మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు దగ్గర పడుతుండటంతో తాండూరులో రాజకీయాలు జోరందుకుంటున్నాయి.
తాండూరు, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు దగ్గర పడుతుండటంతో తాండూరులో రాజకీయాలు జోరందుకుంటున్నాయి. తాండూరు మున్సిపాలిటీలోని 31 వార్డుల ఓట్ల కౌంటింగ్, కౌన్సిలర్లుగా ఎన్నికైన వారిని సోమవారం ప్రకటించనున్నారు. అయితే చైర్‌పర్సన్ ఎన్నిక మాత్రం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాతే జరుగుతుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పదవిపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఈ పదవి చేజిక్కించుకోవాలంటే 16వార్డుల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. అయితే మెజార్టీ స్థానాలు రావని అంచనాకొచ్చిన ప్రధాన పార్టీల నాయకత్వాలు ఎలాగైనా మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
ఇందులో భాగంగా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల్లో కౌన్సిలర్లుగా గెలిచే అవకాశం ఉన్న వారికి ప్రధాన పార్టీల నాయకులు గాలం వేస్తున్నారు. చైర్‌పర్సన్ ఎన్నికలో తమకు మద్దతు ఇవ్వాలని సదరు అభ్యర్థులతో మంతనాలు జరుపుతున్నారు. తమ పార్టీ అభ్యర్థి చైర్‌పర్సన్‌గా ఎన్నికైతే నగదు నజరానాలు, అభివృద్ధి పనుల కాంట్రాక్టులు ఇప్పిస్తామని ఆఫర్లు ఎరవేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే మరోవైపు సొంత పార్టీ అభ్యర్థులు గెలిచిన తర్వాత జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సార్వత్రిక ఎన్నికల ఓట్ల కౌంటింగ్, ఫలితాలు వెల్లడయ్యే వరకూ చైర్‌పర్సన్ ఎన్నిక జరిగే అవకాశం లేనందున క్యాంపు రాజకీయాలకు వ్యూహరచన చేస్తున్నారు. కౌన్సిలర్లుగా గెలిచిన తమ వారిని, చైర్‌పర్సన్ ఎన్నికలో తమకు మద్దతు ఇచ్చేవారిని రహస్య ప్రాంతాలకు తరలించాలన్నది వారి వ్యూహంగా తెలుస్తోంది. బెంగళూరు, ముంబై తదితర నగరాలకు అభ్యర్థులను తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఏసీ బస్సులను సైతం సిద్ధం చేసినట్టు సమాచారం.