ప్రజాస్వామ్యంలో చీకటి ఎన్నికలు
ఈసీ, కేంద్ర ప్రభుత్వ పాత్రలపై అనుమానం
సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని విచారణకు ఆదేశాలివ్వాలి
రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు ఆనందప్రకాష్
పాలకొల్లు అర్బన్: రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని, బూటకపు ఎన్నికలు జరిగాయని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లెం ఆనందప్రకాష్ చెప్పారు. వీటిని చీకట్లో జరిగిన ఎన్నికలుగా పరిగణించాలన్నారు. ఎన్నికల కమిషన్‌పై న్యాయసమీక్ష జరపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నికల కమిషన్ కుట్ర చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. తక్షణం ఎన్నికలను రీకాల్ చేసి తిరిగి బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
ఆయన మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం యాళ్లవానిగరువులో విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తక్షణం జోక్యం చేసుకుని ఈవీఎంలపై విచారణ చేపట్టాలని కోరారు. ఓటమి భయంతో కూటమి కట్టిన టీడీపీ అభ్యర్థులకు వేల మెజార్టీ రావడం, బీజేపీ పోటీచేసిన రెండుచోట్ల లక్షల్లో మెజార్టీ రావడం, జనసేన పోటీచేసిన 21 స్థానాల్లోను విజయం సాధించడం వెనుక కచ్చితంగా కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి చెందుతుందని ముందే పసిగట్టిన కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల్లో వారికి కలిసి వచ్చిన పార్టీలకు అనుకూలంగా వ్యవహరించినట్లు అర్థమవుతోందన్నారు.
ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉన్నారని, ఇదే విషయాన్ని మెజార్టీ సర్వేసంస్థలు వెల్లడించాయని చెప్పారు. సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలందరికీ మేలు చేశారన్నారు. లక్షలాదిమంది ఓటర్లున్న వైఎస్సార్‌సీపీకి కేవలం ప్రతిపక్ష హోదాకు తక్కువగా అసెంబ్లీ సీట్లు దక్కడం వెనుక భారీ కుట్ర జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ముందు నుంచి వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా పనిచేసిందన్నారు. తనపై కేసు నమోదు చేసిందన్నారు. తాను ప్రచారంలో పాల్గొనలేదని ఆధారాలతో సహా వివరణ ఇచ్చినా పట్టించుకోలేదని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment