కౌంటింగ్‌ ఏజెంట్లే కీలకం | Counting agents are key for General Election Vote Counting Process | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌ ఏజెంట్లే కీలకం

Published Sun, May 26 2024 5:45 AM | Last Updated on Sun, May 26 2024 5:45 AM

Counting agents are key for General Election Vote Counting Process

ఫారం–18 సమర్పించడం ద్వారా ఏజెంట్ల నియామకం

ఓట్ల లెక్కింపులో ఫారం–17సీ ఎంతో ముఖ్యం

నిబంధనలు తెలియకుంటే అయోమయమే

సత్తెనపల్లి: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్‌ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఎన్నికల నిబంధనలు–1961 ప్రకారం అభ్యర్థి లేదా ఎలక్షన్‌ ఏజెంట్‌ ఆమోదంతో కౌంటింగ్‌ ఏజెంట్లను నియమిస్తారు. కౌంటింగ్‌ సమయంలో అభ్యర్థి తరఫున ప్రతినిధిగా వ్యవహరించే కౌంటింగ్‌ ఏజెంట్ల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కౌంటింగ్‌కు మూడు రోజుల ముందు సాయంత్రం 5గంటల్లోపు కౌంటింగ్‌ ఏజెంట్ల నియామ­కానికి సంబంధించిన ఫారం–18ను సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాలి. ఆర్వోలు కౌంటింగ్‌ ఏజెంట్లకు ఐడీ కార్డులు తయారు చేసి పంపుతారు. కౌంటింగ్‌కు గంట ముందు అపాయింట్‌మెంట్‌ లెటర్, ఐడీ కార్డ్‌ ఆర్వోలకు సమర్పించాల్సి ఉంటుంది. ఫారం–19 ద్వారా కౌంటింగ్‌ ఏజెంట్‌ అపాయింట్‌మెంట్‌ను రద్దు చేసే అధికారం అభ్యర్థి లేదా ఎలక్షన్‌ ఏజెంట్‌కు ఉంటుంది. 

ఏజెంట్లకు అవగాహన అవసరం 
సార్వత్రిక ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో ఫారం–17సీ పార్ట్‌–2 ఎంతో కీలకమైంది. ప్రతి కౌంటింగ్‌ ఏజెంట్, పరిశీలకులు, సహాయ పరిశీలకులు దీనిపై అవగాహన కలిగి ఉండాలి. కంట్రోల్‌ యూనిట్‌లో నమోదైన మొత్తం ఓట్లు, ఫారం–17సీలో పొందుపరిచిన మొత్తం ఓట్లు సరిపోల్చి చూడాలి. పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజక­వర్గం నంబర్, పోలింగ్‌ కేంద్రం పేరు, ఆ పోలింగ్‌ కేంద్రంలో వినియోగించిన కంట్రోల్‌ యూనిట్, బ్యాలెట్‌ యూనిట్ల గుర్తింపు నంబర్లను ఆ ఫారంలోనే నమోదు చేస్తారు. 

ఆ పోలింగ్‌ కేంద్రం పరిధిలోని ఓటర్ల సంఖ్య, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల సంఖ్య, పోలింగ్‌ కేంద్రంలోకి వచ్చాక ఓటు వేయడానికి నిరాకరించి వెళ్లిపోయిన వారు, ఓటింగ్‌ యంత్రంలో నమోదైన మొత్తం ఓట్ల సంఖ్య ఫారం–17సీలో ఉంటాయి. టెండర్‌ బ్యాలెట్లు, సరఫరా చేసిన పేపర్‌ సీళ్లు (ఓటరుకు పోలింగ్‌ కేంద్రంలో ఇచ్చే రెండు రంగుల స్లిప్‌లు), సీరియల్‌ నంబర్లు, ఎన్ని పేపర్లు వినియోగించారు, వినియోగించని పేపర్‌ సీళ్లు ఎన్ని తిరిగి రిటర్నింగ్‌ అధికారికి వెళ్లాయి, పాడైపోయిన పేపర్‌ సీళ్లు, సీరియల్‌ నంబర్ల వంటి వివరాలు ఇందులో ఉంటాయి.

ట్యాంపరింగ్‌ జరిగితే..
కంట్రోల్‌ యూనిట్‌ టేబుల్‌పైకి రాగానే అభ్యర్థి సీలింగ్‌ సెక్షన్‌ సక్రమంగా ఉందో లేదో కౌంటింగ్‌ ఏజెంట్లు, పరిశీలకులు చూసుకోవాలి. రిజల్ట్‌ సెక్షన్‌పై స్ట్రిప్‌ సీల్, గ్రీన్‌ పేపర్‌ సీల్‌ సక్రమంగా ఉన్నాయో లేదో చూడాలి. సీరియల్‌ నంబర్లు ఫారం–17సీలో నమోదు చేసినవే ఉండాలి. కంట్రోల్‌ యూనిట్‌ పేపర్‌ సీళ్లు, అడ్రస్‌ ట్యాగ్‌ల ట్యాంపరింగ్‌ జరిగాయని గుర్తిస్తే పరిశీలకులు ఆ విషయాన్ని రిటర్నింగ్‌ అధికారి, అబ్జర్వర్ల దృష్టికి తీసుకెళ్లాలి. ట్యాంపరింగ్‌ జరగని కంట్రోల్‌ యూనిట్లను మాత్రమే లెక్కించాలి.

మార్గదర్శకాలు ఇవీ..
అభ్యర్థులు 18 సంవత్సరాలు నిండిన వారిని ఏజెంట్లుగా నియమించుకుంటే వారు కౌంటింగ్‌ సక్రమంగా వీక్షించేందుకు వీలుంటుంది. సాయుధ రక్షణ కలిగిన వ్యక్తులను కౌంటింగ్‌ హాల్‌లోకి అనుమతించరాదని ఈసీఐ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, మునిసిపల్, జెడ్పీ చైర్మన్లు, పబ్లిక్‌రంగ సంస్థలు, కార్పొరేషన్ల చైర్మన్లు కూడా ఏజెంట్లుగా కూర్చునేందుకు అనర్హులు. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందేవారు, ప్రభుత్వ–ఎయిడెడ్‌ సంస్థల్లో పనిచేసే పార్ట్‌ టైమ్‌ ఉద్యోగులు, పారామెడికల్‌ స్టాఫ్, రేషన్‌ డీలర్లు, అంగన్‌వాడీ ఉద్యోగులు పోలింగ్‌ ఏజెంట్లుగా ఉండకూడదు. 

ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఏజెంట్లుగా వ్యవహరిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 సెక్షన్‌ 134 (ఏ) ప్రకారం శిక్షార్హులవుతారు. వీరికి మూడు నెలల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉంది. సర్పంచ్‌లు, పంచాయతీ వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కౌంటింగ్‌ ఏజెంట్లుగా కూర్చునేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. భారత పౌరసత్వం కలిగిన ఎన్నారైలు కూడా కూర్చోవచ్చు. ప్రభుత్వ గన్‌మెన్‌ సౌకర్యం ఉన్నవారు ఎన్నికల ఏజెంట్‌గా, కౌంటింగ్‌ ఏజెంట్‌గా ఉండకూడదు. అలాంటి వ్యక్తి సెక్యూరిటీతో గాని, సెక్యూరిటీ లేకుండా గానీ కౌంటింగ్‌ హాల్‌లోకి ప్రవేశించకూడదు. 

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి తనకున్న సాయుధ రక్షణను స్వచ్ఛందంగా వదులుకుంటే కౌంటింగ్‌ హాల్‌లో కూర్చునేందుకు అనుమతి­స్తారు. ఒక కౌంటింగ్‌ హాల్‌లో 14 టేబుళ్లు, ఒక ఆర్వో టేబుల్‌ కలిపి మొత్తం 15 టేబుళ్లు ఉంటాయి. ఆ మేరకు అభ్యర్థులు తమ ఏజెంట్లను నియమించుకోవచ్చు. పోస్టల్‌ బ్యాలెట్లు, ఎలక్ట్రాని­కల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ సిస్టమ్‌ (ఈటీ పీబీఎస్‌) లెక్కింపునకు అదనపు టేబుళ్లు అవసరం అని భావిస్తే అందుకోసం వేరే కౌంటింగ్‌ హాల్‌లో అదనపు టేబుళ్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అప్పుడు అభ్యర్థులు అక్కడ అదనంగా మరో 
కౌంటింగ్‌ ఏజెంట్‌ను నియమించుకోవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement