
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘకాలంపాటు జరిగినందువల్ల రాష్ట్రంలోని పలుచోట్ల ఓ విచిత్ర పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం జరగనున్న ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఓ 23 మంది అభ్యర్థులు గెలిచినా ఆ స్థానాల్లో మళ్లీ ఎన్నిక జరగడం అనివార్యం. ఎందుకంటే.. ఆయాచోట్ల వారు మరణించడమే కారణం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసినా హైకోర్టు తీర్పు కారణంగా ఓట్ల లెక్కింపు ఐదున్నర నెలలపాటు నిలిచిపోయింది. ఈ కాలంలో పోలింగ్ జరిగిన పలు స్థానాల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో 23 మంది మరణించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు నిర్ధారించారు.
నేడు 'పరిషత్' ఫలితాలు
ఎంపీటీసీ స్థానాల్లో పోటీచేసిన వారు 20 మంది మరణించగా.. జెడ్పీటీసీ స్థానాలలో పోటీచేసిన అభ్యర్థులు ముగ్గురు మరణించారు. దీంతో.. ఈ స్థానాల్లో మరణించిన అభ్యర్థులు గెలుపొందితే ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలియజేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) కార్యాలయ వివరణ కోరుతూ ఆయా జిల్లాల అధికారులు లేఖ రాశారు. ఇందుకు కమిషన్ స్పందిస్తూ.. ఒకవేళ మృతిచెందిన అభ్యర్థులు విజయం సాధిస్తే ఆ ఫలితాన్ని వెల్లడించి, తిరిగి ఎన్నిక నిర్వహించాల్సిన స్థానాల జాబితాలో ఆ స్థానాలను చేర్చాలని అధికారులు స్పష్టంచేశారు. ఇక నామినేషన్ల ఘట్టానికి, పోలింగ్ ప్రక్రియ మధ్య కూడా ఏడాదిపాటు ఖాళీ ఏర్పడింది. ఈ సమయంలో మరణించిన వారి స్థానాల్లోనూ పోలింగ్‌ను నిలుపుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment