రోడ్ షాలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
సాక్షి, పాలమూరు: మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే.. మజ్లిస్ అభ్యర్థిని చైర్మన్ చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో, భూత్పూర్‌లో శుక్రవారం బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్ షోలో లక్ష్మణ్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. హిందూ, మైనార్టీల మధ్య కేసీఆర్ తాకట్లు పెట్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నాడని ఆరోపించారు.
పౌరసత్వ బిల్లుపై అనవసరపు రాద్దాంతం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కుట్రలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరిచారని, రైతు బంధు ఆగిపోయిందని, రెండు పడక గదులు పడకేశాయని, యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామనే మాట కలగానే మిగిలిందని ఎద్దేవా చేశారు. స్వచ్ఛభారత్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ ఇస్తే సొంత పథకాలుగా మార్చి వినియోగించుకుంటున్నారన్నారని ఆరోపించారు.
స్వప్రయోజనాల కోసమే కలెక్టరేట్ మార్పు : డీకే అరుణ
మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ ఐదు జిల్లాలకు సరిపోయిన కలెక్టరేట్‌ను ప్రస్తుతం ఇక్కడి నుంచి మార్చే ప్రయత్నం చేస్తున్నారని దీని వెనుక అసలు కారణం ప్రజాప్రయోజనాలు కాదని అక్కడ ఉన్న నేతల భూముల ధరలు పెంచుకోవడం మాత్రమేనని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే పాత కలెక్టరేట్‌ను విద్యా ప్రాంగణంగా మారుస్తామని చెప్పారు.
అదేవిధంగా మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్‌రెడి మాట్లాడుతూ మహబూబ్‌నగర్ డబుల్ రైల్వే లైన్, పాస్‌పోర్టు కార్యాలయాలు, ఇతర పనులు అన్ని కేంద్ర నిధులతో జరుగుతున్నట్లు తెలిపారు. పాలమూరు పట్టణంలో చాలా అభివృద్ధి పనులు కేంద్రం నుంచి వచ్చే నిధులతో చేస్తున్నారని, దానిని ఈ ప్రభుత్వం వారి ఖాతాలో వేసుకోవాలని చూస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, జిల్లా అధ్యక్షురాలు పద్మాజారెడ్డి, పడకుల బాలరాజు, శ్రీనివాస్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి,పొడపాటి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment