తాండూరు, న్యూస్‌లైన్: తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక వ్యవహారం ఆసక్తిగా మారింది. ఎంఐఎం, టీఆర్‌ఎస్ మధ్య రాష్ట్ర స్థాయిలో రాజకీయ అవగాహన కుదిరిన నేపథ్యంలో ఇక్కడ చైర్‌పర్సన్ పదవిని ఏ పార్టీకి దక్కుతుందోనని సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈనెల 12న ఫలితాలు వెల్లడయ్యాయి. టీఆర్‌ఎస్-10, ఎంఐఎం -10 కౌన్సిలర్ స్థానాలను దక్కించుకున్నాయి. రెండు పార్టీలకు పూర్తి స్థాయిలో ఆధిక్యత (16 స్థానాలు) లభించలేదు. దీంతో ఇరు పార్టీల స్థానిక నాయకత్వాలు అధిష్టానం నిర్ణయానికి చైర్‌పర్సన్ ఎంపిక వ్యవహారాన్ని అప్పగించాయి.
రాష్ర్ట స్థాయిలో టీఆర్‌ఎస్, ఎంఐఎంల మధ్య రాజకీయ అవగాహన కుదిరినందున ఎంపిక ఇప్పుడు చిక్కుముడిగా మారింది. ప్రస్తుతానికి ఎంఐఎం చైర్‌పర్సన్ పదవిని ఆశిస్తున్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఇటీవల దారుసలాంలో జరిగిన పార్టీ శ్రేణుల సమావేశంలో పార్టీ తాండూరు అధ్యక్షుడు హాదీ కూడా దేవుని దీవెనలుంటే చైర్‌పర్సన్ స్థానాన్ని దక్కించుకుంటామని ప్రస్తావించారు. ఆయన ప్రసంగం తీరును బట్టి చైర్‌పర్సన్ స్థానాన్ని ఎంఐఎం ఆశిస్తున్నట్టు స్పష్టమవుతోంది. టీఆర్‌ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన పట్నం మహేందర్‌రెడ్డికి ఈ విషయంలో సంకటంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. చైర్‌పర్సన్ అభ్యర్థి విజయాదేవి ఓడిపోయినందున టీఆర్‌ఎస్ నుంచి నీరజ, సింధూజ, కోట్రిక విజయలక్ష్మి, శోభారాణి, పరిమళ చైర్‌పర్సన్ పదవి రేసులో ఉన్నారు.
ఇందులో ఎవరికో ఒకరి అవకాశం ఇవ్వాలని ఇప్పటికే ఆశావహులు ఎమ్మెల్యేను అభ్యర్థించారు. అసలు అవకాశం వస్తుందా.. రాదా? అనే విషయం పక్కన పెడితే సమాన వార్డు కౌన్సిలర్లను గెలుచుకొని చైర్‌పర్సన్ పదవికి ఎంఐఎం టీఆర్‌ఎస్ పోటీకి దిగటం ఆసక్తిగా మారింది. ఎమ్మెల్యే ఫలితాలు వెల్లడైన తరువాత చైర్‌పర్సన్ వ్యవహారం కొలిక్కి వస్తుందని ఆశిస్తున్న టీఆర్‌ఎస్ నాయకులకు ఎంఐఎం కూడా చైర్‌పర్సన్ రేసులో ఉండడం అయోమయంగా మారింది. రెండు పార్టీల అవగాహన ప్రకారం చేరి రెండున్నరేళ్లు చైర్‌పర్సన్‌పదవిని పంచుకుంటాయా? లేదా ఇతర పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్ పూర్తిస్థాయి చైర్‌పర్సన్ పదవిని కైవసం చేసుకుంటుందా? అనేది ఉత్కంఠగా మారింది.
తాండూరు మున్సిపల్ పీఠం ఎవరిదో!
Published Thu, May 22 2014 12:19 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement