తాండూరు, న్యూస్‌లైన్: తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. చైర్‌పర్సన్ పదవిపై కన్నెసిన ప్రధాన పార్టీలకు స్పష్టమైన మెజార్టీ లభించలేదు. దీంతో ఆయా పార్టీల నాయకత్వాలు డీలా పడ్డాయి. చైర్‌పర్సన్ కుర్సీని దక్కించుకోవడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా పార్టీలు రహస్య సమావేశాలకు తెరలేపారు. అనూహ్యంగా పది స్థానాలను కైవసం చేసుకున్న ఎంఐఎం ప్రస్తుతం నిర్ణయాత్మక శక్తిగా ఎదగడంతో మిగితా పార్టీలు డైలామాలో పడ్డాయి. టీఆర్‌ఎస్ పది, కాంగ్రెస్ ఎనిమిది స్థానాలు గెలుచుకున్నాయి.
అయితే ఈ మూడు పార్టీల్లో ఎవరు ఎవరితో జత కడతారన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈనేపథ్యంలో ఏం చేయాలి... ఎలా చైర్‌పర్సన్ పదవిని కైవసం చేసుకోవాలో అర్థం కాక ఆయా పార్టీల ముఖ్యనేతలు జుట్టుపీక్కుంటున్నారు. మధ్యవర్తుల ద్వారా ఆయా పార్టీలు మద్ధతు కూడగట్టుకునే యత్నాలకు పదును పెట్టారు. ఆయా పార్టీల రాష్ట్ర ముఖ్యనేతలతో కూడా స్థానిక నాయకులు చర్చలు మొదలుపెట్టారు. స్థానిక పరిస్థితులకనుగుణంగా టీఆర్‌ఎస్, ఎంఐఎంలు ఎన్నికల్లో పొత్తుతో ముందుకుసాగాయి. ఈక్రమంలో ఈ రెండు పార్టీలు సమానంగా స్థానాలను గెలుచుకున్నాయి. అయితే ప్రస్తుతానికి ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే విషయమై ఇంకా నిర్ణయించుకోలేదని ఎంఐఎం నేతలు స్పష్టం చేస్తున్నారు.
ఈనెల 16న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తమ అధిష్టానం మున్సిపల్ చైర్‌పర్సన్ ఎంపిక విషయంపై దృష్టి కేంద్రీకరించవచ్చని చెబుతున్నారు. దీంతో ఎంఐఎం తమకు మద్దతిస్తుందని భావించిన టీఆర్‌ఎస్ ఇప్పుడు సందిగ్ధంలో పడింది. మరోవైపు ఎంఐఎంకు చైర్‌పర్సన్ పదవి ఇచ్చేందుకు టీఆర్‌ఎస్ సిద్ధంగా లేదు. తమ పార్టీకి చెందిన చైర్‌పర్సన్ అభ్యర్థి విజయాదేవి ఓడిపోయినందున, ఎంఐఎం మద్దతుతో చైర్‌పర్సన్‌పదవిని దక్కించుకోవాలని టీఆర్‌ఎస్ ఎత్తుగడగా కనిపిస్తున్నది. ఈ విషయంలో ఎంఐఎం నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు.
ఒక వేళ ఎంఐఎం మద్దతివ్వని పక్షంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటు అనంతరం ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు, ఇతర పార్టీల కౌన్సెలర్ల మద్దతుతో కావాల్సిన సంఖ్యాబలాన్ని దక్కించుకోవాలని టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఎంఐఎం ముఖ్యనేతలతో మద్దతు కోసం హైదరాబాద్ స్థాయిలో చర్చలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తాజా పరిస్థితులను తమకు అనుకూలంగా మల్చుకొని చైర్‌పర్సన్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నది.
టీఆర్‌ఎస్ నుంచి రేసులో నలుగురు..
స్పష్టమైన మెజార్టీ రాకపోయినప్పటికీ చైర్‌పర్సన్ పదవిపై టీఆర్‌ఎస్ ఆశలు పెట్టుకున్నది. ఎలాగైనా మెజార్టీ నిరూపించుకొని చైర్‌పర్సన్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నది. ఇందులో భాగంగా చైర్‌పర్సన్ పదవి కోసం టీఆర్‌ఎస్‌లో పైరవీలు మొదలయ్యాయి. తమకు అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నుంచి గెలిచిన మహిళా కౌన్సెలర్లు పట్టుబడుతున్నారు. ఈవిషయంలో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్థానిక మాజీ ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు బైండ్ల విజయ్, కరణం పురుషోత్తంరావు, రవూఫ్,సిద్రాల శ్రీనివాస్,రంగారావు తదితరులు రహస్యంగా సమావేశమయ్యారు.
చైర్‌పర్సన్ రేసులో పరిమళ, కోట్రిక విజయలక్ష్మి, నీరజ, సింధూజలు ఉన్నారు. కౌన్సిలర్‌గా గెలిచిన పరిమళ ఈ విషయంలో గట్టిగా పట్టుబడుతున్నది. మహేందర్‌రెడ్డి ముందు ఉదయం పరిమళ సన్నిహితులు పెద్ద సంఖ్యలో బల నిరూపణకు దిగారు. తమకు నలుగురు పార్టీ కౌన్సెలర్ల మద్దతు కూడా ఉందని వారుస్పష్టం చేశారు. ఈనెల 16వ తర్వాత చైర్మన్ పదవిపై నిర్ణయం తీసుకుందామని మహేందర్‌రెడ్డి వారికి సర్దిచెప్పారు.
చైర్‌పర్సన్ కుర్చీ కోసం కుస్తీ
Published Tue, May 13 2014 12:38 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement