Chittoor: ఫ్యాన్‌కే పట్టం.. కుప్పంలోనూ బాబుకు మొండిచేయి | AP Local Body Election Results 2021: Chittoor | Sakshi
Sakshi News home page

Chittoor: ఫ్యాన్‌కే పట్టం.. కుప్పంలోనూ బాబుకు మొండిచేయి

Published Sun, Sep 19 2021 12:23 PM | Last Updated on Mon, Sep 20 2021 7:57 AM

AP Local Body Election Results 2021: Chittoor - Sakshi

పల్లె ప్రజలు పరిషత్‌ పోరులోనూ ఏకపక్షంగా తీర్చునిచ్చారు.  పంచాయతీ ఎన్నికల ఫలితాలనే పునరావృతం చేశారు. సంక్షేమ పాలనకే పట్టం కట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉంటామని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. టీడీపీని మట్టికరిపించారు. చంద్రబాబు కుతంత్రాలను ఓటుతో తిప్పికొట్టారు. కుప్పంలోనూ కర్రు కాల్చి వాత పెట్టారు. చివరకు నారావారిపల్లెవాసులు సైతం ‘నిన్ను నమ్మం బాబూ’ అని తేల్చేశారు.  

సాక్షి, తిరుపతి: జిల్లావ్యాప్తంగా ఆదివారం వెల్లడైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ జయకేతనం ఎగురవేసింది. సొంత ఇలాకాలోనే చంద్రబాబుకు మరోసారి ఘోరపరాభవం ఎదురైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనకు సంపూర్ణ మద్దతు లభించింది. ఫ్యాను ప్రభంజనానికి సైకిల్‌ కొట్టుకుపోయింది. జిల్లాలోని అన్ని జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. ఎంపీటీసీ స్థానాలను సైతం దాదాపు స్వీప్‌ చేసేసింది. 

దిమ్మ తిరిగే తీర్పు 
ఘనత వహించిన చంద్రబాబుకు ప్రజలకు చుక్కలు చూపించారు. సొంతూరు నారావారిపల్లె నుంచి ఏళ్ల తరబడి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం వరకు దిమ్మ తిరిగే తీర్పునిచ్చారు. బాబు కోటగా భావించే కుప్పంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు భారీ ఆధిక్యంతో తిరుగులేని విజయం సాధించారు. కుప్పం నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన 4 జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే గెలుపొందారు. 63 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే 63 స్థానాల్లోని ఓటర్లు ఫ్యాను గుర్తు వైపే మొగ్గుచూపారు. టీడీపీని కేవలం 3 స్థానాలకే పరిమితం చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లె ప్రజలు సైతం చంద్రబాబును తిరస్కరించారు. చిన్న రామాపురం ఎంపీటీసీగా వైఎస్సార్‌సీపీ అభ్యరి్థకి ఓటేసి అత్యధిక మెజారిటీ కట్టబెట్టారు.  

మాజీ మంత్రికి షాక్‌ 
మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డికి పలమనేరు నియోజకవర్గ ప్రజలు షాక్‌ ఇచ్చారు. ఇక్కడి ఐదు జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీనే గెలిపించారు. ముఖ్యంగా వి.కోట జెడ్పీటీసీ స్థానంలో ఫ్యాను గుర్తుకు 27,713 ఓట్ల ఆధిక్యతను అందించారు. మొత్తం 83 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే 81 స్థానాలను వైఎస్సార్‌సీపీకి అందించారు. టీడీపీని కేవలం 2 స్థానాలకే పరిమితం చేశారు.  

నల్లారికి నగుబాటు 
పీలేరు నియోజకవర్గంలో నల్లారి వారికి నగుబాటు తప్పలేదు. ఇక్కడి ఐదు జెడ్పీటీసీలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 67 ఎంపీటీసీ స్థానాలకు గాను ఫ్యాను 60 గెలుచుకుంటే, సైకిల్‌ 7 స్థానాలతో సరిపెట్టుకుంది.  నగరి నియోజక వర్గంలో మొత్తం 5 జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 40 ఎంపీటీసీ స్థానాలకు గాను 37చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారు. గంగాధరనెల్లూరు, పూతలపట్టు, చిత్తూరు నియోజక వర్గాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల హవా కొనసాగింది. మదనపల్లి నియోజక వర్గంలోని 3 జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. 50 ఎంపీటీసీ స్థానాలకు గాను 49 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు.  

ప్రశాంతంగా కౌంటింగ్‌ 
చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసిందని ఇంచార్జి కలెక్టర్‌ రాజాబాబు తెలిపారు. కౌంటింగ్‌ అనంతరం కలెక్టరేట్‌లో ఆయన అధికారులతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. జెడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మండల, జిల్లా పరిషత్‌ అధ్యక్షుల ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ చేశామని వెల్లడించారు. 24వ తేదీన ఎంపీపీ, 25వ తేదీన జెడ్పీ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో జేసీ (సంక్షేమం) రాజశేఖర్, జిల్లా పంచాయతీ అధికారి దశరథరామిరెడ్డి పాల్గొన్నారు.

చదవండి: పంచాయతీ, మునిసిపల్‌ను మించి జైత్ర యాత్ర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement