బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం. చిత్రంలో డీజీపీ ఠాకూర్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే నెల 23వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం అమరావతిలోని సచివాలయం నుంచి కౌంటింగ్ ఏర్పాట్లు, తాగునీరు తదితర అంశాలపై ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది, డీజీపీ ఠాకూర్‌తో కలిసి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వక పోవడం వల్ల అక్కడక్కడ ఈవీఎంలు సరిగా పని చేయలేదని ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. కౌంటింగ్ నిర్వహణలో అలాంటి ఫిర్యాదులకు ఎంతమాత్రం ఆస్కారం ఇవ్వొద్దని కలెక్టర్లకు సూచించారు.
ఓట్ల లెక్కింపునకు నెల రోజులు సమయం ఉన్నందున ఏర్పాట్లపై కలెక్టర్లు స్వయంగా పరిశీలించి అవపసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ మార్గ దర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు, కౌంటింగ్ టేబుళ్లు, సీటింగ్ సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. ముఖ్యంగా కౌంటింగ్ సిబ్బందికి పూర్తి స్థాయిలో మెరుగైన శిక్షణ ఇచ్చే విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే రహదారులపై, కౌంటింగ్ రోజున, ఆ తర్వాత అల్లర్లు జరగకుండా గట్టి బందోబస్తు కల్పించాలని ఎస్పీలను ఆదేశించారు. రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే ఉపేక్షించవద్దని, పార్టీలకతీతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు తమకున్న విస్తృత అధికారాలను ఉపయోగించుకోవచ్చని చెప్పారు.
మంచి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోండి
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పటికీ రాష్ట్రంలో తాగు నీరు, పశుగ్రాసం వంటి వాటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా కలెక్టర్లు వెంటనే స్పందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. నిధుల సమస్యలుంటే ఆర్థిక శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించాలని చెప్పారు. నీటి ఎద్దడి నుంచి ఉద్యాన పంటలను కాపాడటానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి సమస్యపై రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే తాను ఉన్నతాధికారులతో సమీక్షించానని, జిల్లా స్థాయిలో కూడా సమీక్షలు నిర్వహించి ఎక్కడా ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. జిల్లా స్థాయిలో జెడ్పీ సీఈఓ, పంచాయతీ, గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లు రోజువారీ పరిస్థితిని సమీక్షించి తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద నిరంతర నిఘా : ద్వివేది
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పని చేసి ఎన్నికలను సజావుగా నిర్వహించారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది కొనియాడారు. ఎన్నికల్లో 65 శాతం పైగా దివ్యాంగులు వారి ఓటు హక్కును వినియోగించుకోవడం, మారుమూల గిరిజన ప్రాంతాలు, మావోయిస్టు ప్రాంతాల్లో సైతం పోలింగ్ శాతం పెరగడం ఇందుకు నిదర్శనమన్నారు. స్ట్రాంగ్ రూమ్‌లను రోజూ ఎవరెవరు సందర్శిస్తున్నారనేది ఎప్పటికప్పుడు చిత్రీకరిస్తూ నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని చెప్పారు. వినియోగించని, రిజర్వుడు ఈవీఎంలను కూడా సక్రమంగా భద్ర పరిచామన్నారు. స్ట్రాంగ్ రూమ్‌లకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించేందుకు వీలుగా రాష్ట్ర, జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారుల ఫోన్ నంబర్లను అక్కడ ప్రదర్శించామని చెప్పారు.
మే మొదటి వారంలో కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇస్తామని చెప్పారు. సిబ్బందికి మూడు దశల్లో శిక్షణ ఉంటుందన్నారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం పరిధిలో మీడియా కేంద్రం ఉండేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. కౌంటింగ్‌లో పాల్గొనే ఏజెంట్లకు ఫొటో గుర్తింపు కార్డులు జారీ చేయాలని, లోపలికి మొబైల్ ఫోన్ల అనుమతి లేనుందున వాటిని బయట భద్రపర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఏ.ఆర్. అనురాధ, శాంతి భద్రతల అదనపు డీజి రవిశంకర్, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, అదనపు సీఈవో సుజాతా శర్మ, సంయుక్త సీఈవో డి.మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు.
అల్లర్లు తలెత్తకుండా చర్యలు : ఠాకూర్
తక్కువ పోలీస్ ఫోర్సు ఉన్నప్పటికీ 2014 ఎన్నికలతో పోలిస్తే స్వల్ప ఘటనలు మినహా ప్రస్తుత ఎన్నికలను సజావుగా నిర్వహించారని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆర్.పి.ఠాకూర్ అభినందించారు. పోలింగ్ అనంతరం ఘటనలకు బాధ్యులైన వారిని చాలా వరకు అరెస్టు చేశామని చెప్పారు. కౌంటింగ్ అనంతరం కూడా అలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీలను ఆదేశించారు. రీపోలింగ్ జరగనున్న కేంద్రాల్లో పటిష్ట భద్రత కల్పిస్తామన్నారు. స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment