు తమ ఓటును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. పురపోలింగ్ ముగిసినప్పటి నుంచి కూడా తమకు వచ్చే వార్డులు, చైర్మన్ పీఠంపై పార్టీల నేతలు, అభ్యర్థులు లెక్కలు కడుతూనే ఉన్నారు.
ప్రధానంగా కొత్తగూడెం, ఇల్లెందులో ఎవరు చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటారోననే చర్చ జోరుగా సాగుతోంది. కొత్తగూడెంలో 33 వార్డులకు 190 మంది, ఇల్లెందులో 24 వార్డులకు 173 మంది అభ్యర్థులు బరిలో నిలవగా... ఇక్కడ గెలుపుపై అన్ని పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. గతంలో ఎప్పుడూ లేనట్లుగా పోలింగ్ జరిగిన చాలారోజుల తర్వాత ఫలితా లు వెలువడుతుండడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. కౌంటింగ్‌కు సంబంధించి ఇప్పటికే అందరు అభ్యర్థులు ఏజెంట్లను నియమించుకున్నారు. కౌంటింగ్ ప్రారంభించిన కొద్ది సమయంలోనే ఫలితాలు వెలువడనుండడంతో ఏ పార్టీ మెజారిటీ వార్డులు సాధించేది, చైర్మన్ పీఠం ఎవరిదీ కూడా తేలిపోనుంది.
లెక్కింపునకు 125మంది ప్రత్యేక సిబ్బంది
మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. వరుస ఎన్నికలు విజయవంతంగా నిర్వహించిన అధికార యంత్రాంగం తొలి ఫలితం వెల్లడించేందుకు సమాయత్తమైంది. ఈ ఓట్ల లెక్కింపునకు కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి, మధిరలో 125 మంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. కొత్తగూడెంలో ఆరుటేబుళ్లు, ఇల్లెందులో నాలుగు టేబుళ్లు, మధిరలో ఐదు, సత్తుపల్లిలో నాలుగు టేబుళ్లు ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ప్రతి చోట నాలుగు లేదా ఐదు రౌండ్లలో కౌంటింగ్ పూర్తి అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం అయిన రెండు,మూడు గంటల్లో ఎవరు విజేతలు, ఎవరు పరాజితులో బయట పడనుంది. విధులు కేటాయించిన సిబ్బంది ఆదివారం సాయంత్రమే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు.
మున్సి‘పల్స్’ తేలేది రేపే
Published Sun, May 11 2014 2:55 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement