తాండూరులో నీకు నాకు సగం సగం
రంగారెడ్డి జిల్లా తాండూరులో మునిసిపల్ ఛైర్మన్ ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠ వీడిపోయింది. ఇక్కడ టీఆర్ఎస్, ఎంఐఎం ఇద్దరికీ గట్టిగా బలం ఉండటంతో ఎవరు ఛైర్మన్ కావాలన్న విషయమై తొలుత ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు రెండు వర్గాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. మొత్తం పదవీ కాలం ఐదేళ్లు కావడంతో.. చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి.
ఇందులో భాగంగా మొదటి రెండున్నరేళ్లు టీఆర్‌ఎస్‌కు, తరువాత ఎంఐఎంకు వెళ్తాయి. టీఆర్‌ఎస్ కౌన్సిలర్లతో జరిపిన చర్చల్లో చైర్‌పర్సన్ అభ్యర్థిగా 28వ వార్డు నుంచి గెలిచిన కౌన్సిలర్ కోట్రిక విజయలక్ష్మి పేరు మంత్రి మహేందర్‌రెడ్డి ప్రకటించారు. అయితే, ఆమె పేరుపై పార్టీ నాయకులు పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 9వ వార్డు కౌన్సిలర్ నీరజకు చైర్‌పర్సన్‌గా అవకాశం ఇవ్వాలని 8 మంది కౌన్సిలర్లు పట్టుబట్టారు. రాత్రి వరకు చర్చలు జరిగినా.. ఫలితం లేకపోవడంతో నీరజకు మద్దతిస్తున్న కౌన్సిలర్లు అలిగి మంత్రి నివాసం నుంచి వెళ్లిపోయారు. వాళ్లు ఏం చేస్తారన్నది మాత్రం ఇప్పటికీ ఉత్కంఠగానే ఉంది.
అంతకుముందు ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు హాదీ, ఇతర నాయకులు, కౌన్సిలర్లతో కూడా మంత్రి చర్చలు జరిపారు. చేరో రెండున్నరేళ్లు చైర్‌పర్సన్ పదవిని పంచుకోవడానికి ఇరుపార్టీలు అంగీకరించాయి.