లోక్‌సభ ఓట్ల లెక్కింపుపై ‘డబుల్‌’ ఉత్కంఠ | Telangana political parties are nervous about counting of Lok Sabha votes | Sakshi
Sakshi News home page

లోక్‌సభ ఓట్ల లెక్కింపుపై ‘డబుల్‌’ ఉత్కంఠ

Published Tue, Jun 4 2024 4:16 AM | Last Updated on Tue, Jun 4 2024 4:16 AM

Telangana political parties are nervous about counting of Lok Sabha votes

లోక్‌సభ ఓట్ల లెక్కింపుపై ప్రధాన రాజకీయ పక్షాల్లో ఉత్కంఠ 

పదికిపైగా స్థానాల్లో గెలుస్తామంటున్న కాంగ్రెస్‌ 

మోదీ హవాతో మంచి రిజల్ట్స్‌ ఉంటాయంటున్న కమలనాథులు 

డబుల్‌ డిజిట్‌లో సీట్లు తమకంటే తమకే అంటున్న ఇరు పార్టీలు 

కనీస స్థానాల్లో గెలుపు కోసం కారు పార్టీ ఎదురుచూపులు 

జాతీయ స్థాయిలో ఏం జరుగుతుందన్న దానిపైనా తెలంగాణలో ఉత్కంఠ

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ఫలితాల వేళ తెలంగాణలో ఉత్కంఠ నెలకొంది. పోలింగ్‌ జరిగిన 22 రోజుల తర్వాత జరుగుతున్న ఓట్ల లెక్కింపు కో సం రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలు ఎదురుచూస్తున్నాయి. పోలింగ్‌ సరళి, ఎగ్జిట్‌ పోల్స్‌ను బ ట్టి.. రాష్ట్రంలో పోటీ రెండు జాతీయ పార్టీల మధ్యే జరిగిందన్న అంచనాలు వెలువడ్డాయి. దీంతో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కూడా మెజార్టీ సీట్లు త మకంటే తమకేనని.. డబుల్‌ డిజిట్‌ స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 

కచ్చితంగా పది స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్‌.. పది కంటే ఎక్కువే గెలుస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ ఎన్ని స్థానాల్లో గెలుస్తామన్న దానిపై క చ్చితమైన లెక్కలు చెప్పకపోయినా.. కనీస స్థానా ల్లో విజయం దక్కుతుందని ఆశిస్తోంది. మరోవైపు జాతీయ స్థాయిలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోందన్న దానిపైనా రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. 

12 సీట్లు కూడా రావొచ్చంటున్న కాంగ్రెస్‌ 
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీదున్న కాంగ్రెస్‌ పార్టీ.. లోక్‌సభ ఎన్నికల్లోనూ సానుకూల ఫలితాలు వస్తాయనే అంచనాలో ఉంది. కనీసం తొమ్మిది, పది స్థానాల్లో గెలుస్తామన్న ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. పోలింగ్‌ సరళిని బట్టి చూస్తే మరో రెండు, మూడు సీట్లు కూడా గెలుస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌తోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పూర్తి పట్టు సాధించిన వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపు నల్లేరు మీద నడకేనని అంటున్నారు. 

సికింద్రాబాద్, ఆదిలాబాద్‌ స్థానాల్లోనూ విజయం సాధిస్తామని లెక్కలు వేస్తున్నారు. చేవెళ్ల, మల్కాజ్‌గిరి, జహీరాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదురైనా.. విజయ తీరం చేరుతామనే అంచనాలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ బలహీనపడటం, బీజేపీకి సంస్థాగత బలం లేకపోవడం, అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఎన్నికలు రావడంతో పెద్దగా ప్రజా వ్యతిరేకత లేకపోవడం, గ్రామీణ స్థాయిలో పార్టీకి ఉన్న పట్టు వంటివి అనుకూలిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

మోదీ మేజిక్‌తో బీజేపీదే హవా అంటున్న కమలనాథులు 
మోదీ మేజిక్‌తో తెలంగాణలోనూ బీజేపీ హవా కొనసాగుతుందని ఆ పార్టీ ముఖ్య నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ సీట్లు గెలిచి సత్తా చాటుతామని అంటున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌లో వెలువడిన అంచనాలను మించి సీట్లు సాధిస్తామని చెబుతున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన నాలుగు ఎంపీ సీట్లకు అదనంగా మరో ఆరేడు సీట్లు గెలుస్తామని అంటున్నారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలే ప్రభావం చూపాయని కమలనాథులు చెబుతున్నారు. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వం ఏర్పడుతుందనే అంచనాలు తమకు ఉపకరించాయని.. ఈ ఎఫెక్ట్‌తో పలు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయని అంచనా వేస్తున్నారు. 

ఎగ్జాక్ట్‌ పోల్స్‌ తమకే అనుకూలమంటూ బీఆర్‌ఎస్‌ 
లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌తో సంబంధం లేకుండా ఎగ్జాక్ట్‌ పోల్స్‌ ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని బీఆర్‌ఎస్‌ అంటోంది. బీఆర్‌ఎస్‌ ఒకట్రెండు స్థానాలకు మించి గెలిచే అవకాశం లేదని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నా.. బీఆర్‌ఎస్‌ మాత్రం అంతకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎనిమిది లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో బీఆర్‌ఎస్‌ ఆధిక్యత కనబర్చిందని.. అదే తరహాలో ఇప్పుడు ఫలితాలు ఉంటాయని అంచనా వేసుకుంటోంది. 

అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఇప్పుడు కాంగ్రెస్‌ అనుకూల ఓటింగ్‌ జరగలేదని.. అదే సమయంలో బీజేపీ భారీగా ఏమీ పుంజుకోలేదని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌తో పోలిస్తే కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుకే ఎక్కువగా గండి పడిందని పేర్కొంటున్నారు. అంతేగాకుండా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ 17 రోజుల పాటు చేసిన బస్సుయాత్ర కూడా ప్రభావం చూపిందని.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓటేసినవారిలో కొంత మేర తిరిగి అనుకూలంగా మారారని చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీతో జరిగిన ముక్కోణపు పోటీ బీఆర్‌ఎస్‌కు అక్కడక్కడా అనుకూలిస్తుందనే అంచనా వేస్తున్నారు.

ఢిల్లీ పీఠం ఎవరిదో..?
లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ స్థాయి ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఈసారి కూడా మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొనడం ఓవైపు.. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫెయిలవుతాయని, ఇండియా కూటమి గెలుస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన కామెంట్స్‌ మరోవైపు ఉత్కంఠ రేపుతున్నాయి. 

దేశవ్యాప్తంగా మోదీ ప్రభావం ఎలా ఉంటుంది?ఇండియా కూటమికి ఉన్న సానుకూలతలేంటి? ఏ రాష్ట్రంలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంశాలపై చర్చ జరుగుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపైనా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఎడతెగని చర్చ నడుస్తోంది.

ఆ స్థానాలపై మరింత ఆసక్తి
తెలంగాణలోని నాలుగైదు నియోజకవర్గాల్లో ఫలితం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ నేత, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌ తరఫున ఎంపీ అభ్యరి్థగా బరిలోకి దిగిన దానం నాగేందర్‌ తలపడుతున్న సికింద్రాబాద్‌ ఫలితంపై అందరి ఫోకస్‌ ఉంది. పీసీసీ చీఫ్, సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్‌గిరి.. ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి అయ్యే చాన్స్‌ ఉందంటున్న బండి సంజయ్‌ బరిలో ఉన్న కరీంనగర్‌.. బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరిన నేతలు పోటీ చేస్తున్న జహీరాబాద్, నాగర్‌కర్నూల్, వరంగల్‌ తదితర స్థానాల్లో ఫలితాలపైనా ఆసక్తి ఉంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement