
సింహపురిలో వైఎస్సార్‌సీపీ మరో ప్రభంజనం సృష్టించింది. సార్వత్రిక ఎన్నికల నుంచి పరిషత్ ఎన్నికల వరకు ప్రజలు వైఎస్సార్‌సీపీకే జై కొట్టారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. ఆదివారం వెలువడిన పరిషత్ ఎన్నికల ఫలితాలతో టీడీపీ కంచుకోటలు బద్ధలయ్యాయి. జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కీŠల్‌న్ స్వీప్ చేయగా, ఎంపీటీసీ స్థానాల్లో 90 శాతం సీట్లను వైఎస్సార్‌సీపీ దక్కించుకుంటే.. టీడీపీ 6.13 శాతానికి పరిమితమైంది. స్థానిక ఒప్పందాల నేపథ్యంలో స్వతంత్రులు, సీపీఎం, బీజేపీ, జనసేన అభ్యర్థులు 21 స్థానాల్లో స్వల్ప మెజార్టీలతో బయటపడ్డారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలో అన్ని మండల పరిషత్‌లతో పాటు జిల్లా పరిషత్‌ను సొంతం చేసుకోనుంది. 46 జెడ్పీటీసీ స్థానాలు, 495 మంది ఎంపీటీసీ స్థానాలు అధికార పార్టీ కైవశం చేసుకుంది. టీడీపీ జాతీయ స్థాయి నాయకుడిగా భావించే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇలాఖాలో సైతం ఘోర పరాభవం తప్పలేదు. మాజీ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో కూడా ప్రజలు టీడీపీ అభ్యర్థులను తిరస్కరించారు. జిల్లా ప్రజానీకం వైఎస్సార్‌సీపీ పక్షమేనని నిరూపించారు. ఎన్నికలు ఏవైనా సరే, ఎప్పుడైనా సరే తామంతా వైఎస్సార్‌సీపీ వెంటనేనని మరోసారి రుజువు చేశారు.
2019 సాధారణ ఎన్నికల్లో ఏకపక్షంగా ఫలితాలు కట్టబెట్టిన జిల్లా ప్రజలు దాదాపు 20 నెలల పాలన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీకి జైకొట్టారు. గ్రామీణులకు అందుతోన్న సంక్షేమ పథకాలే స్థానిక సంస్థల తీర్పులో ప్రతిబింబించింది. మాజీ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో, ఇప్పటి వరకూ టీడీపీ మినహా మరే పార్టీ గెలుపొందని గ్రామాల్లో సైతం వైఎస్సార్‌సీపీ జయకేతనం ఎగరవేసింది. జిల్లాలో 554 ఎంపీటీసీ స్థానాల్లో 4 స్థానాలకు ఎన్నికలు నిలిచిపోయాయి. గంగవరం, వెంగమాంబపురం, అనంతమడుగు, కోట–2 ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు మృతి కారణంగా నిలిచిపోయాయి. 550 స్థానాలకు 495 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం చేజిక్కించుకున్నారు.
కేవలం 34 స్థానాలకే మాత్రమే టీడీపీ పరిమితమైంది. సీపీఎం 5 , బీజేపీ 2 స్థానాలతో సరిపెట్టుకొగా, కేవలం ఒక్క ఎంపీటీసీ స్థానాన్ని జనసేన దక్కించుకుంది. 13 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. జిల్లాలోని 46 జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. ఏకగ్రీవంగా ఎన్నికైన ఇద్దరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పొట్లూరి సుబ్బమ్మ (జలదంకి–2), కల్లూరు జయరామయ్య (శిరసనంబేడు) మృతి చెందారు. ఈ స్థానాలతో పాటు నిలిచిపోయిన స్థానాలకు ఎన్నికలు అనివార్యం కానున్నాయి.
ఆనం ఇంట మహిళ నేత ఆరంగ్రేటం
జిల్లాలో ఆనం కుటుంబానికి 8 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉంది. ఇప్పటి వరకు ఆనం ఇంటి మహిళా నేతలు ఎవరూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆనం విజయకుమార్‌రెడ్డి సతీమణి అరుణమ్మ రాజకీయ ఆరంగ్రేటం చేశారు. నెల్లూరు రూరల్ జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లో ఆనం ఇంటి నుంచి మహిళ నేత అరుణమ్మ ప్రజాసేవలో నిమగ్నం కానున్నారు. జిల్లా వ్యాప్తంగా 23 మంది మహిళా నేతలు జెడ్పీటీసీలుగా ఎన్నికయ్యారు. మరో 270 మంది ఎంపీటీసీలుగా మహిళలను ఎన్నుకున్నారు. వారిలో 23 మంది ఎంపీపీలు కానున్నారు. ఈ నెల 24న ఎంపీపీ, 25న జెడ్పీ చైర్మన్‌ను ఎన్నుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ మేరకు ఎంతో కాలంగా నిరీక్షిస్తూ వచ్చిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పదవీయోగం దక్కనుంది.
గణనీయంగా పెరిగిన ప్రజామద్దతు
సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు లభించిన మెజార్టీ కంటే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో లభించిన గణనీయంగా పెరిగింది. కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి 14,117 ఓట్ల మెజార్టీతో విజయం దక్కించుకుంటే.. అదే స్థానిక సంస్థల ఫలితాల్లో అల్లూరు జెడ్పీటీసీ ఏకగ్రీవం కాగా, తక్కిన మూడు మండలాల్లో జెడ్పీటీసీ అభ్యర్థులకు 33,321 మెజార్టీ లభించింది. సర్వేపల్లె ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి 13,973 ఓట్లు మెజార్టీ దక్కగా, ఈ నియోజకవర్గంలోని జెడ్పీటీసీ అభ్యర్థులందరి మెజార్టీలు పరిశీలిస్తే 58,345 ఓట్లు అధికంగా దక్కించుకున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి 38,720 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అక్కడ రాపూరు మండలం ఏకగ్రీవం కాగా, తక్కిన ఐదు మండలాల్లో జెడ్పీటీసీ అభ్యర్థుల మెజార్టీ 48,884 ఉండడం విశేషం. ఇలా ప్రతి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ పట్ల ప్రజామద్దతు గణనీయంగా పెరిగింది.
మాజీ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో టీడీపీకి తిరస్కరణ
టీడీపీ మాజీ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లోనూ పరాభవం తప్పలేదు. వెంటకగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్వగ్రామం కమ్మవారిపల్లె పంచాయతీలోని లింగసముద్రం ఎంపీటీసీ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నావూరు కోటేశ్వరరావు 1,011 ఓట్లతో ఘన విజయం సాధించారు. అక్కడ టీడీపీ కంటే బీజేపీకి 4 ఓట్లు అధికంగా రావడంతో టీడీపీ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు సొంతూరు పెద్దకొండూరులో టీడీపీ మట్టి కరిచింది. 1,025 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇండ్ల చెంచమ్మ గెలుపొందింది. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య స్వగ్రామంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ రమాదేవి విజయం దక్కించుకుంది.
టీడీపీ జాతీయ స్థాయి నేతగా ప్రకటించుకునే మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గం సర్వేపల్లెలో టీడీపీ కేవలం 2 ఎంపీటీసీ స్థానాలకు పరిమితమైంది. సోమిరెడ్డి నివాసం ఉంటున్న అల్లీపురం ఎంపీటీసీ సైతం వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి స్వగ్రామం నార్త్‌రాజుపాళెం రెండు ఎంపీటీసీలను వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర స్వగ్రామం ఇసకపల్లిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొండూరు వాసు 1,079 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం స్వగ్రామం భీమవరంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నెలవల మమత విజయం దక్కించుంది. టీడీపీ కంచుకోటలుగా ఉండే స్థానాల్లో ఘోర ఓటమి చవిచూడాల్సిన అనుభవం ఆ పార్టీకి ఎదురయింది. దీనికి ప్రధాన కారణంగా పార్టీలు, వర్గాలతో నిమిత్తం లేకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందుతుండడమేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment